నవతెలంగాణ – బోనకల్
రాబోయే వేసవికాలం దృష్ట్యా ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామంలో ఎలాంటి మంచినీటి సమస్య తలెత్తకుండా బోనకల్ గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి ఉపసర్పంచ్ బానోత్ కొండ మంగళవారం ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా బోర్లు, మోటార్లు, పైప్‌లైన్లను పరిశీలించి మరమ్మత్తులు చేయిస్తున్నారు. నీటి ట్యాంకుల శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా గ్రామంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను బానోత్ జ్యోతి కొండ ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎర్ర శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి కోలా రాజేశ్వరి పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రామాభివృద్ధి, ప్రజల సౌకర్యమే మా లక్ష్యం అని తెలిపారు. బోనకల్ – ఖమ్మం బస్టాండ్ సెంటర్ నుంచి స్థానిక షిరిడి సాయిబాబా మందిరం వరకు మంచినీటి సరఫరా అందడం లేదని, అటువైపు కూడా మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు మరమ్మత్తులు చేస్తున్నట్లు వారు తెలిపారు. గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చేయాలనేదే తమ లక్ష్యం అన్నారు. అందుకు అనుకూలంగా ముందస్తు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. తొలుత గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు తమ తమ వార్డులలో ఉన్న సమస్యలను ప్రధానంగా మంచినీటి సమస్యపై చర్చించారు. తమ తమ వార్డులలో ఉన్న వివిధ రకాల సమస్యలను పాలకవర్గం సమావేశంలో సర్పంచ్ దృష్టికి పాలకవర్గ సభ్యులు పలు సమస్యలను తీసుకువచ్చారు. అందుకు అనుకూలంగానే వార్డుల వారీగా గ్రామంలో ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామ ప్రజల సమస్యల పరిష్కారమే తప్ప తమకు రాజకీయాలు అవసరం లేదని వారు స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు ఎవరైనా గ్రామ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి తమ పరిధిలో పరిష్కారం చేస్తామని వారు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ బానోతు జ్యోతి, ఉప సర్పంచ్ బానోత్ కొండ, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ ఎర్ర శ్రీనివాసరావు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు మరీదు శేషు, అంతోటి శ్రీను, అంతోటి సునీత, షేక్ నాగుల్ మీరా, ఉప్పర శ్రీను, జరుపుల లావణ్య, షేక్ నౌషిన్, తదితరులు పాల్గొన్నారు.



