Sunday, November 9, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహంగరీకి ఊరట

హంగరీకి ఊరట

- Advertisement -

రష్యా ఇంధన ఆంక్షల నుంచి ట్రంప్‌ మినహాయింపు
వాషింగ్టన్‌ : రష్యా నుంచి చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తున్న హంగరీకి అమెరికా ఆంక్షల నుంచి ఏడాది పాటు మినహాయింపు లభించింది. ఈ మేరకు అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారని అధ్యక్ష భవనం అధికారి ధృవీకరించారు. హంగరీ ప్రధాని విక్టర్‌ ఆర్బన్‌కు ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఆయన ఉక్రెయిన్‌ యుద్ధ కాలంలో రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగించారు. ఆర్బన్‌ శుక్రవారం అమెరికా అధ్యక్ష భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ ఆంక్షల నుంచి హంగరీకి మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నానని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి చమురు, గ్యాస్‌ పొందడం ఆర్బన్‌కు చాలా కష్టంగా ఉన్నదని తెలిపారు.

రష్యాకు చెందిన రెండు అతి పెద్ద చమురు కంపెనీలను ట్రంప్‌ గత నెలలో బ్లాక్‌లిస్టులో పెట్టిన విషయం తెలిసిందే. ఆ కంపెనీల నుంచి చమురును కొనుగోలు చేస్తే ఆంక్షలు తప్పవని ఆయన బెదిరించారు. కాగా ట్రంప్‌, ఆర్బన్‌ మధ్య జరిగిన సమావేశం అనంతరం హంగరీ విదేశాంగ మంత్రి పీటర్‌ సిజ్జార్టో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ ‘చమురు, గ్యాస్‌పై ఆంక్షల నుంచి పూర్తి, అపరిమిత మినహాయింపు లభించింది’ అని తెలియజేశారు. అయితే ఈ మినహాయింపుకు సంవత్సరం పాటు కాలపరిమితి విధించారని అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు. ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం హంగరీకి పెద్ద ఊరట ఇచ్చింది. అమెరికా ఆంక్షలతో తమ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని అంతకుముందు ఆర్బన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -