దేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఆ సంస్థ తీరు : తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మూడో మహాసభలో వక్తలు
నవతెలంగాణ-ముషీరాబాద్
దేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ పనిచేస్తోందని, అది దేశానికి ప్రమాదకరమని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మూడో మహాసభ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడే వారిని రాజ్యం హింసకు గురిచేస్తున్నదని తెలిపారు. ప్రశ్నించే వారి గొంతులు నొక్కి జైల్లో బంధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
ఆహ్వాన సంఘం అధ్యక్షులు డి.నరసింహారెడ్డి మాట్లాడుతూ.. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నదని, ఆర్థిక అసమానతలు పెరిగిపోయాయని తెలిపారు. మెజారిటీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని వాపోయారు. ప్రజాస్వామ్య రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సింది పోయి వాటిని విస్మరించి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని అన్నారు. జస్టిస్ కొల్సే పాటిల్ మాట్లాడుతూ.. సంఫ్‌ు పరివార్ మానవత్వాన్ని తుంగలో తొక్కుతోందన్నారు. ఓ వైపు మావోయిస్టులను చంపుతూ.. మరోవైపు మైనార్టీలకు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర లేనివారు వందేమాతరం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ.. మావోయిస్టులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో నేరాలకు పాల్పడిన మోడీ, అమిత్‌షాను ప్రాసిక్యూషన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన హౌదాలలో కొనసాగే నైతిక హక్కు వారు కోల్పోయారన్నారు. మావోయిస్టులను తీవ్రవాదులతో సమానంగా చూడటం సరికాదన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. సంఫ్‌ు పరివార్‌కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ మనోరంజన్ మహంతి మాట్లాడుతూ.. ఆదివాసులు అనాదిగా స్వరాజ్యం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడారన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను చంపడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. ఎన్‌కౌంటర్లు అన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సరోజిగిరి, ప్రొఫెసర్ కె.నరసింహరెడ్డి, సామాజిక కార్యకర్త బేలా బాటియా, పౌరహక్కుల సంఘం నాయకులు కె.రవి, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, నర్ర పురుషోత్తం, ప్రొఫెసర్ సరోజ్ గిరి, అడ్వకేట్ రఘునాథ్, ఏ.లింగన్న తదితరులు ప్రసంగించారు.



