మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర వ్యాపితంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేసిన పంటలు నష్టపోయాయనీ, రైతులకు ఎకరాకు రూ. 20వేలు నష్టపరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. 2025 వానాకాలంలో అధిక వర్షాల వల్ల ఇప్పటి వరకు మూడు లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పప్పు, తణధాన్యాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వీటికి ఎకరాకు రూ.10వేలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. కానీ, గతేడాది 5లక్షల ఎకరాల్లో అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోగా మేలో రైతులకు రూ.51,253 కోట్లు, ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ, ఆ పరిహారం పూర్తిగా అందలేదని పేర్కొన్నారు. గత రెండేండ్లుగా అధిక వర్షాల వల్ల సగటున ఐదు లక్షల ఎకరాల చొప్పున పంటలు నష్టపోతున్నాయని తెలిపారు. వీటితో పాటు రోడ్లు, గ్రామపంచాయతీ ఆస్తులు, మున్సిపల్ ఆస్తులకు నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. అనేక మంది ఇండ్లు కోల్పోయి నిర్వాసితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత పరిష్కారం లేకపోవడంతో ఏటా ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర నష్టాలు జరుగుతున్నాయని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల పరిహారం కింద 15వ ఆర్థిక సంఘం 2021-25 సంవత్సరాల కాలానికి రాష్ట్రానికి రూ.2,483కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.827కోట్లు కేటాయించారని తెలిపారు. ఇందులో 2025-26 సంవత్సరానికి రూ.546కోట్లు కేంద్రం, రూ.182కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం రూ. 726 కోట్లు కేటాయించాయని పేర్కొన్నారు. కనీసం ఈ నిధుల పంపిణీ కూడా సరిగ్గా జరగలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుండి నష్టపోయిన రైతులకు, సంస్థలకు రూ. మూడువేల కోట్లు కేటాయించాలనీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల పరిహారంపై ఇప్పటి వరకు సర్వే కూడా జరపలేదని విమర్శించారు. రెవెన్యూ శాఖలో ప్రకృతి వైపరీత్యాల పరిహారం కోసం సర్వే చేసి, గణాంకాలు సేకరించడానికి ఒక శాఖ కూడా ఉందనీ,కానీ ఆ శాఖ పని చేయడం లేదని ఆరోపించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు, పాక్షికంగా ఇండ్ల్లు నష్టపోయిన వారికి తాత్కాలికంగా ఆదుకుని వారికి ఇండ్లు మంజూరు చేయాలని జూలకంటి డిమాండ్ చేశారు. వరదల వల్ల వచ్చే జబ్బులను నివారించడానికి వరద ప్రాంతాల్లో మొబైల్ వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES