– 150 నుంచి 125 క్రెడిట్లకు కుదింపు
– వర్సిటీల బీవోఎస్, రిజిస్ట్రార్ల అభిప్రాయాలు సేకరణ
– త్వరలో వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశం
– యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కసరత్తు
– వచ్చే విద్యాసంవత్సరంలో అమలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో 2025-26 విద్యాసంవత్సరంలో డిగ్రీ సిలబస్‌లో మార్పులు చేయాలని ఉన్నత విద్యామండలి కసరత్తు ప్రారంభించింది. అయితే విద్యార్థులపై భారం ఉండకుండా సిలబస్ తగ్గే అవకాశమున్నది. ఈ దిశగా ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతున్నది. ఇప్పటి వరకు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)లో భాగంగా డిగ్రీ విద్యార్థులకు 150 క్రెడిట్లు ఉన్నాయి. గతనెల 29న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారం మూడేండ్ల డిగ్రీ కోర్సుకైతే కనీసం 120 క్రెడిట్లు, నాలుగేండ్ల కోర్సుకైతే 160 క్రెడిట్లు ఉండాలి. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా క్రెడిట్లను కుదించే పనిలో ఉన్నత విద్యామండలి నిమగమైంది, నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్)లో భాగంగా 125 నుంచి 130 క్రెడిట్లు ఉండేలా సిలబస్‌ను రూపకల్పన చేస్తున్నది. ఇప్పటికే ముసాయిదా క్రెడిట్ విధానాన్ని తయారు చేసింది. దీనిపై విశ్వవిద్యాలయాల బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) చైర్మెన్లు, రిజిస్ట్రార్లతో ఉన్నత విద్యామండలి సంప్రదింపులు జరుపుతున్నది. ఆన్‌లైన్‌లో వారి అభిప్రాయాలను సేకరించింది. త్వరలోనే విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ) సమావేశం నిర్వహించి క్రెడిట్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
4 సెమిస్టర్లకే భాషాసబ్జెక్టుల పరీక్షలు
భాషా సబ్జెక్టులకు సంబంధించి ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్‌తోపాటు ఇతర మాధ్యమాలకు సంబంధించి ఆరు సెమిస్టర్లకు పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాలుగు సెమిస్టర్ల పరీక్షలే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. 2024-25 విద్యాసంవత్సరం వరకు తెలుగు సబ్జెక్టుకు 20 క్రెడిట్లు ఉంటే వచ్చే విద్యాసంవత్సరంలో 12 క్రెడిట్లకు తగ్గించే అవకాశమున్నది. ఇంగ్లీష్‌కు సంబంధించి 20 క్రెడిట్ల నుంచి 16 క్రెడిట్లకు కుదించనున్నారు. డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ (డీఎస్‌ఈ)కి సంబంధించి ఇప్పటి వరకు 30 క్రెడిట్లు కొనసాగుతున్నాయి. అవి 22 క్రెడిట్లకు తగ్గే అవకాశమున్నది. అయితే మారుస్తున్న డిగ్రీ సిలబస్‌లో 20 శాతం వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, పరిశోధనకు సంబంధించిన అంశాలుండేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్పు చేసిన సిలబస్‌ను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి తెస్తామని ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డి తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. విద్యార్థులే కేంద్రంగా డిగ్రీ విద్యలో సంస్కరణలను తెస్తున్నామని వివరింంచారు. పరిశ్రమలు, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఉపాధి అవకాశాలను పెంచేలా సిలబస్‌ను రూపకల్పన చేస్తున్నామని అన్నారు.
తగ్గనున్న డిగ్రీ సిలబస్!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES