– 27 పంచాయితీలకు 20 మంది మాత్రమే
– ప్రమాణస్వీకారాలకే సంకట పరిస్థితి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వానికి ఎన్నికల పట్ల ఉన్న ఉత్సాహం పాలనా వ్యవస్థ బలోపేతం పట్ల మాత్రం కనిపించడం లేదు. రాష్ట్రపతి నుంచి సర్పంచ్ వరకు ఎన్నికలు ఆఘమేఘాలపై నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. కానీ అదే ఉత్సాహం క్షేత్రస్థాయి కీలకమైన ప్రభుత్వ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం కరువవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ నెల 22 వ తేదీ (సోమవారం) నిర్వహించనున్నారు.నిబంధనల ప్రకారం ఆయా పంచాయితీల కార్యదర్శులే సర్పంచ్ లతో ప్రమాణస్వీకారం చేయించాలి.
అయితే అశ్వారావుపేట మండలంలో ఈ నిబంధనే ఇప్పుడు సమస్యగా మారింది. 27 పంచాయితీలకు 20 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు.మండలంలో మొత్తం 27 పంచాయితీలు ఉండగా,అందుబాటులో ఉన్న కార్యదర్శులు మాత్రం 20 మంది మాత్రమే. ఇందులో మరో 7 మంది కార్యదర్శులు ఇతర మండలాల్లో డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్నారు.ఫలితంగా కొందరు కార్యదర్శులు రెండు పంచాయితీల బాధ్యతలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకేసారి ఇద్దరు సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం ఎలా?
రెండు పంచాయితీలు చూసే కార్యదర్శి ఒకే సమయంలో ఇద్దరు సర్పంచ్ లతో ప్రమాణస్వీకారం చేయించడం సాధ్యమా? అంతేకాదు, సర్పంచ్ లు తమ ఆచారం, సంప్రదాయం, ముహూర్తం ప్రకారం ప్రమాణస్వీకారం చేయించుకోవాలని భావిస్తున్న వేళ ఒకే సమయానికి రెండు చోట్ల ఉండటం కార్యదర్శికి అసాధ్యమైన పనిగా మారింది.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం
ఏళ్ల తరబడి ఖాళీలు గా ఉన్న కార్యదర్శి పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల,నేడు ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రమాణస్వీకారాలకే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.ఇది పాలనా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా బయట పెడుతోంది. ఈ అంశంపై ఎంపీడీఓ,మండల ఎన్నికల అధికారి అప్పారావు ను వివరణ కోరగా.. “కార్యదర్శులు లేని పంచాయితీల్లో ప్రమాణ స్వీకారానికి అదే స్థాయి ప్రత్యామ్నాయ సిబ్బందిని కేటాయిస్తున్నాం”అని తెలిపారు.
ప్రశ్న ఏంటంటే
ఎన్నికలు నిర్వహించడంలో చూపించే చురుకుదనం, పాలనా సిబ్బంది నియామకాల్లో ఎందుకు కనిపించదు? ప్రజాస్వామ్యానికి బలం ప్రజాప్రతినిధులే కాదు వారితో కలిసి పనిచేసే పాలనా వ్యవస్థ కూడా అనే సత్యాన్ని ప్రభుత్వం ఎప్పుడు గుర్తిస్తుందో?



