Sunday, September 21, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపూలకు విన్నపాలు

పూలకు విన్నపాలు

- Advertisement -

‘పూలనుకని మురవని మోముంటుందా! పరిమళాలు హృదిని చేర ఆనందాలు విరియవా!’ ‘కన్నులకు పండుగలను అందించేవిరులు, కలలను పండించి వికసించే కళలు’ అంటూ మైమరిచి గానం చేస్తాడో పుష్ప ప్రేమికుడైన కవి. పువ్వులు ఈ ప్రకృతి మనకందించిన సౌందర్య కానుకలు. అవును పూలను చూసి ఆనందపడని మనసులుండవు. ఏ పువ్వును చూసినా మనసు వికసిస్తుంది. ఒక ఆహ్లాదకర ఆవరణం ఆవిష్కృతమవుతుంది. పువ్వులు మృదుత్వానికి ప్రతీకలు. వర్ణశోభితాలు. సౌరభ సమూహాలు. పరిమళ భరితాలు. అందాల కనువిందులు. పూలను ఉపయోగించే విధానాన్ని మనం పరిశీలించినట్లయితే మానవుని సౌందర్యాత్మకతను గ్రహించగలుగుతాము. మనుషుల్లో పరిణమించిన అనేకానేక భావ ఆవిర్భావాల వ్యక్తీకరణకు పూలను వినియోగించటాన్ని మనం చూస్తాము.

ప్రేమ అనే భావనను వ్యక్తపరచటానికి మనకున్న భాషరహిత సాధనం పువ్వులే కదా! ఒక గౌరవాన్ని, అభినందనను, సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరచేందుకు పువ్వులనూ, పూలదండలనే ఉపయోగిస్తాం. స్త్రీ పురుషులిద్దరు జతకట్టే సందర్భం. తోడుగ నిలిచే వివాహ బంధంలోనూ పూలమాలే సాక్ష్యమై నిలుస్తుంది. అనుసంధానిస్తుంది. శృంగార రసావిష్కార కార్యప్రేరణా జ్వాలామణి. మధురాస్వాదనల గని. పువ్వులకు మనలోని భావనలెన్నింటినో ఆపాదించి వర్ణించుకొంటాము. నానారకాల పూలు, ఎప్పుడైనా మనం వాటి గణన చేశామా.. కోకొల్లలు. మల్లెలు, గులాబీలు, సంపెంగలు, మందారాలు, బంతులు, చామంతులు, సన్నజాజులు, కనకాంబరాలు, మొగిలిరేకులు, తంగేడుపూలు, గునుగుపూలు, గడ్డిపూలు, బిల్లగన్నేరు, గుమ్మడిపూలు కలువలు, తామరలు, చెంగల్వలు, పొద్దుతిరుగుడు, ఉమ్మెత్తలు, నందివర్థనాలు, తులిప్‌లు, నూరువరహాలు, నాగమల్లిపువ్వు, బ్రహ్మకమలం, పారిజాతాలు… ఇలా వేలరకాల వేల వర్ణాల పుష్ప విశ్వరూపాన్ని మనం చూడవచ్చు. పూలులేని భూ స్థలంలేదు. ఇట్లాంటి పువ్వులు వాడే సందర్భాలు కేవలం శుభవేలలేకాదు, చివరియాత్రలోనూ ఇవే వీడ్కోలు పలుకుతాయి. చివరి వందనం వీటితోనే చేస్తాము. అమరుల పాదాలకాడ పుష్పాంజలి ఘటిస్తాము. మనకు జ్ఞాపకంగా మిగిలిపోయిన వారి చిత్రానికి వేలాడే మాలలై స్మరిస్తుంటాయి. పూలులేని సందర్భం ఏమున్నది! పెళ్లినిండా పరచుకునేవి అవే. పూల జడలై విరిసేది అవే. ఇంటి అలంకరణకు తమ వొంటినందిస్తాయి. ఇంతి తలలోన తొలి అందమై మెరిసి మురిసిపడతాయి. అంతేకాదు ఆరాధనకూ, భక్తికీ పువ్వులే ఆదరువు. పూలులేని పూజ కనపడదు మనకు. అలాగే విజయానికి గుర్తుగా పూలమాలే దర్శనమిస్తుంది. అతిధులకు స్వాగతం పలికేవీ పూలే. పూలన్ని రకాలు మన అవసరాకు ఉపయోగించడానికి పూనుకుంటూ వాటిని చంపేస్తామని విలపించాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి. పూలకు మానవ హృదయాన్ని ఆపాదించి పుష్ప విలాపాన్ని రచించారు. ‘మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మకరంద మాధురీ/ జీవితమెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె/ మా యౌవన మెల్ల కొల్లగొని ఆపయి చీపురుతోడ చిమ్మిమమ్మావల పారబోతురుగదా! నరజాతికి నీతియున్నదా!” అని పువ్వులు ప్రశ్నిస్తున్నాయి. ఇక పువ్వులు అలంకరణ, అందానికే కాదు, అద్భుతమైన ఔషధ తయారీకి ఉపయోగపడతాయి. తేనెటీగలు పూలలోని తేనెను గ్రోలి కమ్మనైన తేనెను మనకందిస్తాయి. పాకృతికమైన రంగులనూ ఇస్తాయి.

