రెండవ తరగతి చదివే చైతన్య స్కూల్ నుండి ఇంటికి వచ్చాడు. అమ్మకు తెలియకుండా అలమరలో ఉన్న చక్కెర డబ్బా తీసుకుని ఆ చక్కెరను ఇల్లంతా చల్లాడు. ”ఏం చేస్తున్నావ్ నువ్వు?” అని అడిగింది అమ్మ.
”ఇతరులకు సహాయం చేయాలని మా టీచర్ చెప్పారు. అందుకని నేను చీమల కోసం చక్కెర చల్లాను.” అని చెప్పాడు.
”చీమల కోసం చక్కెర చల్లే వాడిని నిన్నే చూస్తున్నాను!” అంటూ అమ్మ కోప్పడింది.
చైతన్య తలదించుకుని తోటలోకి వెళ్ళాడు. అక్కడ వాడికి ఒక సీతాకోకచిలుక కనబడింది. నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లి సీతాకోకచిలుకను చటుక్కున పట్టుకున్నాడు. దానికి ఒక దారం కట్టి ఆ దారాన్ని కిటికీ ఊచకు కట్టాడు. కొన్ని పూలు కోసుకొచ్చి సీతాకోకచిలుక ముందు పెట్టాడు.
”నువ్వు మకరందం కోసం తోటలో పూల చుట్టూ తిరగాల్సిన పని లేదు. నీకు సహాయం చేయడానికి నేను పూలు తీసుకుని నీ ముందు ఉంచాను.” అంటూ సీతాకోకచిలుకకు చెప్పాడు. అమ్మకు మళ్లీ కోపం వచ్చింది. చైతన్యను తిట్టి సీతాకోకచిలుకను వదిలిపెట్టింది.
తాను ఇతరులకు సాయం చేస్తుంటే అమ్మ తనను ఎందుకు మెచ్చుకోవడం లేదో చైతన్యకు అర్థం కాలేదు. బాధగా ఇంటి ముందున్న వరండాలో కూర్చున్నాడు. అక్కడ గంప కింద పిల్లల కోడిపెట్ట తన పిల్లలతో ఉంది. గంపను కొద్దిగా పైకెత్తాడు. ఒక కోడిపిల్ల గంప నుండి బయటకు వచ్చింది. ఆ కోడి పిల్లని పట్టుకుని కొన్ని బియ్యం గింజలు తీసుకొచ్చి దానికి తినిపించబోయాడు. కోడి పిల్ల గింజలు తినకుండా భయంతో వణికి పోతోంది. ఇంతలో అమ్మ వచ్చి కోడిపిల్లను గంపలో వదిలిపెట్టి మరోసారి చైతన్యను తిట్టింది. చైతన్యకు ఏడుపొచ్చింది.
నాన్న ఆఫీసునుండి ఇంటికి వచ్చారు. తాను ఇతరులకు సాయం చేస్తోంటే అమ్మ తనను మెచ్చుకోకపోగా, తిడుతోందని నాన్నకు అమ్మపై ఫిర్యాదు చేశాడు. నాన్న చైతన్యను అడిగి విషయాలన్నీ తెలుసుకుని చిన్నగా నవ్వాడు.
”సహాయం చేయడం మంచిదే! అందుకోసం వారిని గాని, ఇతరులను గానీ కష్ట పెట్టకూడదు! చీమల కోసం ఇంట్లో చక్కర చల్లి, అమ్మకు పని పెంచావు. పువ్వులను సీతాకోకచిలుకకి ఇవ్వడం కోసం సీతాకోకచిలుకను బంధించి దానిని బాధ పెట్టావు. కోడి పిల్లకు బియ్యం పెట్టడం కోసం దాన్ని తల్లి నుండి వేరు చేసి భయపెట్టావు. అవసరం వున్న వాళ్లకు సహాయం చేయాలి. అంతేకానీ, నువ్వే ఇతరులకు అవసరాన్ని కల్పించి మరీ సహాయం చేయకూడదు.” అంటూ చెప్పాడు. నాన్న చెప్పిన మాటలు చైతన్యకు నెమ్మదిగా అర్థం అయ్యాయి.
ఆ మర్నాడు స్కూలుకు వెళ్ళిన చైతన్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
”ఏమిట్రా! ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు?” అంటూ అడిగాడు నాన్న.
”ఈ రోజు నేను చాలామందికి సహాయం చేశాను.” అంటూ సంబరంగా చెప్పాడు చైతన్య.
”ఎవరికి సహాయం చేశావు? ఏ సహాయం చేశావు?” ఆశ్చర్యంగా అడిగాడు నాన్న.
”ఈరోజు నేను స్కూలుకు వెళ్లేటప్పుడు స్కూలు బయట ఒక ముసలవ్వ కూర్చుని ఉంది. ఆమె చాలా నీరసంగా కనిపించింది. నా దగ్గర ఉన్న బిస్కెట్లను అవ్వకు ఇచ్చాను. ఆ అవ్వ నన్ను మంచిగా దీవించింది. పరీక్ష రాసేటప్పుడు నా స్నేహితుడి పెన్నులో ఇంకు అయిపోయింది. నేను వాడికి నా రెండో పెన్నును ఇచ్చాను. వాడు నాకు కతజ్ఞతలు చెప్పాడు. ఇందాక నేను, అశ్విక్ ఇద్దరూ ఇంటికి వస్తూ ఉంటే రాయి తగిలి అశ్విక్ కింద పడిపోయాడు. దాంతో వాడి మోకాలుకు గాయం అయ్యింది. వాడు నడవలేక పోయాడు. నేను వాడిని జాగ్రత్తగా నడిపించుకుంటూ వెళ్లి, వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాను. అశ్విక్ వాళ్ళమ్మ నన్ను మెచ్చుకుంది.” అంటూ చెప్పాడు చైతన్య.
”నువ్వు ఇలాగే అవసరమైన వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండాలి.” అంటూ తను తెచ్చిన కొత్త బొమ్మను చైతన్యకు ఇచ్చాడు నాన్న. వంటగదిలో నుండి అంతా వింటున్న అమ్మ తను చేసిన లడ్డూలను చైతన్యకు ప్రేమగా తినిపించింది. చైతన్యకు చాలా సంతోషం కలిగింది.
పేట యుగంధర్, 9492571731



