Magazines

ఎందుకీ గోప్యత?

1 గంట క్రితం

Why this secrecy?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

శాసనసభ ముందుకు రాని 8 'కాగ్‌' నివేదికలు

513 రోజులుగా పెండింగ్‌లోనే 
2023 -24 ఆర్థిక నివేదిక

ప్రస్తుత ప్రభుత్వ లెక్కలదీ అదే పరిస్థితి
రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శలు

ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 
2022 నాటి రిపోర్టులు పెట్టిన ప్రభుత్వం

ప్రజల్లో చర్చ జరక్కుండా ఉండటమే లక్ష్యం


ఎస్‌ఎస్‌ఆర్‌ శాస్త్రి
'కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌' (కాగ్‌) నివేదికలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుం టున్నారా? అంటే 'అవును' అనే సమాధానాలే వస్తున్నాయి. సహజంగానే ప్రభుత్వ లెక్కల్లోని డొల్లతనాన్ని నిర్మొహమాటంగా పాలకులకు నివేదికల రూపంలో 'కాగ్‌' చెప్పేస్తుంది. నిధుల కేటాయింపు, విడుదల, ఖర్చు, క్షేత్రస్థాయి ఫలితాలు సహా అనేక అంశాలను 'కాగ్‌' స్వయంగా పరిశీలించి, పాలకుల తప్పొప్పులను ఎత్తిచూ పుతుంది. వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు ఆయా శాఖలపై విచారణలు జరిపించడం, కమిటీలు వేయడం, విధానపరంగా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్లడం ఆనవాయితీ. 'కాగ్‌' రిపోర్టుల లక్ష్యం కూడా అదే. రాజ్యాంగంలోని 151వ అధికరణం ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన కాగ్‌ నివేదికలను గవర్నర్‌కు సమర్పించి, వాటిని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచుతారు. 'కాగ్‌' తన నివేదికలను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఉద్దేశించినవిగా స్పష్టంగా పేర్కొంటుంది. కానీ ఇప్పుడా పరిస్థితి మారినట్టు కనిపిస్తుంది. కేవలం రాజకీయ కారణాలతో 'కాగ్‌' నివేదికలను ప్రభుత్వాలు శాసనసభలో చర్చకు పెట్టట్లేదు.

గమ్మత్తుగా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఓ ఐదారేండ్ల క్రితంనాటి రిపోర్టులను సభలో పెడతారు. పాత రిపోర్టులు కాబట్టి వాటిపై ఎవరికీ ఆసక్తి ఉండదు. వాటిమీద చర్చా ఉండదు. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల్లో 2022 నాటి 'కాగ్‌' నివేదికలను సభలో పెట్టారు. వాటిపై ఎలాంటి చర్చా జరగలేదు. కానీ 'కాగ్‌' ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన రిపోర్టులను ఇస్తూనే ఉంటుంది. ఆ నివేదికల్లో ఆదాయాలు, వ్యయాలు, అప్పులు, బడ్జెట్‌ నిర్వహణ, ఆర్థిక లోటు సహా అనేక అంశాలు ఉంటాయి. తాజా గణాంకాలపై సభలో చర్చించేందుకు ప్రభుత్వాలు ముందుకు రావు. తమ డొల్లతనం వెల్లడవుతుందనే భయం, ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించినట్టు అవుతుందనే ఆందోళనలు దీనికి కారణాలు కావొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? నిధుల్ని ఎలా ఖర్చు చేస్తున్నాయి? అనే ప్రాధమిక పరిశీలన ప్రజల హక్కు. 'కాగ్‌' నివేదికలను తొక్కిపెట్టడం వల్ల ఆ హక్కును ప్రజలు కోల్పోతున్నారని సామాజిక, ఆర్థికరంగ విశ్లేషకులు చెప్తున్నారు.


'సభ'కు రాని లెక్కలు

2023-24 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి : 2/2025 నివేదికను 'కాగ్‌' 2025 మే 9వ తేదీ ప్రభుత్వానికి పంపింది. ఈ ఏడాది అక్టోబర్‌ 4వ తేదీ నాటికి 513 రోజులు గడచిపోయాయి. ఇప్పటి వరకు ఆ రిపోర్టు శాసనసభ ముందుకు రాలేదు.
రాష్ట్ర ఆదాయాలు : 6/2025 నివేదికను 2025 నవంబర్‌ 13న 'కాగ్‌' ప్రభుత్వానికి పంపింది. 325 రోజులు గడచిపోయాయి. ఇప్పటి వరకు శాసనసభ ముందుకు రాలేదు.
ఖనిజ ప్రాంత సంక్షేమ పథకం, జిల్లా ఖనిజ నిధులు : 5/2025 నివేదికను 'కాగ్‌' 2025 నవంబర్‌ 25న ప్రభుత్వానికి పంపింది. 313 రోజులు అయినా సభలో చర్చకు రాలేదు.

