Thursday, October 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీటీ-2 పత్తిపై గులాబీ పురుగు ఉధృతి

బీటీ-2 పత్తిపై గులాబీ పురుగు ఉధృతి

- Advertisement -

దిగుబడులపై రైతుల ఆందోళన
సీసీఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
వరుసగా కురిసిన వర్షాలు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. అంతేకాదు బీటీ-2 పత్తిపై గులాబీ పురుగు ఉధృతి కనిపించడం రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. బీటీ-1, బీటీ-2 టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చిన పత్తిలో కాయతొలుచు పురుగు రావడం మహాడేంజరే.. కాయతొలుచు పురుగు రాకుండా జీన్‌ టెక్నాలజీతో బీటీ-1, బీటీ-2 పత్తి విత్తనాలను రూపొందించారు. తాజాగా బీటీ-2 పత్తి విత్తనాల సాగు మాత్రమే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గణనీయంగా సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీటీ-2 పత్తి చేలల్లో గులాబీ రంగు పురుగు దాడి ఉధృతమవడంతో రైతులు ఆందోళనకు గురవు తున్నారు.

ఈనేపథ్యంలో ‘నవతెలంగాణ’ బృందం హన్మకొండ జిల్లా నడికూడ, ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి గ్రామాలను సందర్శించి పత్తి పంటలను పరిశీలించగా, వర్షాలతో చెట్టుకు 15కాయలు నల్లబారి కుళ్లిపోయి కనిపించాయి. గతేడాది ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 5లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది ఐదు లక్షలా 10వేల ఎకరాల్లో పత్తిని సాగైంది. అదనంగా 10,572 ఎకరాలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగింది. వరంగల్‌, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గతేడాదితో పోల్చితే తగ్గింది. జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో మాత్రం గత ఏడాది కంటే పత్తి సాగు పెరిగింది.

వరుస వర్షాలతో కుళ్లిన పత్తి కాయలు
వరుస వర్షాలు పత్తి దిగుబడులపై భారీ ప్రభావాన్ని చూపుతున్నాయి. హనుమకొండ జిల్లా నడికూడ, ఐనవోలు మండలాల్లో బుధవారం ‘నవతెలంగాణ’ పర్యటించి పత్తి చేలను పరిశీలించింది. నడికూడ మండలం కౌకొండ గ్రామంలో పత్తి చేన్లలో నీరు నిలిచిపోయి, కాయలు పగిలి పత్తి తడిసింది. పత్తి ప్రతి చెట్టుకు 10-15 కాయలు కుళ్లిపోయి నలుపురంగులోకి మారాయి. ఇదే పరిస్థితి ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోనూ కనిపించింది. దీని ప్రభావం దిగుబడిపైనా ఉండనుంది. పలు ప్రాంతాల్లో పత్తిచేను గిడసబారి కాయలు పెద్ద సంఖ్యలో కాయలేదు. కొన్నిచోట్ల కాసినా.. కాయలు పగిలి కుళ్లిపోయి కాయకుళ్లు తెగులు వచ్చింది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో బీటీ-2 పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్టు రైతులు తెలిపారు. గులాబీ రంగు పురుగు రాకూడదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

తగ్గనున్న దిగుబడులు
2020-21లో ఉమ్మడి జిల్లాలో 32.56 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు రాగా, 2021-22లో కేవలం 12.19లక్షల క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. 2022-23లో 11.37లక్షల క్వింటాళ్లు, 2023-24లో 29.63లక్షల క్వింటాళ్లు, 2024-25లో 40.50లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. వాస్తవానికి సాధారణ పరిస్థితుల్లో ఎకరాకు 10-12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. పంట బాగుంటే దిగుబడి 15 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఈ ఏడాది వర్షాలు వరుసగా కురవడంతో 2-3 క్వింటాళ్ల మేరకు దిగుబడులు తగ్గనున్నట్టు వ్యవసా యాధికారులు అంచనా వేస్తున్నారు. ఎర్ర చెల్క నేలల్లో పత్తి గణనీయంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మొక్కజొన్న విత్తడానికి రైతులు సన్నద్ధమైనట్టు అధికారులు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలతో పర్యటిస్తాం : డీఏఓ రవీందర్‌సింగ్‌, హన్మకొండ జిల్లా
బీటీ-2 పత్తి చేన్లలో గులాబీ రంగు పురుగు రావడంపై వెంటనే వరంగల్‌ వ్యవసాయ పరిశోధనాస్థానం శాస్త్రవేత్తలతోపాటు వ్యవసాయ శాఖాధికారులతో సంయుక్త క్షేత్ర సందర్శన నిర్వహిస్తాం. పత్తి చేన్లను పరిశీలించాక రైతులకు సూచనలు చేస్తాం.

గులాబీ రంగు పురుగుతో సగం దిగుబడే.. గిరుక సంపత్‌, ఒంటిమామిడిపల్లి
10-15 రోజుల నుండే చేన్ల గులాబీ రంగు పురుగు కనపడుతాంది.. వరుసగా వర్షాలు పడి ప్రతి చెట్టుకు 10-15 కాయలు కుళ్లిపోయి దిగుబడికి నష్టమైతాంటే.. మళ్లీ ఈ గులాబీ రంగు పురుగుతో దిగుబడి సగం తగ్గినట్టే.. ఇప్పటికీ వంద రోజుల చేను ఇది. మరో 30 రోజులు ఈ చేను కాపాడుడు కష్టమేననిపిస్తాంది.

ఈసారి నష్టపోయినట్టే.. ఓదెల శ్రీలత, కౌకొండ
వర్షాలు వరుసగా పడుతాంటే చేన్ల కలుపు తీసుడు కూడా కష్టమైతాంది. ఈ వర్షాలతో కాయలు బుడ్డిపోయి నరు.. నల్లగా మారి దూది పింజ కుళ్లిపోయి దిగుబడి తీవ్రంగా పడిపోయింది. ఈసారి పత్తితో నష్టపోయినట్టే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -