రోడ్డున పడ్డ 26వేల మంది ఎస్సీ, ఎస్టీ బీఏఎస్ విద్యార్థులు
విద్యార్థులను పాఠశాలల్లోకి అనుమతించని ప్రయివేటు యాజమాన్యాలు
13న రౌండ్‌టేబుల్ సమావేశం : కేవీపీఎస్, టీజీఎస్, ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి రూ.220 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 13న ఉద్యమ కార్యాచరణకై హైదరాబాద్ లో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, తెలంగాణ గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీల ప్రధాన కార్యదర్శులు టి.స్కైలాబ్ బాబు, ఆర్. శ్రీరాం నాయక్, టి.నాగరాజు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాలు హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.ప్రాథమిక తరగతిలో ఒక్కో విద్యార్థికి ఏటా రూ.28 వేలు, ప్రాథమికోన్నత తరగతిలో వసతితో కలిపి రూ.42 వేల చొప్పున ఈ స్కీం కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కీం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 230 ప్రయివేటు పాఠశాలలకు రూ.220 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పడిందని చెప్పారు. బకాయిలు చెల్లించాలని దళిత, గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఈ పథకం పరిధిలోని 26 వేల మంది విద్యార్థులకు చదువు, భోజనం, వసతి కల్పించలేకపోతున్నామని ప్రయివేటు యాజమాన్యాలు వారిని పాఠశాలల్లోకి అక్టోబర్ 6 నుంచి అనుమతించడం లేదని తెలిపారు. దళిత, గిరిజన విద్యార్థులు రోడ్డున పడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కీం పరిధిలో చదువుతున్న విద్యార్థులు గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదని తెలిపారు. బకాయిలను విడుదల చేయడంలో ఆర్థిక, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళిత, గిరిజన శాసనసభ్యులు తక్షణం స్పందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. అక్టోబర్ 13న జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాలతో చర్చించి ఉద్యమ కార్యాచరణ చేపడతామని తెలిపారు.