అనుసరణ పరిశీలన : 7/2025 నివేదికను 2026 జనవరి 16న 'కాగ్‌' ప్రభుత్వానికి పంపింది. 261 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఆ నివేదిక ప్రజల ముందుకు రాలేదు.
గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు : 8/2025 నివేదికను 'కాగ్‌' 2026 ఫిబ్రవరి 9న ప్రభుత్వానికి నివేదించింది. 237 రోజులు పూర్తయ్యాయి. ప్రభుత్వం శాసనసభలో చర్చకోసం పెట్టలేదు.

స్థానిక సంస్థలు : 1/2026 నివేదికను 2026 మార్చి 2వ తేదీ ప్రభుత్వానికి 'కాగ్‌' ఇచ్చింది. 216 రోజులు పూర్తయ్యాయి. చర్చ లేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2024-25 : 2/2026 నివేదికను 'కాగ్‌' 2026 మార్చి 30వ తేదీ ప్రభుత్వానికి సమర్పించింది. 188 రోజులు గడిచిపోయాయి. అసెంబ్లీలో చర్చకు రాలేదు.

రాష్ట్ర ఆదాయాలుాపన్నేతర ఆదాయాలు : 3/2026 నివేదికను 2026 ఏప్రిల్‌ 22న 'కాగ్‌' ప్రభుత్వానికి పంపింది. 165 రోజులు గడిచినా ప్రజాక్షేత్రంలో చర్చకు రాలేదు.


మొక్కుబడిగా పాత లెక్కలు

'కాగ్‌' రిపోర్టులను ప్రభుత్వాలు మొక్కుబడి తంతుగానే చూస్తున్నాయి. గడచిపోయిన కాలం కావడంతో ఆ గణాంకాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. దీనితో 'కాగ్‌' లేవనెత్తిన అభ్యంతరాలు, ఆక్షేపణలకు సమాధానాలు వచ్చే పరిస్థితులు లేవు. ఈ ఏడాది మార్చిలో జరిగిన శాసనసభ సమావేశాల చివరి రోజైన 30వ తేదీ ప్రభుత్వం కొన్ని కాగ్‌ రిపోర్టులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
-2022 మార్చితో ముగిసిన కాలానికి సంబంధించిన సాధారణ, సామాజిక, ఆర్థిక రంగాల అనుసరణ పరిశీలన నివేదిక సంఖ్య 3/20255 - 2022 మార్చితో ముగిసిన కాలానికి సంబంధించిన స్థానిక సంస్థల నివేదిక సంఖ్య 1/2025 - 2022 మార్చితో ముగిసిన కాలానికి సంబంధించిన భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమంపై నివేదిక సంఖ్య 5/2024. ఈ మూడు నివేదికలను 2026 మార్చి 30న సభలో ప్రవేశపెట్టారని స్వయంగా కాగ్‌ వెల్లడించింది.


'రాజకీయం' అయితే వెంటనే...
ప్రభుత్వాలకు పొలిటికల్‌ మైలేజ్‌ వస్తుందని భావిస్తే 'కాగ్‌' రిపోర్టులు ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే శాసనసభ ముందుకు వచ్చేస్తాయి. నివేదికను బట్టి సభలో ప్రవేశపెట్టే వ్యవధి మారుతూ వస్తున్నది. ఆ ఉదాహరణలు ఇలా...

- కాళేశ్వరం ప్రాజెక్టుపై 'కాగ్‌' నివేదికను 2024 జనవరి 29న ప్రభుత్వానికి పంపగా, ఫిబ్రవరి 15న అంటే 17 రోజుల్లోనే శాసనసభలో ప్రవేశపెట్టారు. - 2023-24 రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదికను 2024 మే 8న ప్రభుత్వానికి పంపగా, ఆగస్టు 2న సభలో ప్రవేశపెట్టారు.

- ఆరోగ్య మౌలిక వసతులు, ఆరోగ్య సేవల నిర్వహణపై నివేదికను 2024 జూలై 15న పంపగా ఆగస్టు 2న సభలో ప్రవేశపెట్టారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్