– తిరుమలగిరిలో నూతన కార్డుల పంపిణీ ప్రారంభం
– కాళేశ్వరం కూలేశ్వరం అయింది
– తులసీవనంలో గంజాయి మొక్కలను పీకేయండి
– తుంగతుర్తికి గోదావరి జలాలు తీసుకొస్తా
– 2034 వరకు కాంగ్రెస్‌దే అధికారం : ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
”ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది.. ప్రజాధనాన్ని వృథా చేసిన వారిని కాళేశ్వరంలో ఉరి తీయాలి.. తులసీవనంలో గంజాయి మొక్కలను పీకేయాలి.. తుంగతుర్తికి మేము గోదావరి జలాలు తీసుకొస్తాం.. రేషన్‌కార్డు పేదల ఆత్మగౌరవానికి సూచిక..” అని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో సోమవారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురాని ముఖ్యమంత్రిని అడ్డుకుంటామని సూర్యాపేట ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. మూడ్రోజులు సమయం ఇస్తే గోదావరి జలాలు తెస్తానని గొప్పలు పలికిన ఆయన పదేండ్లు అధికారంలో ఉండి గడ్డి పీకారా? అని ప్రశ్నించారు. వాళ్లు దేవాదుల నుంచి కూడా నీళ్లు తేలేదన్నారు. ‘మూడు అడుగుల జగదీశ్‌రెడ్డి.. గోదావరి జలాలు తేవడం అంటే గ్లాస్‌లో సోడా కలపడమా.. నా కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రగల్భాలు పలుకుతున్నావు.. తుంగతుర్తి గడ్డ మీద సవాల్ విసురుతున్న.. మా దామన్న ఒక్కడు చాలు నీ కథ ఏందో చూడటానికి’ అని అన్నారు. తులసీవనంలో గంజాయి మొక్కలా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను ఇక్కడ ఒక్క చోట గెలిచావు.. వచ్చే ఎన్నికల్లో గంజాయి మొక్కను పీకే బాధ్యత మా అక్కలదే అని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మండల, గ్రామస్థాయిలో అన్ని చోట్లా గెలిపించే బాధ్యత పార్టీదేనని, ఒక్క గంజాయి మొక్క కూడా గెలవడానికి వీల్లేదని ఆ బాధ్యత మీరే తీసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. రూ.50 వేలతో తుంగతుర్తికి వస్తే 60 వేల మెజార్టీతో సామెల్‌ను గెలిపించారని, ఏ ఎన్నికల్లో అయినా నేతలను గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుం దని చెప్పారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని అన్నారు. ”బీఆర్‌ఎస్ నేతలంతా కట్టకట్టుకుని రండి.. మీరంతా ఒకవైపు.. మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు” అని సవాల్ విసిరారు.
త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు
త్వరలోనే గ్రామపంచాయతీ ఎన్నికలు రానున్నాయని, తమ ప్రభుత్వం దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో జనగణన, కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 5.6 లక్షల నూతన రేషన్ కార్డుల పంపిణీతో పాటు, 26 లక్షల మంది పేర్లను కార్డుల్లో చేర్చడం ద్వారా మొత్తం 3 కోట్లా 10 లక్షల మందికి సన్నబియ్యం అందించనున్నామని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా గడిచిన పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, సన్నబియ్యంతో అన్నం పెట్టాలన్న ఆలోచన చేయలేదని చెప్పారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామనీ, తొమ్మిది రోజుల్లో రూ.9వేల కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేశామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు 70 సంవత్సరాలు గడిచినా చెక్కుచెదరలేదని, మూడేండ్లలో కట్టిన కాళేశ్వరం మాత్రం అప్పుడే కూలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పుడు రైతులను ఆదుకుంటున్నాయన్నారు.
ఆడబిడ్డలకు ఆసరాగా..
మహిళా సాధికారతలో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాల్లోని ప్రతి ఆడబిడ్డకూ రెండు చీరలు ఇస్తున్నామని, రూ.21 వేల కోట్లు జీరో వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పించామని సీఎం అన్నారు. 600 బస్సులు కొనుగోలు చేసి మహిళల ద్వారా ఆర్టీసీకి కిరాయికి ఇప్పించి వారిని యజమానులను చేశామని తెలిపారు. మహిళల ద్వారానే సోలార్ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసే విధంగా 1000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఇస్తున్నామన్నారు. రెండున్నర సంవత్సరాల తమ పాలన పూర్తయ్యేలోపు లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
గోదావరి జలాలతో సస్యశ్యామలం
తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జిల్లాలు తీసుకొచ్చి సస్యశ్యామలం చేస్తామని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువలను పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అడ్లురి లక్ష్మణ్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్‌గౌడ్, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌రావు, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రామచంద్రు నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు సామేల్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మురళినాయక్, యశస్వినిరెడ్డి, శంకర్ నాయక్, లక్ష్మారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.