– మానవహారంగా నిలిచిన చిన్నారులు
– మరిన్ని చెరువుల అభివృద్ధి : హైడ్రా కమిషనర్ రంగనాథ్
– ఏడాది పూర్తి చేసుకున్న హైడ్రా
– నాలుగు నెలల్లో చెరువు నిర్మాణం ఓ చరిత్ర : హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి
నవతెలంగాణ-అంబర్‌పేట
హైదరాబాద్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట పునరుద్ధరణ నేపథ్యంలో కుంట వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. చిన్నారుల చిరునవ్వులతో సందడి నెలకొంది. ఆక్రమణల కబంధ హస్తాలను తెంచి.. చెరువుగా మలిచిన తీరును చూసి చిన్నారులు మురిసిపోయారు. చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండి.. ముళ్ల పొదలతో భయంకరంగా ఉన్న పరిసరాలు ప్రస్తుతం ఆహ్లాదకరంగా మారడంతో ముచ్చట పడ్డారు. ”బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రాకు ధన్యవాదాలు.. చెరువులను రక్షించి.. పర్యావరణాన్ని కాపా డి.. మా భవిష్యత్‌కు బాటలు వేస్తున్న హైడ్రాకు కృతజ్ఞ తలు.. నగర రూపురేఖలు మార్చుతున్న హైడ్రాకు అండగా ఉంటాం” అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు మానవహారంగా చెరువు చుట్టూ నిలబడగా.. స్థానికులు పెద్దఎత్తున వారిని అనుసరించారు. చెరువులను కాపాడుతామని.. ప్రకృతిని పరిరక్షిస్తామని చిన్నారులు ప్రతిజ్ఞ చేశారు. ఇలా బతుకమ్మ కుంట వద్ద శుక్రవారం జరిగిన కార్యక్రమాలు మరిన్ని చెరువుల అభివృద్ధికి ప్రోత్సాహకరంగా మారాయి.
బతుకమ్మ కుంట ఓ నమూనా : హైడ్రా కమిషనర్ రంగనాథ్
భవిష్యత్‌లో వందలాది చెరువుల పునరుద్ధరణకు అంబర్‌పేట బతుకమ్మ కుంట ఓ నమూనా అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పర్యావరణ హితమైన నగరాన్ని తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి బతుకమ్మకుంట నాందీ అని చెప్పారు. హైడ్రా తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బతుకమ్మ కుంట వద్ద మానవహారం నిర్వహించారు. వివిధ పాఠశాలల నిర్వాహకులు, స్థానికులతో కలిసి హైడ్రా కమిషనర్ చిన్నారులనుద్దేశించి ప్రసంగించారు. పరిశుభ్రమైన చెరువులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, ఈ క్రమంలో బతుకమ్మకుంటను బతికించుకున్నామని చెప్పారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, హెచ్‌ఎండీఏ ఇలా అన్ని శాఖల సహకారంతో చెరువు నిర్మాణం జరిగిందన్నారు. ఇక్కడ చెరువును పునరుద్ధరించే క్రమంలో తవ్వకాలు జరిపినప్పుడు గంగమ్మ ఉబికి వస్తే.. హర్షించాల్సింది పోయి.. కొంతమంది తాగునీటి పైపులైన్లు పగిలాయంటూ బురదజల్లే ప్రయత్నాలు చేశారన్నారు. ఏడాదిలో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పరిరక్షించామన్నారు. హైడ్రా పరిరక్షించిన స్థలాల విలువ దాదాపు రూ.30వేల కోట్లపైనే ఉంటుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకనుగుణంగానే హైడ్రా పని చేస్తోందన్నారు. ఆక్రమణల వెనుక చాలా పెద్దవారు ఉన్నారని, వాళ్లు తప్పించుకోవడానికి పేదలను బుల్డోజర్ల ముందు పెడుతున్నారని తెలిపారు. కోట్ల రూపాయల స్థలాన్ని పేదవాళ్లు ఆక్రమిస్తారా? అని ప్రశ్నించారు. నగరం గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరని, వాటి అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. బతుకమ్మ కుంట అభివృద్ధిని ముఖ్యమంత్రి చాలా దగ్గరగా పరిశీలించారన్నారు. సెప్టెంబరు 21న ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు.
ఇది ఓ రికార్డు : హైదరాబాద్ కలెక్టర్
తాను జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఈ పరిసరాలు డంపింగ్ యార్డుగా ఉండేవని, ఇప్పుడు ఆహ్లాదకరమైన చెరువు కనిపిస్తోందని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. కేవలం నాలుగు నెలల్లో చెరువును రూపొందించడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలుస్తుందన్నారు. నాలాలను కూడా పునరుద్ధరించి నగర కీర్తిని చాటాలని కోరారు. భావితరాలకు చెరువులను సజీవంగా అందించడానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
బాల్యం గుర్తొస్తోంది: వీహెచ్
బతుకమ్మ కుంట చెరువును చూస్తే తన బాల్యం గుర్తుకొస్తోందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. హైడ్రా కమిషనర్ మంచి లక్ష్యంతో పని చేస్తున్నారని, అందరం సహకరించాలని కోరారు. 1963 నుంచి ఈ చెరువును పునరుద్ధరించాలని తాను ప్రయత్నించిన విషయాన్ని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, హైడ్రా అధికారులు అశోక్, పాపయ్య, సుదర్శన్, తిరుమల్, శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షులు శంభుల ఉషా శ్రీకాంత్‌గౌడ్, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, ఆర్.లక్ష్మణ్ యాదవ్, నారాయణస్వామి, హైడ్రా సిబ్బంది పాల్గొన్నారు.
బతుకమ్మకుంట వద్ద సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES