ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలో ఎస్సీల పూజలకు అనుమతి
చెన్నై : కులం ఆధారంగా మత విశ్వాసాన్ని, మానవ పక్షపాతంతో దైవత్వాన్ని బంధించలేమని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాంచీపురం జిల్లాలో పూతగరం గ్రామంలోని ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) ప్రజలు పూజలు నిర్వహించుకోవానికి అనుమతిస్తూ శనివారం తీర్పు ఇచ్చింది. అలాగే ఎస్సీల నివాసాల గుండా కూడా ఆలయరథ యాత్ర జరగాలని ఆదేశించింది. ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలోకి పూజలు చేయడానికి ఎస్సీలను అనుమతించాలని, గ్రామంలోని వారి నివాసాల గుండా ఆలయ రథ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్థానిక నివాసి ఎ. సెల్వరాజ్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారించింది. అలాగే, ఈ పిటిషన్‌కు మద్దతుగా తమిళనాడు అంటరానితనం నిర్మూలన ఫ్రంట్‌కు చెందిన ఎస్. ఆనందన్ మరొక పిటిషన్ దాఖలు చేశారు. గ్రామంలో షెడ్యూల్డ్ కులాల వ్యక్తులపై తీవ్ర వివక్ష ఉందని ఈ పిటిషన్‌లో తెలిపారు.
ఈ పిటిషన్ల విచారణలో గ్రామంలో కొన్ని దశాబ్దాల నుంచి అనుసరిస్తున్న రథయాత్ర మార్గాన్ని మార్చాల్సిన అవసరం లేదని హిందువులకు చెందిన మరికొంత మంది వాదనలు వినిపించారు. అలాగే, ఈ పిటిషన్‌ను అనుమతిస్తే భవిష్యత్త్‌లో మరికొంత మంది ఇలాంటి పిటిషన్లను అనుమతిస్తారని తెలిపారు. అయితే ఈ వాదనలను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. ఆచారం, సంప్రదాయం పేరుతో మార్పును నిరోధించలేమని జస్టిస్ పిబి బాలాజీ పేర్కొన్నారు. భవిష్యత్ గురించి ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ‘దేవుడు కొన్ని వీధుల్లో మాత్రమే నివసించడు. ఏ వీధి కూడా రథానికి లేదా అది మోసే దేవునికి అనర్హమైనది కాదు. దేవుడు ఎప్పుడూ వివక్ష చూపడు. కాబట్టి, వివక్షను సంప్రదాయం యొక్క పవిత్రతలో చుట్టివేయలేము’ అని వాఖ్యానించారు.
అలాగే ఎస్సీ వ్యక్తులను ఆలయంలోకి పూజ కోసం అనుమతించకపోవడాన్ని న్యాయమూర్తి ఖండించారు. ‘భారత రాజ్యాంగం, ఆర్టికల్ 17 ప్రకారం, అంటరానితనాన్ని రద్దు చేసేవారు. ఈ రద్దు కేవలం భౌతిక రూపంలోనే కాదు, నిజమైన స్ఫూర్తితో జరిగింది. అందువల్ల, దేవుడు ముందు నిలబడటానికి, పూజించడానికి ఎవరు అర్హులు మరియు ఎవరు కాకూడదనే నిబంధనలను ఎవరూ నిర్దేశిం చలేరు’ అని పేర్కొన్నారు. కలెక్టర్ రెవెన్యూ, పోలీసు అధికా రులు సంయుక్తంగా క్షేత్రస్థాయి తనిఖీ నిర్వహించి, అమ్మవారి రథయాత్రను షెడ్యూల్డ్ కులాల నివాస ప్రాంతాల గుండా కూడా తీసుకుని వెళ్లేలా చూడాలని కోర్టు ఆదేశించింది. రథయాత్ర ప్రశాంతంగా జరిగేలా చూడాలని పోలీసులను ప్రత్యేకంగా ఆదేశించింది.



