మహాలక్ష్మీతో పెరుగుతున్న రద్దీ సదుపాయాల కల్పనపై సమాలోచనలు
అసెంబ్లీ వేదికగా ఆర్టీసీ యాక్షన్ ప్లాన్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలో ఆర్టీసీ ద్వారా రవాణా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై అసెంబ్లీ వేదికగా ప్రత్యేక కార్యాచరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత రెండు రోజులుగా ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి , పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సమావేశమవుతున్నారు. ఆయా జిల్లాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. గురువారం ఈసందర్భంగా ఆర్టీసీ బస్సులు, కొత్త రూట్లు, బస్సుస్టేషన్ల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. మహబూబ్ నగర్, వరంగల్ , నిజామాబాద్ జిల్లా మంత్రులు ,ఎమ్మెల్యేలు తో ఆర్టీసీ అధికారుల సమావేశమయ్యారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి నియోజకవర్గంలో అవసరమైన ఆర్టీసీ పరమైన అంశాలపై ఉమ్మడి జిల్లాల వారిగా అసెంబ్లీ మీటింగ్ హల్‌లో మహబూబ్‌నగర్, వరంగల్ , నిజామాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులతో రెండవ రోజు హాజరయ్యారు.
ఈరోజు సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు,వివేక్ వెంకట్ స్వామి, సీతక్క , వాకిటి శ్రీహరిలు పాల్గొని ఇన్‌ఛార్జిలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలతో పాటు వారి నియోజకవర్గాల్లో కావాల్సిన వాటిపై అధికారులను కోరారు. మహబూబ్ నగర్ జిల్లాపై మంత్రులు జూపల్లి కృష్ణారావు,వాకిటి శ్రీహరిలు మాట్లాడుతూ జిల్లాల్లో కొత్త రూట్ లలో బస్సులు కావాలనీ, విద్యార్థుల కాలేజీ సమయానికి బస్సులు నడపాలని సూచించారు. చిన్న పల్లెలకు మినీ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించాలని తాను ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బస్సుల కెనెక్టివిటీ పెంచాలని కోరారు. చెన్నూరులో బస్‌స్టేషన్ అభివృద్ధి చేయాలని ,ఇన్‌చార్జి మంత్రి గా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని సూచించారు. ములుగు జిల్లాలో ఏటూరు నాగారం బస్‌డిపో ములుగు జిల్లా కేంద్రానికి మంజూరైన బస్ స్టేషన్ పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని వాటి పనులు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద శాశ్వత పరిష్కారంగా బస్ స్టేషన్ నిర్మించాలని కోరారు. అందుకు దేవాదాయ శాఖ ,టూరిజం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. శని, ఆదివారాల్లో హనుమకొండ నుంచి మేడారంకి బస్సులు వేయాలని కోరారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తన నియోజకవర్గంలోని రేగొండలో శంకుస్థాపన చేసుకున్న బస్ స్టేషన్ పనులు వేగవంతం చేయాలని కోరారు. వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీకి ప్రత్యేక బస్సులు నడిపించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కోరారు. పురాతన హనుమకొండ బస్ స్టేషన్ మోడర్న్ బస్ స్టేషన్ గా మార్చాలనీ, వర్షకాలంలో వరదలో బస్ స్టేషన్లోకి నీళ్ళు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
హనుమకొండ బస్‌స్టేషన్‌ను అభివృద్ది చేస్తే ఆర్టీసీ కమర్షియల్‌గా ఆదాయం వస్తుందన్నారు. నర్సంపేట బస్‌స్టేషన్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరారు. నెక్కొండ బస్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నెక్కొండ నర్సంపేట మధ్య జల్లి గ్రామంలో ఉన్న ఆర్టీసీ స్థలంలో బస్ స్టేషన్ నిర్మించాలని కోరారు. మహబూబబాద్ లో ఆరు కొత్త రూట్ లలో బస్సులు వేయాలని ఎమ్మెల్యే మురళీ నాయక్ కోరారు. కొత్త రూట్లలో బస్సులు వేయాలని కోరారు, వర్ధన్నపేటలో ఉన్న ఆర్టీసీ స్థలంలో డ్రైవర్ శిక్షణ స్కూల్ ఏర్పాటు చేయాలని కొత్త రూట్లల్లో బస్సులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నాగరాజు కోరారు. పాలకుర్తి బస్‌స్టేషన్ అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సూచించారు.



