Sunday, February 15, 2026
E-PAPER
Homeసోపతివాస్తవ నాటకం!

వాస్తవ నాటకం!

- Advertisement -

జుట్టుపోలుగాడు : ఓరోరి జనులారా! మా ప్రధాని మాటలు విన్నారా… మరి మరి మీరూ విన్నారా..? విన్నారా..? విన్నారా..? వినకపోతే ఇప్పుడు వినండి శ్రద్ధగా.
కేతిగాడు : అవును, నేను ఇప్పుడు మీ ప్రధానిగా మాట్లాడుతున్నాను. మీ ప్రతిపక్షాలు ఎంత అరచి గీపెట్టినా నాకు మీరు సమాధి తవ్వలేరు (నవ్వు). ఒక పక్క మీరు ప్రేమలు ప్రేమలు అంటూ ప్రేమ దుకాణాలు తెరుస్తారు. మరో పక్క ప్రధానికి సమాధులు తవ్వుతాం.. తవ్వుతాం అంటూ తొల్లిచేస్తారు. ఇవి ఏ రకమైన ప్రమాణాలు. ద్వంద్వ ప్రమాణాలు కావా..? ఆ… అక్కడికీ రాజ్యసభలో మొత్తుకున్నా… ప్రతిపక్ష నాయకునికీ చెప్పా. వయసు రీత్యా మీరు నా కన్నా పెద్ద. నిల్చుని నినాదాల లొల్లి చేస్తే అలసిపోతారు. కూర్చుని మాత్రమే చేయమని చెప్పా. విన్లేదే. చివరకు అరచి అరచి నోరు మూసుకుని సభ నుండి పారిపోయారు. నా ప్రసంగాన్ని ఐదారు సార్లు అడ్డుకోబోయారు. అయినా నేను ఊరుకుంటానా? నెవ్వర్‌ మొదలుపెడితే ఆపే ప్రసక్తే లేదు. అదీ నా నైజం… హా..హా..హా..

జుట్టుపోలుగాడు : మహాప్రభో.. మహాప్రభో… ప్రజాస్వామ్య సౌధం మన పార్లమెంటు. దానిలోనే మీకు రక్షణలేదా..? తమసొంటి పెద్దలకే ప్రాణభయమా..? తమరు మా దేశానికి అగ్రనేతలే అలాంటి తమనే అంతం చేయడానికే కుట్రపన్నారా..? అదీ పార్లమెంటులో.. ఎంత మాట? ఎంత మాట? ఏమా కుట్ర..? ఏమా కథ..? వివరిస్తారా..?
అల్లాటప్పాగాడు (ప్రవేశం) : ఆ కుట్ర వివరంబు ఎట్టిదనినా.. నే చెప్తా. సభాపతిని నేనండీ. పాలక పక్షమైనా.. ప్రతిపక్షమైనా నాకు విధేయులై వుంటారండీ. సభాపతిని నేనండి. తకథిమితోం.. తకథిమితోం.

జుట్టుపోలుగాడు : కుట్ర చెప్పమంటే ఈ కుప్పిగంతులేమిటి నాయనా?
అల్లాటప్పాడాడు : ష్‌! అదో మహారహస్యం. నాకు మాత్రమే ఉప్పందింది. పార్లమెంటు మహిళామణులు ప్రధానిని చుట్టుముట్టారు. వారి భావావేశాలు గమనించా..! ఒక వేళ జరగరానిది జరిగితే ఎంత అపవాదు? పార్లమెంటే కాదు. మొత్తం దేశ ప్రతిష్టే మంటగలిసేది. అందుకే సభకు రావద్దని చెప్పా.. గమనించారా.. నా తెలివితేటలు.. (ముసిముసి నవ్వు).
జుట్టుపోలుగాడు : జయహో సభాపతి జయహో. ప్రధానిని కాపాడిన సభాపతి జయహో.. జయహో..
బంగారక్క (ప్రవేశం) : నేనూ మహిళా ఎం.పి.ని. ఈ దేశ మహిళలకు అచ్చమైన ప్రతినిధిని. నోరులేని వారికి నోరిచ్చే వాదిని. నేనూ మహిళా ఎం.పి.ని.

జుట్టుపోలుగాడు : అమ్మా… వాదిని అని అంటున్నారు. మీ వాదన ఏమిటో తెలుపగలరా…
బంగారక్క : అయ్యయ్యో… జనులారా.. మా మహిళామణుల మాటలు వింటారా.. మా బాధలు గాధలు మీరూ కంటారా..
అందరూ : వింటాం.. చెప్పు తల్లీ…
బంగారక్క : అమ్మలారా.. అయ్యలారా.. రాజకీయ సుజనులారా.. ఈ పురుషాధిక్య వర్గ వర్ణ వ్యవస్థలో మేము ఈ స్థాయి వరకు వచ్చామంటే.. మేము ఏటికి ఎంతగా ఎదురీదవలసి వచ్చిందో మీకు తెలియంది కాదు. ప్రధాని వంటివారే మా మీద నేరుగా కుట్రమోపారంటే అది జాతికి అవమానం గాదా..? ప్రధానిని హత్య చేసే హంతకులమా మేము? ఆలోచించండి.. సభాపతి మాపై అసత్యారోపణలు మోపడం, ప్రధాని వాటిని నమ్మి సభకు రాకపోవడం నమ్మశక్యమేనా? ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజకీయ హక్కు కాదా..? నిరసన ఎంత ముఖ్యమో.. శాంతి సామరస్యం నెలకొల్పడం అంతే ముఖ్యం. అది మనందరి బాధ్యత. కాదనగలరా..? సభకు వచ్చి విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకనే ప్రధాని సభాపతి వెనుక దాక్కున్నారని మేం ఆరోపిస్తున్నాము. నిజాయితీగా మా ఆరోపణలకు సమాధానం ఇవ్వమని కోరుతున్నాము.

జుట్టుపోలుగాడు : శుభం తల్లీ శుభం.
అందరూ : శరణు శరణు మా అమ్మా రావే.. శాంభావీరావే మా అమ్మారావే.. తల్లీ ఈ రూపకం నామ ధేయం.
బంగారక్క : వాస్తవ నాటకం.
జుట్టుపోలుగాడు : వాస్తవ నాటకమా..? అసలు నాటకమనగానేమి?
బంగారక్క : ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపడం.

  • కె.శాంతారావు, 9959745723
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -