– ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– విధివిధానాలను ఆవిష్కరించనున్న మంత్రులు వెంకట్‌రెడ్డి, సీతక్క
– హాజరుకానున్న బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు, వర్క్ ఏజెన్సీలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించింది. జాతీయ రహదారులకు తీసిపోని విధంగా నిర్మించేందుకు హైబ్రిడ్ అన్యూయిటి మోడ్ (హ్యామ్) విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నది. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ న్యాక్ ఆడిటోరియంలో హ్యామ్ ప్రాజెక్ట్ రోడ్‌షో కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే షో కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రభుత్వ విజన్, ప్రాజెక్టు విధివిధానాలు, ప్రత్యేకతలు, ప్రణాళికలు, నిర్మాణకాలం, అర్హత, ఎంపిక విధానం అంశాలను వివరించే హ్యామ్ ప్రాజెక్ట్ రోడ్ షోలో దేశ వ్యాప్తంగా బ్యాంకర్లు, కాంట్రాక్టర్లు, వర్క్ ఏజెన్సీ నిర్వాహకులు పాల్గొనున్నారు. ఇది ఒక రకంగా ప్రీ-బిడ్ మీటింగ్ తరహాలో ఉండే సమావేశమని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెబుతున్నారు.
15 ఏండ్లు కాంట్రాక్టర్లదే బాధ్యత
హ్యామ్ ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వాటా 40 శాతం కాగా మిగిలిన 60 శాతం నిధులను కాంట్రాక్టర్లు, ఏజెన్సీలే సమీకరించాలి. 15 ఏండ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదే. గతంలో హ్యామ్ విధానం కేవలం జీహెచ్‌ఎంసీలోనే అమలయ్యేది. గ్రేటర్‌లో విజయవంతమైన ఈ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఆదేశాలతో నాలుగు నెలలుగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం హ్యామ్ ప్రాజెక్టుపై కసరత్తులు చేసింది. ఆయా రాష్ట్రాల్లో హ్యామ్ ప్రాజెక్టుల్లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నివేదిక సమర్పించింది. ఎక్కడా ప్రజలకు ఈ రహదారుల మీద టోల్ వంటి చార్జీల భారం లేకుండా హ్యామ్ ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. జాతీయ రహదారులతో పాటు తమిళనాడు, కర్నాటక, మహరాష్ట్ర, రాజస్థాన్, యూపీ వంటి 12 రాష్ట్రాల్లో ఈ విధానం విజయవంతమైన విషయం విదితమే.
రాష్ట్రంలో మూడు విడతల్లో 18,472 కిలోమీటర్ల గ్రామీణ రహదారులు హ్యామ్ విధానంలో నిర్మించేందుకు తెలంగాణ క్యాబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. మొదటి విడతలో 7,947 కిలోమీటర్లకు సంబంధించి 2,254 రహదారులకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాలను, ప్రజల అవసరాలు, స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదిత రహదారి పనులను గుర్తించారు. గ్రామపంచాయతీ స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు అన్ని స్థాయిల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటివరకూ రోడ్డు సౌకర్యానికి నోచుకోని గ్రామాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతమున్న రహదారులను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించనున్నారు. 30 టన్నుల వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారులను తీర్చిదిద్దుతారు. ఇది ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని కల్పించడంతోపాటు, అభివృద్ధికి బలమైన బాటవేస్తుంది. దీంతో తెలంగాణ రహదారుల రంగంలో ఒక మహర్దశ ప్రారంభమైనట్లేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తాజా రోడ్‌షోలో హ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను బ్యాంకర్లు, వర్క్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు అధికారులు వివరిస్తారు. అనుమానాలను నివృత్తి చేస్తారు. సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు.
పక్కా రోడ్ల నిర్మాణానికి ఉత్తమ మార్గం హ్యామ్
తెలంగాణ రాష్ట్ర ఖజానాపై తక్కువ భారం పడేలా, వేగంగా, అత్యుత్తమ నాణ్యతతో రోడ్ల నిర్మాణం కావాలంటే హ్యామ్ మోడల్ బెస్ట్. దేశంలోని పలు రాష్ట్రాల్లో విజయవంతంగా అమలై, 20 నుంచి 25 ఏళ్ల పాటు చెక్కు చెదరని రోడ్లను అందించే ఈ విధానం ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు కొత్త జీవం పోయబోతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 68,539 కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్లో సుమారు 30 వేల కిలోమీటర్లు ఇప్పటికీ మట్టి, కంకర రోడ్లే. ఈ పరిస్థితి మారాలి. పల్లెలకూ జాతీయ రహదారి స్థాయిలో రవాణా సౌకర్యం కల్పించాలన్నదే మా లక్ష్యం. ప్రజలపై రూపాయి అదనపు భారం లేకుండానే ఈ మార్పు సాధ్యం కాబోతున్నది. నిర్మాణం నుంచి నిర్వహణ వరకూ పూర్తి బాధ్యత ఏజెన్సీలదే. ప్రభుత్వ విజన్‌ను అందరికీ వివరించే హ్యామ్ ప్రాజెక్ట్ రోడ్ షోను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.
– మంత్రి సీతక్క
నేడు హ్యామ్ ప్రాజెక్ట్‌పై రోడ్ షో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES