దేశంలో మతతత్వ శక్తులు విద్వేషాన్ని పెంచుతున్న నేపథ్యంలో ప్రజలు మతం కంటే మానవత్వానికే కట్టుబడి ఉన్నారన్న ఉదంతాలు ఇటీవల కొన్ని వెలుగులోకి వచ్చాయి. అన్ని రంగాలను మతమయం చేయడం ద్వారా దేశ ప్రజల మనస్సులో విష బీజాలను నాటే ప్రయత్నాలను కొన్ని శక్తులు బలంగా చేస్తున్నాయి. అయితే, తాజాగా దేశంలో చోటు చేసుకొన్న ఘటనలు ప్రజలంతా కుల, మతాలకు అతీతంగానే ఉన్నారన్న సందేశాన్ని స్పష్టంగా పంపాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఎక్కడ చూసినా రెండు ఘటనలు, ఇద్దరు వ్యక్తులు హల్‌చల్ చేస్తున్నారు. వీరిద్దరూ నిన్న మొన్నటి వరకూ సాధారణ వ్యక్తులే. చిన్న వ్యాపారులే. కానీ తెలంగాణ, ఉత్తరాఖండ్‌లో జరిగిన రెండు ఘటనలు వీళ్లకు ఇప్పుడు భారత్‌లో ప్రజలందరినీ కుల, మతం, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ఏకం చేస్తున్నాయి. వీరికి అండగా నిలిచేందుకు, కనీసం మద్దతు ప్రకటించేందుకు సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు.
ఉత్తరాఖండ్‌లోని కోట్వార్‌లో జనవరి 26న బాబా స్కూల్ డ్రెస్ పేరుతో బట్టల దుకాణం నడుపుకుంటున్న ఓ ముస్లిం వృద్ధ వ్యాపారి వకీల్ అహ్మద్ పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. బాబా పేరుతో దుకాణం ఎలా నడుపుతావంటూ ప్రశ్నించారు. అదే సమయంలో పక్కనే జిమ్ నడుపుతున్న దీపక్ కుమార్ అక్కడికి చేరుకుని అతనికి అండగా నిలిచాడు. భజరంగ్ దళ్ కార్యకర్తల్ని ప్రశ్నించాడు. నీ పేరు ఏంటని అడిగితే దీపక్ అన్నాడు. హిందువై ఉండి ముస్లిం వ్యాపారికి ఎలా సపోర్ట్ చేస్తావని అడిగితే తాను ‘మహమ్మద్ దీపక్’ అయితే ఫర్వాలేదా? అని అడిగాడు. దీంతో వాగ్వాదం పెరిగి కేసుల వరకూ వెళ్లింది. అయినా దీపక్ బెదరలేదు. ఇప్పుడు ఈ మహమ్మద్ దీపక్‌కు దేశమంతా మద్దతు పలుకుతోంది. జార్ఖండ్ మంత్రి తన నాలుగు నెలల వేతనం రూ.రెండు లక్షలు ఇవ్వడానికి ముందకొచ్చారు. కానీ, దీపక్ సున్నితంగా తిరస్కరించి తనకన్నా పేదలకు ఆ డబ్బును ఉపయోగించాలని కోరారు. అదే సమయంలో అతను నడుపుతున్న జిమ్‌కు వచ్చే 150 మంది కాస్తా 15కు పడిపోయారు. ప్రతిరోజూ అతని జిమ్ దగ్గర ఏదైనా గొడవ జరుగుతుందన్న భయంతో పోలీసులు మోహరిస్తున్నారు. దీంతో జిమ్‌కు వచ్చే వారు రాకుండా పోయారు. ఇది అతని ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. విషయం తెలిసిన చాలా మంది అతనికి అండగా నిలుస్తున్నారు. అతని జిమ్‌కు తాము సబ్‌స్కిప్షన్ కడతామని ముందుకొస్తున్నారు. ఇందులో తెలుగువారు కూడా ఉన్నారు. జైపూర్‌లోని ఓ ఎన్జీఓ నిర్వహకులు జిమ్‌లో చేరే తొలి వందమందికి తామే డబ్బులు కడతామని చెప్పారు. సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ కూడా జిమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారిలో ఉన్నారు. సుప్రీంకోర్టు లాయర్లు సైతం దీపక్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు జాన్ ట్వీట్ చేశారు.
మానవత్వంపై మహమ్మద్ దీపక్ చర్యతో చర్చ సాగుతున్న తరుణంలో తెలంగాణలోని మేడారం జాతర, అందులో కోవా బన్ అమ్ముకునేందుకు ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన షా వలీ అనే ఓ ముస్లిం పేద వ్యాపారి. అతను కేవలం కోవా బన్ను పది రూపాయలకు అమ్ముతున్నాడన్న కారణంతో, దాని నాణ్యతను ప్రశ్నిస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు ఫుడ్ జిహాద్ పేరుతో అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిచూసి పక్కనే ఉన్న వారు పోగయ్యారు. చివరికి ఆ బన్ నువ్వు తిను అంటూ అతన్ని గేలిచేశారు. దాంతో వెంటనే ఆ బన్ తాను తిని చూపించాడు. దాంతో అక్కడున్న వారికి నోటమాట రాలేదు. ఈ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. షా వలీకి మద్దతుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది జర్నలిస్టులు, సామాజిక వేత్తలు, సాధారణ ప్రజలు ట్వీట్లు చేస్తున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా స్పందించారు. మెగా బ్రదర్స్ నాగబాబు అతన్ని కలిసి ఆర్థికసాయం అందించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ పేద వ్యాపారి పొట్టకొట్టేందుకు మతం పేరును వాడుకున్న ఫేక్ జర్నలిస్టులతో పాటు అక్కడ గుమికూడిన వారిని సైతం చీదరించుకుంటూ జనం పోస్టులు పెడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఆ పేద వ్యాపారి ఫోన్ పే అడ్రస్ తీసుకుని తమకు తోచినంత డబ్బులు పంపుతున్నారు. ఇదంతా చూస్తున్న సాధారణ జనం ఇది కదా అసలైన ఇండియా అంటూ మురిసిపోతున్నారు. ఇకనైనా లౌకికవాదులు మేలుకోవాలి. లౌకిక భావాలున్న వారిని ఏకం చేసి లౌకికత్వం అంటే అన్ని వర్గాల సమైక్య సుఖశాంతుల జీవితం కోసం అని తెలియజేయాలి. దేశంలో మత విద్వేషాల కారణంగా దేశానికి వచ్చే పరిశ్రమలు తరలిపోవడమే కాదు దేశ ప్రగతి కుంటుపడుతుందని స్పష్టంగా ప్రజల్లోకి వెళ్లి తెలియజేయాలి. లౌకికవాదులు గడపదాటి ప్రజల ముంగిట చేరుకొని ఈ రకమైన ప్రచారం చేస్తేనే మతతత్వశక్తులను అడ్డుకోవడం సాధ్యం.
– సయ్యద్ నిసార్ అహ్మద్, 7801019343
మతతత్వం-మానవత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



