Tuesday, May 13, 2025
Homeఎడిట్ పేజిప్రశ్నలు మిగిల్చిన విరమణ

ప్రశ్నలు మిగిల్చిన విరమణ

- Advertisement -

భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న ఘర్షణకు తెరపడింది. నా సారథ్యంలో లేదా మధ్యవర్తిత్వం(ట్రంప్‌ ఏదనుకుంటే అది..) లో రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వయంగా ప్రకటించుకున్నారు. దాన్ని ఇటు భారత్‌, అటు పాక్‌ ధృవీకరించాల్సి వచ్చింది. అమెరికా ‘పెద్దన్న’ పాత్ర సహజంగానే అనుమానాలకు తావిస్తోంది. భారత విదేశాంగ విధానాన్ని, కశ్మీర్‌ సమస్యను సైతం అమెరికా జోక్యం వేలెత్తిచూపుతోంది. ఇప్పటిదాకా ద్వైపాక్షిక సమస్య అనుకుంటున్న కశ్మీర్‌ సమస్య నేటి అమెరికా జోక్యంతో అంతర్జాతీయ సమస్యగా మారిందని భావించవచ్చా? పహల్గాం దుశ్చర్యకు పాల్పడిన టెర్రరిస్టులను పాక్‌ ప్రభుత్వం భారత్‌కు అప్పగిస్తుందా? ఈ మేరకు పాక్‌ లిఖిత పూర్వకంగా ఒప్పుకుందా? అమెరికా నిజంగానే మధ్యవర్తిత్వం వహించిందా లేదా ఆ దేశం ఆదేశించడం వల్లనే కాల్పుల విరమణకు భారత్‌ అంగీకరించిందా? అదే జరిగితే, అమెరికా సామ్రాజ్యవాదానికి భారత విదేశాంగ విధానం పూర్తిగా దాసోహమైనట్లే కదా? కాల్పుల విరమణ సంతోషకరమైన విషయమే అయినప్పటికీ, అమెరికా జోక్యం వల్ల ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమయ్యాయి. ఈ కాల్పుల విరమణ ఎంతకాలం? పరిధులు ఎమిటి? అనేది ఇప్పటికైతే అస్పష్టమేనని చెప్పవచ్చు.
పాకిస్థాన్‌ పాలకులను కాలనాగులా పెంచిపోషించింది అమెరికానే. ఆనాడు అమెరికా తయారు చేసిన ప్రతి ఆయుధమూ పాక్‌ అమ్ములపొదిలో అస్త్రమై ఉండింది. ఎప్పుడైనా అమెరికా ఒక మాట చెపితే, పాకిస్థాన్‌ తూ.చ.తప్పకుండా పాటిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అమెరికా ఆదేశించిన మరుక్షణమే పాక్‌ తలూపి, కాల్పుల విరమణకు ఆమోదం తెలిపింది. తాజా ఉదంతంతో భారత్‌ కూడా పాక్‌కు ఏమాత్రం తీసిపోకుండా, ‘పెద్దన్న’ కొరడా ఝుళిపించగానే తల ఆడించినట్టుంది. అలీన విధానంతో ప్రశంసలు పొందుతూ గొప్ప దేశంగా అలరారిన భారత ప్రతిష్టను బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా సామ్రాజ్యవాదానికి తాకట్టుపెట్టింది. తాజా కాల్పుల విరమణ క్రమంలో భారత వైఖరి, అమెరికా జోక్యంతో ఈ విషయం మరోసారి బట్టబయిలైంది. కశ్మీర్‌ సమస్య ద్వైపాక్షికమంటూ దశాబ్దాలుగా చెప్పుకుంటున్న భారత్‌ ఇప్పుడు అమెరికా ఆదేశంతో కాల్పుల విరమణకు ఎలా ఒప్పుకుంది? ఎందుకు ఒప్పుకుంది? కొత్తగా ట్రంప్‌ మాటల్లో తీయదనమేమైనా గోచరించిందా?
ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గామ్‌ టెర్రరిస్టులు దాడి చేసి 26 మంది పౌరులను విచక్షణారహితంగా కాల్చి చంపేశారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భారత్‌ సైనిక చర్య చేపట్టి, ఉగ్రవాద స్థావరాలుగా అనుమానిస్తున్న కొన్ని ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులుగా పరిగణిస్తున్న వందమందిని హతమార్చామని బీరాలు పలుకుతుందే తప్ప అధికారిక ప్రకటనైతే రాలేదు. దీంతో పాకిస్థాన్‌ కొన్ని చర్యలకు ఉపక్రమించడం… భారత్‌ ప్రతీకార చర్యలను తీవ్రతరం చేసింది. దీంతో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ను గొప్ప విజయంగా గోడీమీడియా అద్భుత కథనాలను వండి వార్చింది. వాస్తవాలు తెలిపిన మీడియాపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఏమైనా, ప్రస్తుతానికి యుద్ధం తప్పింది. పిఓకేని ఆక్రమించాలి, పాకిస్థాన్‌తో యుద్ధం చేయాలంటూ రెచ్చగొట్టిన నోళ్లు మూతబడ్డాయి. జరిగిన అఖిల పక్షం మీటింగ్‌కు యథాప్రకారం ప్రధాని డుమ్మా కొట్టారు. ప్రశ్నలకు ‘చక్రవర్తి’ అతితుడు కదా. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరపాలన్న డిమాండును ఈ ప్రభుత్వం ఖాతరు చేసేలా లేరు. కాని కీలక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
ఇరుగుపొరుగుతో ఘర్షణలు ఏదేశానికీ మంచిది కాదు. ఈ విషయంలో పాకిస్థాన్‌ పాలకులకు బుద్ధిలేకపోయినా మన పాలకులకైనా ఉండాలి కదా! మూడు వేల కి.మీ.లకు పైగా సరిహద్దు ఉన్న దేశంతో పైగా మతం ఆధారంగా ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్న దేశంతో మరింత చాకచక్యంతో వ్యవహరిం చాలి. ఇంతకూ ఈ ప్రతీకార చర్యలో అసలు నిందితులు ఏమయ్యారు? ఇప్పటికీ సమాధానం లేదు. మనదేశ పౌరు లను ఊచకోత కోసిన దుర్మార్గులను భారత సైన్యం కడతేర్చిందా? ఎన్నికల వేళ ఆపరేషన్‌ సిందూర్‌ కేవలం ‘రక్తసిందూరమేనా?’. అసలు దుండగులను అప్పగిస్తామని పాక్‌ ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో కనీసం హామీయిచ్చి ఉంటే దేశం సంతోషించేది. అదీ జరగలేదు. ఉగ్రవాద శిబిరాలను పరిపూర్ణంగా మట్టుబెట్టినా సంతోషించేవాళ్లం. అదీ జరగలేదు. కనీసం భారత్‌, పాక్‌ అధికారులు కలిసి కూర్చొని చర్చించి, కాల్పుల విరమణకు ‘సై’ అని చెప్పినా సంతోషించేవాళ్లం. అదీ జరగలేదు. అమెరికా జోక్యం చేసుకొని, రెండు దేశాలను బెదిరిస్తే తప్ప కాల్పుల విరమణ కొలిక్కిరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -