చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం
అప్పుల ఊబిలో అన్నదాతలు
ఈసారి చిల్లిగవ్వా రాని పరిస్థితి... ప్రభుత్వం మీదే ఆశలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘ఉందామంటే ఇల్లు లేదు. అడవిలో అయ్య వోదిచ్చిన ఎవుసం లేదు. రెక్కల మీది కష్టంతో బతుకుతున్నం. కౌలుకు తీసుకొని పొలం పండించేందుకు పంట ఖర్చులకు ఓ అయ్య దగ్గర అప్పు తెచ్చినం. పంటల మీద ఆధారపడి పంట చిట్టీ ఏసుకున్నం. ఇప్పుడు చిట్టీలు ఎట్ట కట్టాలి..? పంట ఎండితే చిట్టి ఎత్తుకుందమన్నా.. పంట ఎండిపోయిందని చిట్టీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తే ఓ డబ్బానో, ఓ తాడో చేత పట్టుకునేదే ఉంది. ఒక్క దెబ్బతో పదేండ్లు ఎనుకకుబోయినం. పంట నష్టం లక్షల్లో ఉండడంతో అప్పు తీర్చలేక అడ్డీ కట్టలేక అయోమయంలో పడ్డం. జేసిన అప్పు తీర్వకుండనే సస్తే అప్పు ఇచ్చినోళ్ల రుణంలో పోయినట్టే.. బాధలు సెప్పుకుంటే తీరవు’... ఇదీ పంటలు ఎండిపోయిన రైతులను ‘నవతెలంగాణ’ పలకరించగా వారు వెల్లబోసుకున్న గోడు. ఈ యేడు ఎల్నినో ప్రభావంతో చిన్న, సన్న కారు రైతులతో పాటు కౌలు రైతులూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం సీజన్లో నిజామాబాద్ జిల్లాలో 4.36 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
ఒక వైపు నేరుగా ప్రయివేటు వ్యాపారులే వచ్చి మద్దతుకు మించిన ధర చెల్లిస్తూ పంటను కొనుగోలు చేస్తుండగా.... మరో వైపు పలువురు రైతులకు పంటకు సరిపడా నీరు అందక, బోరుబావులు ఎత్తిపోయి వరి ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి, ఇందల్వాయి, నవీపేట్, వర్నితో పాటు తదితర మండలాల్లో వరి పంటలు ఎండుముఖం పట్టాయి. వ్యవసాయాధికారులు పంట నష్టపోయిన వివరాలు నమోదు చేసుకున్నా.. ఉన్నతాధికారుల ఒత్తిడితో ఈ నష్టపోయిన వివరాలు అందజేయడం లేదు. బోరుబావుల్లో నీరు లేక కొన్నిచోట్ల, నీళ్లున్నా సరిపడా కరెంట్ రాక మరి కొన్ని చోట్ల వరి ఎండిపోయింది. నవీపేట్ మండలంలో లక్ష్మి వెంకటేశ్వర ఎత్తిపోతల పథకంలో బోరుమోటార్ కాలిపోవవడంతో పంట పొట్ట దశలో నీరందక సుమారు 200 ఎకరాల మేర పంటలకు నష్టం వాటిల్లింది. ఇలా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 2500, కామారెడ్డిలో 1500 ఎకరాల వరకు వరికి నష్టం వాటిల్లింది. ‘ఎకరానికి రూ.30 వేల వరకు వెచ్చించినం, పెట్టుబడులతో పాటు పంట చేతికి రాక సుమారు రూ.211 కోట్ల మేర నష్టం వాటిల్లింది’ అని రైతులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
పెరుగుతున్న పంట ఖర్చులు
పంట ఖర్చులు ఏటికేడు పెరుగుతుండగా, సాగు చేస్తే మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి ఉంది. దుక్కి దున్నడం మొదలు.. కోతకు వచ్చి వడ్ల కుప్పలు పోసి ఆరబెట్టే వరకు ప్రతి పనికి డబ్బులతో ముడిపడి ఉంది. నాట్లు వేసే ముందు వరకు దుక్కి దున్నడం, దమ్ము కొట్టేందుకు ఎకరానికి రూ.5 వేలు ఖర్చవుతుండగా, నాట్లకు రూ.5500, బీస్బీస్ మందు రెండు సార్లు, పోటాష్, యూరియాకు కలిపి సుమారు రూ.7 వేలు, పలు దఫాలుగా కలుపు మందు, పురుగుల మందు నివారకు స్ర్పే చేసేందుకు గాను రూ.5వేల నుంచి 6 వేల వరకు వెచ్చిస్తున్నారు. వరి కోతకు గంటకు రూ.2800 చొప్పున వెచ్చించాల్సి ఉండగా.. ఎకరం కోతకు గంట నుంచి గంటన్నర సమయం, వడ్లను ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు ఇలా అన్ని కలిపి సుమారు రూ.30 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే చేతికి ఎంతో కొంత మిగులుతుండగా... కాలం కలిసిరాకపోతే అప్పుల్లో కూరుకుపోతామని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎకరంన్నర పొలంలో పంట వేశా. లిప్టు నుంచి నీళ్లు రాక ఉన్న పొలం ఎండిపోయింది. మోటర్ కాలిపోయింది. చేయించే వరకు ఆలస్యం అయ్యింది. దీంతో ఉన్న పంట మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు నీళ్లు వస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది. నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయాలి. ఎకరంన్నరకు ఇప్పటి వరకు రూ.50 వేల వరకు ఖర్చు పెట్టినం. ఏఈవో సార్ వచ్చి రాసుకుపోయ్యిర్రు. నష్టపరిహారం అందజేసి ప్రభుత్వమే ఆదుకోవాలి.
- చిన్న లస్మన్న. నిజాంపూర్.
నవీపేట్. నిజామాబాద్
ఎట్లా బతకాలి
అప్పులు చేసే పంట ఖర్చులు ఎల్లదీస్తం. పంట వచ్చినంక అడ్డితో కలిపి అసలు కట్టెస్తం. మరో పంట వేసేందుకు మళ్లీ అప్పుచేసే ఖర్చు పెడతం. కానీ ఈసారి పంట ఎండింది. అప్పు ఎట్ల కట్టాలో తెలుస్తలే. వేసిన మూడు ఎకరాల్లో వరి ఎండింది. నష్టపోయిన పంటల లెక్కలు అధికారులు వచ్చి తీసుకుపోయ్యిర్రు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. - కల్లెం బాబన్న. లింగాపూర్. నవీపేట్







కామెంట్లు (0)