Wednesday, October 22, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురూ.180 కోట్ల నకిలీ ఓఆర్‌ఎస్‌ దందాకు అనుమతి

రూ.180 కోట్ల నకిలీ ఓఆర్‌ఎస్‌ దందాకు అనుమతి

- Advertisement -

నిల్వ ఉన్న స్టాక్‌ అమ్మకానికి ఢిల్లీ హైకోర్టు ఓకే
ప్రజల భాగస్వామ్యంతో తిప్పికొట్టాలి : ఐఎంఏ
అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్‌ శివరంజని సంతోష్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నిల్వ పేరుతో నకిలీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను మార్కెట్లోకి వదిలేందుకు ఒక బడా కంపెనీ సిద్ధమైంది. ఇటీవల నకిలీ ఓఆర్‌ఎస్‌లకు చెక్‌ పెడుతూ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఓఆర్‌ఎస్‌ బ్రాండ్‌ను ఉప యోగించి ఎనర్జీ డ్రింక్‌ల పేరుతో జరుగుతున్న అమ్మకాలకు చెక్‌ పడిన సంగతి తెలిసిందే. దీంతో పలు బడా కంపెనీలు ఆ ఉత్తర్వులపై మౌనంగా ఉన్నప్పటికీ ఓ కార్పొరేట్‌ కంపెనీ ఢిల్లీలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమ వద్ద ఇది వరకే నిల్వ ఉన్న స్టాక్‌ను అమ్ముకునేందుకు అనుమతి పొందింది. పిల్లలు డయేరియాతో డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు వాడే ఓఆర్‌ఎస్‌ బ్రాండ్‌ నేమ్‌తో అధికంగా షుగర్‌ ఉండే డ్రింక్స్‌ అమ్మకాలు ప్రాణాంతకంగా మారాయి. దీనిపై హైదరాబాద్‌కు చెందిన పిల్లల వైద్యురాలు డాక్టర్‌ శివరంజని సంతోష్‌ న్యాయ పోరాటం చేశారు. ఎనిమిదేండ్లుగా ఆమె చేసిన పోరాటం ఫలించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వాటికి చెక్‌ పెడుతూ ఉత్తర్వులిచ్చింది. ఆహార పదార్థాల పేరుతో గానీ, ట్రేడ్‌మార్క్‌, ప్రిఫిక్స్‌, సఫిక్స్‌లో ఎక్కడా ఓఆర్‌ఎస్‌ పదం వాడడం ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌- 2006 నిబంధనలకు విరుద్ధమని ఉత్తర్వుల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టం చేసింది. తప్పుదారి పట్టించే ఓఆర్‌ఎస్‌ ఉత్పత్తుల ప్రకటనలపై చర్యలు తీసుకుంటామని 2022 ఏప్రిల్‌లో జారీ చేసిన ఆదేశాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని కూడా తెలిపింది.
దీంతో తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే, ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా చేసిన నిషేధ ఉత్తర్వులతో ఆర్థికంగా నష్టం కలుగుతుందని భావించిన ఆ బడా కంపెనీ ఢిల్లీ హైకోర్టులో వాదించింది. ఇప్పటికే తమ వద్ద నిల్వ ఉన్న, మార్కెట్లోకి పంపే ఉత్పత్తుల విలువ రూ.155 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకుంటుందని పేర్కొంది. ఈ స్టాక్‌ను అమ్ముకునేందుకు అనుమతించాలని అభ్యర్థించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ, ఆ స్టాక్‌ను అమ్ముకునేందుకు అనుమతించింది.

వెనక్కి పంపించండి :విక్రయదారులకు ఐఎంఏ వినతి
టెట్రా ప్యాకెట్లలో వస్తున్న నకిలీ ఓఆర్‌ఎస్‌లను వెనక్కి పంపించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ అర్జున్‌ రాజ్‌ విక్రయదారులకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌ చేసిన పోరాటంతో పలు కంపెనీలు ఓఆర్‌ఎస్‌ బ్రాండ్‌ నేమ్‌తో చేసే మార్కెట్‌కు ఫుల్‌ స్టాప్‌ పడిందని తెలిపారు. అయితే చట్టపరమైన అంశాలను అడ్డుపెట్టుకుని తిరిగి మార్కెట్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. పిల్లల ప్రాణాలను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలకు హౌల్‌ సేలర్లు, రిటైలర్లు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఆ కంపెనీ ఓఆర్‌ఎస్‌ పేరుతో పంపించే ఉత్పత్తులను తిరిగి వెనక్కి పంపించాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలు డయేరియాకు గురైన సందర్భంలో వైద్యులు సూచించిన ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని మాత్రమే తీసుకోవాలని కోరారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :డాక్టర్‌ శివరంజని సంతోష్‌
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాల పట్ల డాక్టర్‌ శివరంజనీ సంతోష్‌ హర్షం వ్యక్తం చేశారు. తన పోరాటం ఫలించిందని తెలిపారు. దేశంలో పిల్లల మరణాలకు దారి తీస్తున్న వాటిలో డయేరియా కూడా ఒక ప్రధాన కారణమని చెప్పారు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓఆర్‌ఎస్‌ కొనుగోలు సమయంలో తప్పనిసరిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు మేరకు అన్ని ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకే ఆయా పదార్థాలు ఓఆర్‌ఎస్‌లో ఉండాలన్నారు. నకిలీ ఓఆర్‌ఎస్‌లు ఎక్కువగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మార్క్‌ పేరుతో ఫుడ్‌ ప్రొడక్ట్‌గా ఉంటాయని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -