సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నివాళులర్పించిన పోతినేని సుదర్శన్, బి.వెంకట్, నున్నా
నవతెలంగాణ-ఖమ్మం రూరల్/గాంధీచౌక్
ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పొన్నగంటి సంగయ్య(70) మృతి ప్రజా, కార్మిక ఉద్యమాలకు తీరని లోటని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సంగయ్య మంగళవారం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న జాన్‌వెస్లీ బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. పార్టీలో సంగయ్య సేవలను కొనియాడారు. వ్యవసాయ కార్మిక ఉద్యమాలకు నాయకత్వం వహించారని, కూలీ రేట్ల పెంపు పోరాటాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఎన్ని కష్టాలు వచ్చినా చివరి శ్వాస వరకూ పార్టీ జెండాను వీడని నాయకుడని అన్నారు. ఆయన మరణం కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి కార్మిక, ప్రజాతంత్ర పోరాటాలకు తీరని లోటన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం సంగయ్య మృతదేహాన్ని ఖమ్మం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయానికి ప్రజల సందర్శనార్థం తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఊరడి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సంతాప సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియాడారు.
ఆయన అకాల మరణానికి పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ప్రగాడ సంతాపాన్ని, తన కుటుంబానికి సానుభూతిని తెలిపారు. సంగయ్య మొదటి నుండి ఖమ్మం రూరల్ మండలం పార్టీ నిర్మాణంలో కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం డివిజన్ ఆఫీసు కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రధానంగా వ్యవసాయ కార్మికుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపైన రాజీలేని పోరాటాలు జరిపారని తెలిపారు. నివాళులర్పించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్, మాచర్ల భారతి, కళ్యాణ వెంకటేశ్వరరావు, బండి రమేష్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు బుగ్గవీటి సరళ, యం.సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, భూక్య వీరభద్రం, మాదినేని రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, మడిపల్లి గోపాల్ రావు, జిల్లా కమిటీ సభ్యులు నందిపాటి మనోహర్, బండారు రమేష్, దొంగల తిరుపతిరావు, విష్ణువర్ధన్, తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, బషీర్, మెరుగు రమణ తదితరులు పాల్గొన్నారు.
సంగయ్య మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



