Tuesday, May 13, 2025
Homeరాష్ట్రీయంకమర్షియల్‌ ట్యాక్స్‌ లక్ష్యాలను చేరుకున్నాం..

కమర్షియల్‌ ట్యాక్స్‌ లక్ష్యాలను చేరుకున్నాం..

- Advertisement -

– ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్ల గుర్తింపును విస్తృతంగా వినియోగించాలి
– ట్రైబల్‌ సొసైటీల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గత సంవత్సరంతో పోలిస్తే వాణిజ్య పన్నుల శాఖలో మొత్తంగా ఆరు శాతం ప్రగతి కనిపించిందని, ఇది ఒక మంచి పరిణామమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో డిప్యూటీ సీఎం అధ్యక్షతన రిసోర్స్‌ మొబలైజేషన్‌ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కమిటీలో సభ్యులైన మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు ఈ భేటీలో పాల్గొన్నారు. మార్చిలో సీఎస్టీ, వ్యాట్‌ రూపంలో ఓవరాల్‌ గ్రోత్‌ 600 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా సుమారు రూ.500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరింది.. ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్సైజ్‌ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు. అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు, ఓపెన్‌ ఫ్లాట్ల విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదని అన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రుల బందం అధికారులను ఆదేశించింది.
రవాణా శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్‌ నెంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ను వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని, పెద్ద మొత్తంలో తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశించింది. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్‌ సొసైటీల్లో సభ్యులుగా చేర్చాలని కోరింది. గిరిజన సంక్షేమ శాఖ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి పకడ్బందీగా అమలు చేసి అసలైన గిరిజనులకు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. జిల్లా కేంద్రాల్లో ఉన్న విలువైన భూములను గుర్తించి వాటిని సంరక్షించే బాధ్యతలు వెంటనే చేపట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించింది. నిర్మాణ అనుమతుల విషయంలో హెచ్‌.ఎమ్‌.డీ.ఏ. వేగం పెంచాలని ఆదేశించింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకష్ణారావుతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
లైన్‌మెన్‌ నుంచి సీఎమ్‌డీ వరకూ ఒకే తరహా యూనిఫారాలు
– విద్యుత్‌ సిబ్బంది అందరికీ డ్రెస్సులు : డిప్యూటీ సీఎం భట్టి
విద్యుత్‌ శాఖలో పని చేసే లైన్‌మెన్‌ నుంచి సీఎమ్‌డీ వరకూ అందరికీ ఒకే తరహా యూనిఫారాలను తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్‌లోని నిఫ్ట్‌తో డిజైన్‌ చేయించి, శాఖలోని సిబ్బంది అందరికీ డ్రెస్సులు ఇస్తామని ఆయన వెల్లడించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉద్యోగులు, సిబ్బందితో డిప్యూటీ సీఎం ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత మార్చిలో 17,162 మెగావాట్లకు పైగా పీక్‌ డిమాండ్‌ వచ్చినప్పటికీ ఒక్క నిమిషం కూడా అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేశామని తెలిపారు. ఈ క్రమంలో ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పని చేస్తున్న సిబ్బందిని తమ ప్రభుత్వం తగిన గుర్తించి, గౌరవిస్తుందని వివరించారు. అందులో భాగంగానే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను తాము అధికారంలోకి రాగానే పరిష్కరించామనీ, తద్వారా వేల మందికి పదోన్నతులు కల్పించామని గుర్తు చేశారు. ఇతర సమస్యలను కూడా వెంటనే పరిశీలించి, పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన హామీనిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -