ట్రంప్ సామ్రాజ్యవాదంపై పోరాడాలి
యూరప్‌లో కదం తొక్కిన వామపక్షాలు
బ్రస్సెల్స్‌లో వీధుల్లోకి వేలాది మంది
యూఎస్‌కు వ్యతిరేకంగా నిరసనలు
క్యూబాకు మద్దతుగా ప్రదర్శనలు
బ్రస్సెల్స్ : క్యూబాపై అమెరికా విధించిన ఆంక్షలు, చమురు నిషేధానికి వ్యతిరేకంగా యూరప్‌లో లెఫ్ట్, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వందలాది మంది క్యూబాకు మద్దతుగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఐక్యతా ర్యాలీలు నిర్వహించారు. వేలాది మంది క్యూబాకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. లాటిన్ అమెరికా ఐక్యతా సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు, వామపక్ష నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. వారు అమెరికా విధించిన ఆంక్షలు (అక్రమ బ్లాకేడ్) ఎత్తివేయాలన్నారు. క్యూబాకు మానవతా సహాయం, చమురు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బెల్జియం ప్రభుత్వం క్యూబాలోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయకూడదని చెప్పారు. ఈ నెల 7న సెంట్రల్ బ్రస్సెల్స్‌లో తొలిసారిగా నిరసన జరిగింది.
అనంతరం 8న యూరోపియన్ కమిషన్ భవనంపై ‘హ్యాండ్స్ ఆఫ్ క్యూబా!’ అనే సందేశాన్ని ప్రొజెక్ట్ చేశారు. ”యూరప్, బెల్జియం ఇంకా మౌనంగా ఉండొద్దు. ట్రంప్ సామ్రాజ్యవాదానికి ఎదురు నిలబడి, క్యూబా ప్రజలకు సహాయం చేయాల్సిన సమయం వచ్చింది” అని క్యూబనిస్మో తెలిపింది. డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలు క్యూబాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయని నిరసనకారులు చెప్పారు. ప్రత్యేకంగా చమురు నిషేధం కారణంగా క్యూబా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందనీ, ఆస్పత్రులు, అంబులెన్స్ సేవలు, ఆహార పంపిణీ వంటి ముఖ్యమైన సేవలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
”1959 విప్లవం తర్వాత క్యూబా తన వనరులను ప్రజల కోసం వినియోగించింది. ఉచిత విద్య, వైద్యం వంటి ప్రజా సేవలను అందించింది. ఇదే ‘సామ్రాజ్య వాదానికి’ మింగుడుపడని అంశం” అని క్యూబనిస్మో వివరించింది. లాటిన్ అమెరికాలోని ప్రగతిశీల ప్రభుత్వాలపై అమెరికా ఒత్తిడి తెస్తున్నప్పటికీ.. యూరప్ ప్రభుత్వాలు మౌనం వహిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌పై జరిగిన చర్యలను, అలాగే క్యూబాపై ఆంక్షలు కఠినతరం చేయడాన్ని యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఖండించలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో అమె రికా చర్యలకు వ్యతిరేకంగా లెఫ్ట్, కార్మిక సంఘాలు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
వెనిజులాకు మద్దతుగా ఇటీవల ఇటలీ లోనూ సంఘీభావ నిరసనలు, ప్రదర్శనలు, కార్యక్రమాలు జరిగాయి. ఈనెల 8న జాతీయ అసెంబ్లీని నిర్వహించారు. పొటేరే అల్ పోపోలో అనే వామపక్ష పార్టీ తదుపరి నెలలో వెనిజులా, క్యూబా, ఇతర లాటిన్ అమెరికా దేశాలకు సంఘీభావంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించింది. వెనిజులా, మెక్సికన్, క్యూబా వంటి దేశాల విషయంలో ‘ఆర్థిక ఉగ్రవాదానికి’ పాల్పడుతున్నాడని ఇప్పటికే ఆరోపించింది. క్యూబా వల్ల యూఎస్ కు ఎలాంటి ప్రమాదమూ లేదనీ, ఈ ప్రపంచాన్ని ప్రమాదంగా మారుస్తున్న ఒకే ఒక్క దేశం యూఎస్ మాత్రమేనని విమర్శించింది. తన మిలిటరీ, ఆర్థిక, రాజకీయ జోక్యం వంటి చర్యలతో ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశ ప్రజల సార్వ భౌమాధికారం పై తరచూ దాడికి దిగుతున్నదని ఆరోపించింది.



