”మన పత్రికలు కొన్ని సంఘటనలను నిర్లక్ష్యం చేసి నిశ్శబ్దంతో చంపే ప్రయత్నం చేస్తాయి. కుదరకపోతే బోలెడంత పబ్లిసిటీతో చంపుతాయి. రెండూ మన జ్ఞానాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలే!” కారంచేడు ఘటనపై రాసిన వ్యాసంలో అంటాడు సివి సుబ్బారావు. మొన్నటి అఖిల భారత సమ్మె వార్తలకూ అదే గతిపట్టించాయి మన పత్రికలు. దాన్లో తెలుగు పత్రికల జ్ఞాన శూన్యతకు అగ్రతాంబూలం ఇవ్వాల్సిందే. వామపక్ష పార్టీలు, వారి ఆలోచనా ధోరణిగల పత్రికలే మినహాయింపు. ఇక బూర్జువా పార్టీలు ఈ కోడ్‌లపై పల్లెత్తు మాట అన్న స్థితిలేదు. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన బ్రహ్మాండమైన కార్మికుల ర్యాలీని అడ్రస్ చేస్తూ పీసీసీ అధ్యక్షులవారు తమ ఏఐసీసీ ఈ సమ్మెకు మద్దతు తెలిపిందని చెప్పగానే కార్మికులు రానున్న బడ్జెట్ సమావేశాల్లో ‘ఆ కోడ్‌లు మన రాష్ట్రంలో అమలు చేయం’ అని తీర్మానించమని ఒత్తిడి చేశారు.
పాముచావకుండా, కర్ర విరగకుండా ఆయన చెప్పిన మాటలు కార్మికులు గమనించారు. ఇటీవల చెన్నైలో కార్ల్‌మార్క్స్ విగ్రహం ఆవిష్కరించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (ఈ సందర్భంగా ఆయన పేరు రాయడం ఇబ్బందే మరి!) తాను అభివృద్ధిగాముక ఆలోచనలకు వారసుడినని చెప్పుకున్నారు. కోడ్‌ల గురించి పల్లెత్తుమాట అనలేదు. శామ్‌సంగ్ కార్మికులనడిగితే తెలిసేది. రసాయన శాస్త్ర పరిభాషలో ఎవరు ఏవైపునున్నారో తెలిపే ‘లిట్మస్’ పరీక్ష ఇదే! ”మేల్కొనుము! లేదా శాశ్వతంగా పడే ఉండు!” అంటాడు జాన్ మిల్టన్ (ప్యారడైజ్‌లాస్ట్‌లో). శాశ్వతంగా పడుండటానికి కార్మికులేమైనా తలలూపే గంగిరెద్దులా?! తొక్కినచోటే తొక్కుకుంటూ గుండ్రంగా తిరిగే గానుగెద్దులా?! కాదుగాక కాదు. జల్లికట్టులో ఎగిరెగిరి దూకే పోట్లగిత్తలు వీరు. అందుకే మోడీ సర్కార్ సార్వత్రిక సమ్మెని విఫలం చేయడానికి మిగిలిన మూడింటికంటే ‘దండోపాయాన్నే’ నమ్ముకుంది.
లేబర్‌కోడ్స్ అవే! ఒక యూనియన్ సమ్మె నోటీసిచ్చిన తర్వాత విద్యుత్‌రంగంలో సమ్మెలోకి వెళ్లదల్చుకున్న కార్మికులు ఒక్కొక్కరి నుండి రాతపూర్వకంగా వివరణ కోరారు అధికారులు. ఇది కార్మికులను భయపెట్టేందుకే! ఐ.ఆర్.కోడ్ అమల్లోకి రాకముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ ఒకటి తర్వాత కార్మికుల స్థితి ఏమిటి? ”దండం దశ గుణం భవేత్!” (దుడ్డుకర్రతో బాదితే పదిరకాల దుర్గుణాలు పోతాయని నానుడి) సర్వీసు బ్రేక్ వస్తుందని, ఇంక్రిమెంట్లు (క్యుమిలేటివ్) శాశ్వతంగా పోతాయని దానివల్ల ఇన్ని లక్షల రూపాయలు నష్టమొస్తుందని ప్రచారంలో పెట్టారు. బెదర గొట్టడంలో ఇదొక పద్ధతి. ప్రభుత్వరంగాన్ని మోడీ ప్రభుత్వం ఊడ్చేస్తున్నా ‘మచ్చిక’చేసుకున్న కొన్ని కార్మిక సంఘాలు తమ పరిశ్రమకూ, తద్వారా తమ జీతాలకు, జీవితాలకు ఏ ప్రమాదమూ లేదన్నట్టు, రాదన్నట్టు ప్రవర్తించాయి.
