Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంకార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిఘటించండి

కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిఘటించండి

- Advertisement -

ప్రజానీకానికి సీఐటీయూ పిలుపు
న్యూఢిల్లీ :
ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను ప్రతిఘటించాలని సీఐటీయూ పిలుపిచ్చింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కీలకమైన మలుపునకు చేరుకుందని, అంతర్జాతీయ వాతావరణం కూడా తీవ్రమైన భౌగోళిక, రాజకీయ మార్పులకు లోనవుతోందని, దీనివల్ల రాబోయే సంవత్సరాల్లో పెట్టుబడులు, సరఫరా గొలుసులు, అభివృద్ధి అవకాశాలు బాగా దెబ్బతింటున్నాయని ఆర్థిక సర్వే స్వయంగా అంగీకరించినప్పటికీ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌ అసమంజ సంగా, దిశానిర్దేశంలేనిదిగా కనిపిస్తోందని సీఐటీయూ విమర్శించింది. కల్లోలంగా వున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ప్రధానంగా ఎదురవుతున్న సవాళ్ళను పరిష్కరించేలా లేదా ఆ పరిస్థితులకు భారత్‌ను సన్నద్ధం చేసేందుకు అర్ధవంతమైన విధాన మార్పును అందించేలా ఈ బడ్జెట్‌ లేదని విమర్శించింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమరం కరీం ఒక ప్రకటన విడుదల చేశారు.

కార్మిక వర్గంపైకి, సామాన్య మానవుడిపైకి భారాన్ని బదలాయించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అర్థిక సర్వే, కేంద్ర బడ్జెట్‌లు ప్రయత్నిస్తున్నాయని సీఐటీయూ, ఇతర కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరిస్తూనే వచ్చాయి. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం, నాణ్యతా నియంత్రణా ప్రమాణాలను నీరు గార్చడం, దేశీయ పరిశ్రమలను బలహీనపరచడం వంటి చర్యలను సంస్కరణల ఎజెండాగా ప్రభుత్వం చెప్పుకుంటోంది. ‘యువజన శక్తి’ అంటూ వాక్చాతుర్యంతో మొదలైన బడ్జెట్‌ ప్రసంగం చివరగా ‘విద్య నుండి ఉపాధి, సంస్థల వరకు’ ఉన్నత స్థాయి సంఘం ఏర్పాటు ప్రతిపాదనతో ముగిసింది. ఈ కమిటీ లక్ష్యాలను 2047వరకు విస్తరించారు. భారతదేశపు యువతకు మంచి, భద్రతతో కూడిన ఉపాధి అవసరం, అంతేకానీ సుదూర హామీలు కాదు.

ఈ బడ్జెట్‌ను గణాంకాల పరంగా చూసినట్లైతే ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో వున్నట్లు కనిపిస్తోంది. ఆకలి, నిరుద్యోగం వంటి వాస్తవికతలపై దృష్టి పెట్టడం కన్నా ఆర్థిక లోటును 4.3శాతానికి తీసుకురావడానికి, అలాగే రుణాలు-జీడీపీ మధ్య నిష్పత్తిని 55.6శాతానికి కుదించడానికి సూక్ష్మ ఆర్థిక దృక్పథాలకు, విధానాలకే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇది పేదల చేతుల్లో నుండి ద్రవ్య లభ్యతను ఉపసంహరించే బడ్జెట్‌. రూ.53.5 లక్షల కోట్ల వ్యయాన్ని చూపిస్తున్నప్పటికీ సామాజిక మద్దతును వ్యవస్థాగతంగా తుడిచిపెట్టారని వాస్తవిక పరిస్థితి వల్ల తెలుస్తోంది.

అధికాంగా లాభార్జన సాగించే కార్పొరేట్లపై పన్నులు వేయడం ద్వారా ఆదాయాలను పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం జరిగినట్టు కనిపించడం లేదు. కోటీశ్వరుల వర్గానికి చాలా స్పష్టంగా వరాల జల్లు కురిపించారు. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్‌)ను 15 నుంచి 14శాతానికి తగ్గించారు. అదే సమయంలో తిరోగమన జీఎస్టీ, వ్యక్తిగత ఆదాయ పన్నుల కారణంగా రూ.28.7లక్షల కోట్ల మేరా పన్నుల భారాన్ని సామాన్యుడు ఎదుర్కొంటున్నాడని సీఐటీయూ విమర్శించింది. మొట్టమొదటిసారిగా కార్పొరేట్‌ పన్ను వసూళ్ళు (12.3లక్షల కోట్లు) కన్నా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్ళు (14.66లక్షల కోట్లు) అధికంగా వున్నాయి.
సంఘటిత రంగంలో ఉపాధి స్తబ్దత లక్షలాదిమంది కార్మికులను ఏ మాత్రమూ భద్రత లేని గిగ్‌ పనుల వైపునకు నెట్టివేసింది. ఆర్థిక సర్వే పదేపదే ప్రస్తావించినప్పటికీ బడ్జెట్‌లో మాత్రం గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ఎలాంటి చర్యల చేపట్టలేదు. పైగా వారికిచట్టపరమైన గుర్తింపునందిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చడం లో విఫలమైంది. అలాగే అసంఘటిత రంగాల్లోని ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులకు కూడా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవని విమర్శించింది.

దేశంలో కార్మిక వర్గం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బతకడానికి ఇబ్బందులు పడుతన్న సమయంలో ప్రభుత్వం సమర్పించిన ఈ బడ్జెట్‌ పూర్తిగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక బడ్జెట్‌ అని సిఐటియు విమర్శించింది.
ఈ కార్మిక, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను పూర్తిగా ప్రతిఘటిం చాలని సిఐటియు పిలుపిచ్చింది. ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మె సందర్భంగా ఈ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమైక్యంగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపిచ్చింది.

దేశీయ సంస్థలు బలహీనం
వ్యాపారం చేయడంలో సౌలభ్యతను కల్పించే పేరుతో ఈ బడ్జెట్‌ పన్ను ఎగవేతదారులు, కార్పొరేట్ల కోసం డీ క్రిమినలైజేషన్‌ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్ళింది. కార్పొరేట్‌ రంగానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాల కోసం ఈ బడ్జెట్‌ మరిన్ని కేటాయింపులను పెంచనుంది, దేశీయ టారిఫ్‌ జోన్‌లో సబ్సిడీ ధరలకు సెజ్‌ యూనిట్లను విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇది దేశీయ సంస్థలను బలహీనపరిచింది. ఇది, ఒకపక్క కార్మికులను అభద్రతా భావానికి గురిచేస్తూ మరోపక్క పెట్టుబడులను ముప్పు నుండి రక్షించుకునే ప్రయత్నాన్ని వెల్లడిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -