– కదిలిన యంత్రాంగం.. తొలగిన చెత్త
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం : “డంపింగ్ యార్డుకు సగం.. రోడ్లపై సగం” అనే శీర్షికన గురువారం నవతెలంగాణ ప్రచూరించిన వార్త కథనానికి ఇబ్రహీంపట్నం మున్సిపల్ యంత్రాంగం స్పందించింది. రోడ్లపై డంపింగ్ యార్డ్ ను తలపించే విధంగా పేరుకుపోయిన చెత్తను తొలగించింది. అందుకు సంబంధించిన వివరాలు.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుంది. డంపింగ్ యార్డ్ కు తరలింపు క్రమంలోనూ చెత్త సేకరించే వాహనాలకు ప్రజలు చెత్తను సరిగ్గా వేయడం లేదు. నిర్మానుష ప్రాంతాల్లో ప్రజలు రోడ్డుకిరువైపులా పడవేస్తున్నారు. దాంతో ఇబ్రహీంపట్నంలోని 12వ వార్డుతో పాటు 8వ వార్డులోని భారత్ గార్డెన్ నుండి రాయపోలు బైపాస్ రోడ్డు వరకు విపరీతమైన చెత్త కుప్పలతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్లపైనే ప్రవహిస్తోంది. ఈ తరుణంలో గురువారం నవతెలంగాణలో డంపింగ్ యార్డ్ కు సగం.. రోడ్డుపై సగం అనే శీర్షికన వార్త కథనాన్ని ప్రచురించింది. దానికి మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ స్పందించారు. గురువారం ఉదయం 6 గంటలకే తమ సిబ్బందితో బైపాస్ రోడ్ లో పేరుకుపోయిన చెత్తను జేసీబీల సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన “నవతెలంగాణ” తో మాట్లాడుతూ.. చెత్త, సానిటేషన్ సమస్యపై తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇబ్రహీంపట్నాన్ని చెత్తా రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారం ఎంతో అవసరమన్నారు. తాము చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాజం సహకరించాలని కోరారు. చెత్త తొలగించిన నేపథ్యంలో ఆ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
నవతెలంగాణ వార్తకు స్పందన
- Advertisement -
- Advertisement -



