గోవాలో భూములు అన్యాక్రాంతం
అభివృద్ధిని గాలికొదిలేశారు
బీజేపీతో విసిగిపోయిన ప్రజలు :సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గోవాలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ పాలనతో అక్కడి ప్రజలు విసిగిపోయారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆ రాష్ట్రంలో నైస్, ఐస్ బీజేపీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా పని చేసి రెండు సార్లు అధికారంలోకి తెచ్చాయనీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. దీంతో ఓట్లను తొలగించటం ద్వారా మూడోసారి అధికారంలోకి రావడానికి కమలం పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోవా కాంగ్రెస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అక్కడి చీఫ్టెన్స్ స్మారకం నుంచి కున్కోలిమ్ బస్టాండ్ వరకు నిర్వహించిన పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ గోవాలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అక్కడి ప్రజలు పరాయివారవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం గోవాకు రాహుల్ గాంధీ రావాల్సి ఉన్నప్పటికీ ఢిల్లీలో నిరసన కార్యక్రమాల నేపథ్యంలో రాలేకపోయారనీ, ఆయన ప్రతినిధిగా తాను వచ్చానని రేవంత్ రెడ్డి చెప్పారు. బీజేపీ పాలనలో గోవా భూములు అన్యాక్రాంతమవుతున్నాయనీ, అభివృద్ధిని పక్కన పెట్టిన గోవా సీఎం స్థానిక ఆస్తులను ఇతరులకు అప్పగించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. యువతను డ్రగ్స్ కు బానిసలుగా మార్చి గోవా ను డ్రగ్స్ సోర్స్, డ్రగ్స్ పెడ్లర్స్ అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నషా ముక్త్ భారత్ అంటున్న పీఎం, కేంద్ర హోంశాఖ మంత్రి గోవాలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. గోవా పేరు చెడిపోవద్దన్నదే కాంగ్రెస్ ఆకాంక్ష అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యువత డ్రగ్స్ బానిక కావద్దని కోరారు. గోవాలో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఏ పార్టీకి వేసిన ఆ ఓటు బీజేపీకే పోతుందని అప్రమత్తం చేశారు. డ్రగ్స్ లార్డ్స్, ల్యాండ్ మాఫియా గోవాలో రాజ్యమేలకుండా చూసుకోవాలని సూచిం చారు. రెండు సార్లు బీజేపీని నమ్మి మోసపోయారనీ, మూడోసారి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అంటే రావణుడనీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాముడనీ, ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. రావణుడిని ఓడించాలంటే ప్రజలు రామునికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారనీ, భారత్ జోడో యాత్ర చేశారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విభజించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గోవా ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరముందని తెలిపారు. దేశంలో రుతు పవనాలు ప్రవేశించే సమయంలో 2026లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందనీ, 2027 మాన్ సూన్ లో గోవాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని చెప్పారు. గోవా నుంచి నేరుగా ఢిల్లీ ఎర్ర కోటపై మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
స్థానిక గుర్తింపును కాపాడుకునే యాత్ర
గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత నెల 22న పనాజీలో గోయ్ రాఖోన్న్ యాత్ర ప్రారంభమైంది. 27 రోజుల పాటు 40 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగనున్నది. ఈనెల 18న యాత్ర ముగియనున్నది. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపును కాపాడుకోవడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. అధికార బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు గోవా కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.







కామెంట్‌లు (0)