అదీ అఖిల భారత స్థాయిలో తమ అధినాయకుడు గంభీరోపన్యాసం చేసినా ప్రశాంతంగా ఉండటం మోడీ సర్కార్‌కు ఆనందదాయకమైన విషయం. వారి రాజకీయ పార్టీలేసిన పగ్గాలు కొన్ని సంఘాలకుంటే, దశాబ్దాల తరబడి యజమానుల బూట్లు నాకడానికి అలవాటుపడ్డ శరీరాలు మరికొన్ని! ఇవన్నీ గాక లేదా వీరందరూగాక, దేశంలో ”అతిపెద్ద” కార్మిక సంఘంగా చెప్పుకుంటున్న ఆరెస్సెస్ వారి కార్మిక విభాగం, కనీసం తమ సిద్ధాంతాన్ని కార్మికుల్లో ప్రచారం చేసి ఒప్పించి, మెప్పించుకునే ధైర్యం లేకనో, సమయం చాలకనో అనేక పారిశ్రామిక వాడల్లో ఫిబ్రవరి పదిన కరపత్రం పంచింది. పన్నెండు సమ్మెలో లేని డిమాండ్లు ఉన్నట్టు ఊహించుకున్న వారి కరపత్రం చూస్తే దేంతో నవ్వాలో తెలీక కార్మికులు సతమతమవుతున్నారు. పెట్టుబడి సేవకే అంకితమైన బీఎంఎస్ పాచి వాదనలను మొన్న పదో తేదీనే ‘నవతెలంగాణ’ ఎండగట్టింది. గతంలో కనీసం దేశవ్యాపిత సమ్మె ముగిసిన మర్నాడు ఫిక్కీనో, అసోచామ్ వారో ఆర్థిక వ్యవస్థకు ఇంతనష్టం, అంతనష్టం అనే వార్తలైనా మీడియాకు చెప్పేవారు. ప్రారంభంలో చెప్పినట్లు ఇది అప్రకటిత సెన్సార్‌షిప్‌లో భాగమేనేమో, ప్రకటనలే లేవు.
‘ఏఐ’కి కూడా అందనంత గుప్తంగా, గుంభనంగా ఉంది సర్కార్ ధోరణి. ఎస్‌కెఎం పిలుపుపై రైతాంగం, విబిజి రామ్‌జికి వ్యతిరేకంగా వ్యవసాయ కూలీలు పెద్దసంఖ్యలో గ్రామీణబంద్‌లో పాల్గొన్నారు. ఈ సమ్మె సందర్భంగా కార్మిక సంఘాలు ఆలోచించు కోవాల్సినవీ, ఆత్మవిమర్శ చేసుకోవల్సినవీ ఉన్నాయి. ఆయా సంఘాలు తమ కార్యకర్తలను కోడ్‌లపై ఏ మాత్రం ఎడ్యుకేట్ చేశాయి? ‘చేశామను’కునే సంఘం కార్యకర్తలు, కమిటీలు ఏ కోడ్‌లు కార్మికులకు ఏ మాత్రం, ఏ విధంగా దెబ్బతీస్తాయనే విషయం వివరించారా? సంఘటిత, అసంఘటిత రంగాలకు ఏకమూలికా ప్రయోగం చేశారా? అనే అంశం నాయకత్వ కమిటీలు పరిశీలించుకోవాలి. చావో, రేవో తేల్చుకోవాల్సిన పోరాటంలో ఉన్నామనే విషయం కార్మికులకు ఏ మాత్రం అర్థమైంది? లేబర్ కోడ్స్ తటస్తమైనవి కావు. యాజమాన్యాల కోసమే ఇవి. మనుస్మృతి అంటేనే అసమానత. నిచ్చెనమెట్లు. అణిచివేత. ప్రతిఘటన లేకుండా లేబర్‌కోడ్స్‌ను ఆమోదించడమంటే తరతరాలుగా ఉన్న కుల, వర్గ బంధనాలను ఆమోదించడం. ఈ విషయంలో కార్మిక జన బాహుళ్యాన్ని చైతన్య పరచడమనేది కార్మిక నాయకుల బాధ్యత. ఏమైనా మొన్నటి సమ్మెలో ఎన్నో ఒత్తిడులు, బెదిరింపులకు తట్టుకొని పాల్గొన్న 30 కోట్ల మంది కార్మికులకు జేజేలు.
కోడ్‌లపై తిరుగుబాటు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



