కానీ దాని వైఖరి వేరేలా ఉంది
లౌకిక శక్తులతో జత కట్టాల్సిన అవసరాన్ని అది గుర్తించడం లేదు : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ
కోల్‌కతా : లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులతో చేయి కలపాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించిన పక్షంలో ఆ పార్టీకి సహకరిస్తామని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ సహా సాధ్యమైన ప్రతి చోటా కాంగ్రెస్‌కు సహకారం అందిస్తామని చెప్పారు. కొల్‌కతాలోని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యాలయం ముజఫర్ అహ్మద్ భవన్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ సంకుచిత, పక్షపాతపూరిత వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. ఎక్కడ సాధ్యపడితే అక్కడ ఆ పార్టీతో సహకరించేందుకు సీపీఐ (ఎం) సుముఖంగా ఉన్నదని అంటూ అయితే లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులతో చేతులు కలపాల్సిన అవసరాన్ని ఆ పార్టీ గుర్తించినప్పుడే అది సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలలోనూ స్వతంత్రంగా పోటీ చేస్తామని కాంగ్రెస్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ 1970వ దశకంలో ఆ పార్టీ భయోత్పాతాన్ని సృష్టించిందని, ఇప్పుడు తిరిగి ఆ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోందని ఎత్తిపొడిచారు.
పశ్చిమబెంగాల్‌లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా అన్ని శక్తులను ఏకం చేయాలని వామపక్షాలు కోరుకుంటున్నాయని బేబీ అన్నారు. అయితే కాంగ్రెస్ వేరే దారిని ఎంచుకున్నదని విమర్శించారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటం జరపాలని తాము భావిస్తున్నామని అంటూ ఆ అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించనప్పుడు తామేమి చేయగలమని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాలలో సీపీఐ (ఎం)పై కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినప్పుడు తమ పార్టీ సుదీర్ఘ కాలం దానిని విమర్శించిందని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆయన సిద్దార్ధ శంకర్ రే నేతృత్వంలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రస్తావించారు. 1972లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని తాము ఆరోపించామని, బారానగర్‌లో సీనియర్ నేత జ్యోతిబసు పరాజయం పాలయ్యారని చెప్పారు. ‘ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు శాసనసభను బహిష్కరించాం. 1977లో పశ్చిమ బెంగాల్ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు’ అని బేబీ అన్నారు.
18 నాటికి సీట్ల సర్దుబాటు ఖరారు : మహమ్మద్ సలీం
విలేకరుల సమావేశానికి సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం కూడా హాజరయ్యారు. ఆయన ఇటీవలే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ వారంలోనే తిరిగి పార్టీ కార్యకలాపాలలో నిమగమయ్యారు. సీట్ల సర్దుబాటుపై ఇతర వామపక్షాలతో చర్చలు జరుగుతున్నాయని, ఈ నెల 18 నాటికి అవి ఖరారవుతాయని సలీం తెలిపారు. ఈ నెల 19, 20 తేదీలలో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఎమ్మెల్యే నౌషాద్ సిద్ధిఖీతో కూడా సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపామని సలీం తెలియజేశారు.



