Saturday, September 27, 2025
E-PAPER
Homeజాతీయం'ఓటుకు నోటు' కేసులో మత్తయ్యకు ఊరట

‘ఓటుకు నోటు’ కేసులో మత్తయ్యకు ఊరట

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కొట్టివేత
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

‘ఓటుకు నోటు’ కేసులో ఏ4గా ఉన్న జెరూసలెం మత్తయ్యకు ఊరట దక్కింది. ఈ కేసులో మత్తయ్యపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను రాష్ట్ర హైకోర్టు క్వాష్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై 2016లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్‌ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అదే ఏడాది జులై 6న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే సందర్భంలో ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఎల్విస్‌ స్టీఫెన్‌ సన్‌ సైతం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లపై గత వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బీఆర్‌ గవాయి నేతృత్వంలోని జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ ముగించింది. ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి, ప్రతివాది మత్తయ్య తరఫున ప్రియాంక ప్రకాశ్‌, ఇతర న్యాయ వాదులు వాదనలు వినిపించారు.

ఈ కేసులో ఏ2గా బిషప్‌ హ్యారి సెబాస్టి యన్‌, ఏ4 మత్తయ్యలు దాదాపు 20 సార్లు ఫోన్‌లో మాట్లాడు కున్నట్టు కాల్‌ డేటా చెబుతోందని మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. అయితే ఏ4ను విచారించకుండా ఇదంతా ఒక శాంపిల్‌ ఎవిడెన్స్‌గా పరిగణించాలని కోర్టును కోరారు. మత్తయ్యను విచారించేందుకు అవసర మైతే అనుబంధ చార్జ్‌షీట్‌ వేస్తామని హైకోర్టును కోరినట్టు తెలిపారు. అయితే విచారణకు అనుమతించడం పక్కన పెడితే, అసలు ఎఫ్‌ఐఆర్‌నే హైకోర్టు క్వాష్‌ చేసిందన్నారు. ఈ కేసు చాలా కీలకమైందనీ, ఈ కేసులో ముందుకెళ్లేందుకు ఏ4ను విచారించేందుకు అనుమతివ్వాలని తొమ్మిదేండ్లుగా సుప్రీంకోర్టును కోరుతున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ కేసు క్రైం సీన్‌లోనే తాను లేననీ, అక్రమంగా తనను ఇరికిస్తున్నారని మత్తయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకొన్న సీజేఐ ధర్మాసనం విచారణ ముగిస్తూ… తీర్పు రిజర్వ్‌ చేసింది. శుక్రవారం సీజేఐ ఈ కేసులో తీర్పు వెలువరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. జెరూసలెం మత్తయ్య పాత్రపై దర్యాప్తు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

సీఎం, సండ్రల పిటిషన్లపై విచారణ వాయిదా తదుపరి విచారణ వచ్చే నెల 14న : సుప్రీంకోర్టు
‘ఓటుకు నోటు’ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సర్వోన్నత న్యాయస్థానం వచ్చేనెల (అక్టోబర్‌) 14 కు వాయిదా వేసింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియామావళి కింద విచారణ చేపట్టాలని జులై 22, 2021లో రేవంత్‌ రెడ్డి, ఈ కేసులో తన పేరు తొలగించాలని సండ్ర వెంకట వీరయ్య అదే ఏడాది ఏప్రిల్‌ 13న సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తొలుత సీనియర్‌ న్యాయవాది ఆర్యమ సుందరం జోక్యం చేసుకొని, గతంలో ఈ కేసు విచారణను బయటి రాష్ట్రానికి బదిలీ చేయాలని కోర్టును ఆశ్రయించినట్టు కోర్టుకు నివేదించారు. అందువల్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై సీఎం రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూత్రా అభ్యంతరం తెలిపారు. ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించవద్దని కోర్టును కోరారు. మరోవైపు ప్రభుత్వం తరఫు, ఇతర పిటిషనర్లు జోక్యం చేసుకొని.. ఇదే కేసుకు సంబంధించి ఏ4 గా ఉన్న మత్తయ్య ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌పై సీజేఐ ధర్మాసనం తీర్పు వెలువరించిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్‌ జేకే మహేశ్వరీ… తీర్పు కాపీ వివరాలను తెలియజేయాలని కోరారు. అన్ని వైపుల వాదనలను పరిగణలోకి తీసుకొన్న ధర్మాసనం, కేసు విచారణను అక్టోబర్‌ 14కు వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -