– ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నవతెలంగాణ – ఉప్పునుంతల
మండలంలోని రాయిచేడు పాఠశాలను మండల విద్యాధికారి చంద్రశేఖర్ శుక్రవారం తనిఖీ చేశారు. వెల్టూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు. రెండు రోజులుగా నవతెలంగాణ పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో పాఠశాల పనితీరుపై ఎంఈఓ విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు వెంకట్ రామ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సమయపాలన పాటించకపోవడం, విద్యార్థుల హాజరు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని సూచించారు.
తనిఖీ సమయంలో ఎంఈఓ చంద్రశేఖర్ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా పాఠశాల సమయాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆన్‌లైన్ అటెండెన్స్ నమోదు చేయాలని తెలిపారు. అవసరం లేకుండా మొబైల్ ఫోన్ వాడకూడదని, బోధనపై పూర్తిగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి తల్లిదండ్రులు, గ్రామ ప్రజల్లో పాఠశాలపై నమ్మకం పెంచేలా పనిచేయాలని, ఎఫ్ ఎల్ ఎస్ కార్యక్రమంలో భాగంగా మూడవ తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్ పరీక్షలు నిర్వహించి రికార్డులు నమోదు చేయాలని చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా పర్యవేక్షించాలని సూచించారు.



