నవతెలంగాణ – కాటారం
స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి కేవలం పదిహేను రోజులు మాత్రమే అయింది. ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు సర్పంచిగా అధికారం చేపట్టి వారం రోజులే అవుతుంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఆధారంగా పలు చోట్ల మహిళా రిజర్వేషన్ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలు గెలుపొంది,తమ సత్తా చాటారు. రాజకీయాల్లో పురుషులకు ధీటుగా స్త్రీలు కూడా పాలన చేపడతారని నిరూపించారు. తాజాగా వారం వ్యవధిలో సర్పంచిగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు.ఇంతలోనే సతుల అధికారం పై పతులు పెత్తనం చెలాయిస్తువుండడంతో ప్రజల్లో తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కాటారం మండలం లోని అధికార పార్టీకి చెందిన ఓ గ్రామ పంచాయతీ సర్పంచి పతి పెత్తనం చెలాయిస్తున్నాడట.
తనకు ఓటు వేయలేదనే అక్కస్సుతో గ్రామానికి చెందిన పలువురిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడట. అంతేకాకుండా తానే సర్పంచ్ అయినట్టు గ్రామ పంచాయతీ సిబ్బంది పై పెత్తనం కూడా చెలాయిస్తున్నాడట.టోల్గెట్ లోని మేనజర్ కు పిర్యాదు చేసి టోల్గెట్ కాంట్రాక్టు స్వీవర్ గా పనిచేస్తున్న మహిళను పనిలో నుండి తీయించడనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అంగన్వాడీ ఆయ పై కూడా సెక్టార్ సూపర్ వైజర్ కు పిర్యాదు చేశాడనే ఆరోపణలు వినిపించడంతో సర్పంచి భర్త పెత్తనం పై మండలంలో తీవ్ర చర్చనియంశంగా మారింది. దీంతో మండల ప్రజలు అధికార పార్టీ అధికారం లోకి వచ్చిన వారం రోజులకే అహంకార ధోరణి కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.



