నందనంలో తుప్పుపడుతున్న యంత్రాలు..
ప్రారంభించాలని కోరుతున్న గీత కార్మికులు..కొత్త విధానాల పాలసీ రూపకల్పన అమలు ఎప్పుడు ?
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్
రాష్ట్రంలో గీత కార్మికులకు అండగా నిలిచేందు కు ఏర్పాటైన నీరా పాలసీ, నీరా ప్రాసెసింగ్ ప్లాంట్లు, నీరా కేఫ్‌ల నిర్వహణ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. గత ప్రభుత్వంలో అట్టహాసంగా నీరా ప్రాజెక్టును ప్రారంభించినా ఆ తర్వాత అనుకున్నంత వేగంగా ముందుకు అడుగులు పడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నీరాను హెల్త్ డ్రింక్‌గా మార్చి స్టార్ హాటల్స్‌కు లింక్ చేసి కొత్త విధానాల రూపకల్పనకు ఏర్పాట్లు చేస్తామని ప్రకటన చేసింది. ప్రారంభంలో ఉన్న ఉత్సాహం ఆ తర్వాత చూపలేదన్న విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో గత బీఆర్‌ఎస్ హయాంలో నీరా కేఫ్ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా నీరా కేఫ్‌ను సరఫరా చేయడానికి భువనగిరి జిల్లా నందనం, రంగారెడ్డి జిల్లా ముద్విన్, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, నల్లగొండ జిల్లా సర్వేల్‌లో నీరా సేకరణ కేంద్రాలు, ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు జరిగాయి. అయినా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రూ.12 కోట్లతో నందనంలో ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ యూనిట్ వినియోగంలోకి రాకముందే అందులో ఉన్న యంత్రాలు తుప్పుపట్టాయి. ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తోంది. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నీరా ప్రాజెక్టు నేపథ్యం
భువనగిరి మండలంలోని నందనం గ్రామం లో నీరా ప్లాంట్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఎన్నో ఏండ్లుగా పోరాడుతూ వచ్చింది. దీంతో నీరా ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు నందనంలో నాలుగు ఎకరాల్లో భవనం నిర్మించేందుకు రూ.8కోట్లు విడుదల చేసింది. 2022 జులై 29న అప్పటి మంత్రి ఎక్సైజ్ శాఖ శ్రీనివాస్ గౌడ్, అప్పటి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నీరా కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన తర్వాత ఏడాదిలోనే భవన నిరాణాలు పూర్తయ్యాయి. నీరా కేంద్రంలో నిల్వకు అవసరమైన వివిధ రకాల యంత్రాలు అమర్చారు. కానీ ప్రారంభం కాలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని నీరా ప్రాజెక్టును ప్రారంభించాలని గీత కార్మికులు కోరుతున్నారు.
స్టోరేజీ, ప్యాకింగ్, రవాణా అన్నీ ఇక్కడే
రాష్ట్రంలోనే తొలిసారిగా నీరా ఉత్పత్తి కేంద్రం నందనంలో ఏర్పాటైంది. ఇది అందుబాటులోకి వస్తే.. నీరాను ఉదయాన్నే చెట్టు నుంచి తీసి నందనం ప్లాంట్‌కు తీసుకొస్తారు. నీరా కల్లుగా మారకుండా ఇక్కడే ప్రాసెస్ చేస్తారు. రోజూ రెండు వేల లీటర్ల నీరా.. కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి నుంచే ప్యాక్డ్ నీరాను హైదరాబాద్ కేఫ్‌తోపాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తారు. సేకరణ, స్టోరేజీలు, ప్యాకింగ్, రవాణా నందనం నుంచే జరుగుతుంది. నీరా అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేసే వీలుంటుంది. తాటి బెల్లం, చక్కెర, చాక్లెట్లు, తేనె వంటి 18రకాల వస్తువులను తయారు చేసే అవకాశం ఉంది. దాంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వెంటనే ప్రారంభించాలి :
వట్టిపల్లి పవన్ గౌడ్
నందనం నీరా ప్రాజెక్టును వెంటనే ప్రారంభించి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పిల్లల బతుకులు బాగుపడతాయని చూశా.1993లో ఒకసారి ప్రారంభం కాగా, కొన్ని రోజులు మూత పడింది.
మా పిల్లలైనా ప్రాజెక్టు
ప్రారంభాన్ని చూస్తారా? .. :
మట్ట బాలేశ్వర్ గౌడ్
2022లో ప్రారంభిస్తారని అనుకున్నాం. ఇప్పటివరకు ప్రారంభించలేదు. మేము చూడకపోయినా మా పిల్లలైనా ప్రాజెక్టు ప్రారంభం చూస్తారా లేదో తెలియడం లేదు.
ప్రభుత్వానికి నివేదికలు పంపాం :
ఎక్సైజ్ సూపరింటెండెంట్ తూక్యానాయక్
నీరా ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ప్రారంభిస్తాం.
ఒకే ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపన : 1993 నవంబర్ 13న మాజీ మంత్రులు గాదె వెంకట్‌రెడ్డి, కె.జానారెడ్డి నందనంలో రూ.70లక్షల అంచనా వ్యయంతో తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ అది ముందుకు కొనసాగలేదు. దశాబ్దాలుగా మూతబడిన నందనం తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు గత బీఆర్‌ఎస్ సర్కారు 2022లో ముందుకొచ్చింది. 8 కోట్లతో నిర్మాణం చేపట్టి, యంత్రాలు బిగించింది కానీ ప్రారంభించ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అక్టోబర్ 2026 నాటికి మూడేండ్లు పూర్తవుతుంది.







కామెంట్‌లు (0)