మన వ్యాపారానికీ నష్టమే
వీసా ఫీజు పెంపుపై ట్రంప్‌ను హెచ్చరించిన కాంగ్రెస్ సభ్యురాలు
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రతినిధి సభలో కాలిఫోర్నియాకు చెందిన డెమొక్రటిక్ సభ్యురాలు సిడ్నీ కమ్లాగర్-డోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య అమెరికా వ్యాపారాన్ని, భారత్‌తో నెలకొన్న కీలక సంబంధాలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. వీసా ఫీజు పెంపుతో అమెరికా పోటీతత్వం క్షీణిస్తుందని ఆమె తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను ట్రంప్ ఫణంగా పెడుతున్నారని, వలసదారులను, అంతర్జాతీయ నైపుణ్యాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా అమెరికా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ట్రంప్ విధానాలు కేవలం విదేశీ ఉద్యోగులకే నష్టదాయకం కావని, వారి అనుభవంపై ఆధారపడి కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికా కంపెనీలు కూడా నష్టపోతాయని ఆమె చెప్పారు.