ఎన్ని విశిష్ట ప్రయోజనాలున్నా పువ్వులనగానే ఆడపిల్లల జతగాళ్లుగానే చూడటం అలవాటయింది మనకు. ఆడపిల్లలూ పువ్వులంటే ఇష్టపడతారు. అలాంటి పువ్వులను పేర్చుకుని, పూజించి, పదిమందీ కలిసి పాటలతో ఆటలతో జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. స్త్రీలు మాత్రమే చేసుకునే స్త్రీల పండుగ, తెలంగాణకు మాత్రమే చెందిన పండగగా ప్రసిద్ధి చెందింది. ‘బతకమ్మా’ అనడంలోనే బతకటానికి ఏవో ఆటంకాలు, అవరోధాలు వచ్చాయన్న ధ్వని వినపడుతుంది. మన సమాజంలో తరతరాలుగా ఆడపిల్లలను తక్కువగా చూడడం, వివక్షతలకు గురిచేయటం చూస్తాము. ఇక పెళ్ళయి మెట్టినింటికి వచ్చాక అనేక ఆంక్షలు, ఒత్తిడులు. స్వేచ్ఛను కోల్పోయి వేదనలకు గురవుతారు. అలాంటి ఒక ఆడకూతురు కథాంశంలోనే ‘బతకమ్మ’ ఏర్పడి బతుకు యెతలను గాథలుగా తలపోసే సందర్భంగానే ఈ పండుగ ఆవిర్భవించింది. గౌరమ్మ దేవతారూపంగా మార్చి స్త్రీలు పాటలు పాడుకుంటారు. ఇంటి బయట పదిమందితో కలిసి మెలిసి ఆవేదనలను పంచుకుంటారు. ఇదొక గొప్ప సందర్భం. ఇప్పటికీ స్త్రీల సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లైంగికదాడులు, హత్యలు, వివక్షతలు జరుగుతూనే ఉన్నాయి.

స్త్రీ పురుష సమానత్వాన్ని సాధించనే లేదు. స్వావలంబన రాలేదు, ఆధునిక సమాజంలోనూ అనేక అగచాట్లకు ఆడపిల్ల గురవుతూనే ఉంది. ఆనాడు వారి అంతరంగాన్ని పూలకు విన్నవించినట్టే. నేడు కూడా బతుకమ్మ నినాదం స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, ఆర్థిక స్వావ లంబన కోసం ఇవ్వవలసి ఉన్నది. వివక్షతలపై గళమెత్తాల్సి ఉంది. పువ్వుల్లా నవ్వులు చిందగల జీవితాలు అమ్మాయిలకు ఉండాలని కోరుకుందాం. ”గుమ్మడి పూలు పూయగబతుకు, తంగెడు పసిడి చిందగ బతుకు, గునుగుతురాయి కులుకగా బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకమ్మా బతుకు” అని పాడిన కాళోజీ ఆశలు నెరవేరాలని కోరుకుందాం. పూల పండుగ చేద్దాం!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -