Monday, November 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనమ్మిన ఆశయం కోసం జీవితాన్ని ధారపోసిన సాయిబాబా

నమ్మిన ఆశయం కోసం జీవితాన్ని ధారపోసిన సాయిబాబా

- Advertisement -

ప్రొఫెసర్‌ సాయిబాబా స్మారకోపన్యాసంలో పలువురు వక్తలు

నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
తాను నమ్మిన ఆశయం కోసం ప్రొఫెసర్‌ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని పలువురు వక్తలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ప్రొఫెసర్‌ సాయిబాబా స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అసమ్మతి గళాలు-సాహిత్యం, ప్రజాస్వామ్య పరివర్తనలు రచయితల పాత్ర’ అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అధ్యక్షతన నిర్వహించి మాట్లాడారు. మానవీయ, మంచి సమాజం రావాలని తన జీవిత కాలమంతా సాయిబాబా పోరాడారని, ఈ విషయంపై సమాజంలో చర్చ జరగవలసి ఉందన్నారు. 10 ఏండ్ల పాటు జైలులో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబా అధైర్య పడలేదని తెలిపారు. ఉపా చట్టం కింద సాయిబాబాను జీవిత శిక్ష వేసి జైలులో ఉంచిన న్యాయస్థానమే అంతిమంగా నిర్దోషి అని తేల్చిందన్నారు. పదేండ్ల జైలు జీవితంలో ఆయన కోల్పోయిన ఆరోగ్యానికి ఎవరు బాధ్యులని సమాజం అడగవలసి ఉండేదన్నారు. జైలు నుంచి బయటకొచ్చాక సమాజానికి చాలా సేవ చేయవలసిన దశలో సాయిబాబా మన మధ్య లేకపోవడం విషాదకరమని అన్నారు.

పూర్వ సంపాదకులు రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. సాయిబాబా తన జీవితమంతా పోరాడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. 90 శాతం వైకల్యం ఉన్న వ్యక్తితో ఏ ప్రమాదం లేదంటే, ఆయన మెదడే చాలా ప్రమాదకరమని ఓ జడ్జి దారుణంగా మాట్లాడారన్నారు. అమిత్‌ షా వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిజం అంతం చేస్తామని ప్రకటించారని, సమాజంలో అసమానతలు రూపుమాపకుండా, సమస్యలు వరిష్కరించకుండా మావోయిజం అంతం చేయలేరన్నారు. ఆర్ధికవేత్త డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కవి, రచయిత్రి మీనాకంద స్వామి మాట్లాడుతూ.. క్యాపిటలిజంతో ప్రజాస్వామ్యం బలహీన పడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పేదల అవసరాలను మరిచి, దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో సాయిబాబా మెమోరియల్‌ కమిటీ సభ్యులు రాందేవ్‌, సాయిబాబా కూతురు మంజీర, కాత్యాయని విద్మేహే తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -