– పిల్లర్లు కూల్చి స్థలాన్ని చదును చేసిన వైనం
– పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగరంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల దౌర్జన్యాలు మితిమీరుతున్నాయి. అమాయకులు , ఎటువంటి ఆసరా లేని వారి భూములను ఆక్రమిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల స్థలాలనూ వదలడం లేదు. అందులో నిర్మాణం జరిగితే దాన్ని కూడా కూల్చేసి స్థలాన్ని చదును చేశారు. తాజాగా ఇటువంటి ఘట నే ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి..
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే పువ్వాడ అజరుకుమార్.. 1999లో 303, 304 సర్వే నెంబర్లలో టైలర్ వృత్తి చేసుకొని జీవించే 188 మందికి 100 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు మంజూరు చేశారు. ఆనాడు నిర్మానుష్యంగా వున్న ఆ ప్రాంతం కాలక్రమేణా అభివృద్ధి చెందింది. రెవెన్యూ అధికారులు పట్టాలు కూడా అందజేశారు. రియల్టర్లు కూడా వెంచర్లు ప్రారంభించారు. తాజాగా ఆ సర్వే నెంబర్‌లో ఖమ్మం నగరానికి చెందిన కోడి రెక్కల కళావతికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ఆమె ఇంటి నిర్మాణానికి ఉపక్రమించారు. ఈ క్రమంలో స్థానికంగా వెంచర్ వేసిన అమృతం శ్రీను అనే వ్యక్తి అనుచరులు ఈ భూమి తమదంటూ, నిర్మాణం చేయొద్దని బెదిరించి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఆమె బేస్‌మెంట్ నిర్మించి పిల్లర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే రియల్టర్లు ఆ పిల్లర్లను కూల్చేసి స్థలాన్ని చదును చేశారని బాధితురాలు కళావతి, టైలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆవుల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు.
పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
తన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని కూల్చేశారని, తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఈనెల 25న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూలినాలీ చేసుకొనే తనకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని ఎంతో ఆనంద పడ్డానని తెలిపారు. ఇల్లు పూర్తి చేస్తున్న సమయంలో ఇలా జరగడం ఆందోళనగా వుందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయమై తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఇందిరమ్మ ఇల్లు కూల్చిన విషయపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం అని త్రీ టౌన్ సిఐ మోహన్ బాబు ‘నవతెలంగాణ’కు తెలిపారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణంపై రియల్టర్ దౌర్జన్యం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



