సుప్రీం మార్గదర్శకాల మేరకే ఖరారు
బీసీల గొంతు కోసింది బీఆర్‌ఎస్ పార్టీనే
పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తాం : పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్‌ల రిజర్వేషన్లకు మండల యూనిట్‌గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని ఖరారు చేశామని పేర్కొన్నారు. సుప్రీం మార్గదర్శకాలననుసరించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. కొన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో ఆ పరిమితిని దాటి పోకుండా ఉండేందుకు బీసీ రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగినట్టు చెప్పారు.
సర్పంచుల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, జడ్పీటీసీ లకు జిల్లాను, జడ్పీ చైర్మెన్లకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నామని వివరించారు. భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనాభా ప్రాతిపదికన 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్ల కేటా యింపు జరిగిందనీ, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆమె స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన తండాలు, గూడేంలు గ్రామ పంచాయతీలుగా మారడంతో గిరిజన సీట్ల సంఖ్య సహజంగా పెరిగిందని తెలిపారు.
కేటీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కేటాయింపుపై కేటీఆర్ తప్పుడు ప్రచారం మానుకోవాలని సీతక్క హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించిన పాపం బీఆర్‌ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందనీ, అయితే 2019లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని ఆరోపించారు. వాస్తవాలు ఇలా ఉంటే బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందని కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేసిందని గుర్తు చేశారు.
2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్ గా సర్పంచుల రిజర్వేషన్లను బీఆర్‌ఎస్ ఖరారు చేయగా, ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కుల గణనను అడ్డుకుంది ఎవరు? రిజర్వేషన్లపై అడ్డంకులు సృష్టించింది ఎవరు? అన్న ప్రశ్నలకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ప్రభుత్వపరంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం చేస్తూనే, పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో వారికి 42 శాతం సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం సీట్ల కేటాయింపుపై బీఆర్‌ఎస్ స్పష్టత ఇవ్వాలని సవాల్ విసిరారు.



