Monday, September 22, 2025
E-PAPER
Homeఆటలుసాత్విక్‌ జోడీ రన్నరప్‌

సాత్విక్‌ జోడీ రన్నరప్‌

- Advertisement -

వరల్డ్‌ నం.1 చేతిలో ఓటమి
చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750

షాంఘై (చైనా) : భారత బ్యాడ్మింటన్‌ స్టార్స్‌ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడి, చిరాగ్‌ శెట్టి జోడీ వరుసగా రెండోసారి ఓ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం షాంఘైలోని షెంజెన్‌ ఎరినాలో జరిగిన చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 పురుషుల డబుల్స్‌ ఫైనల్లో వరల్డ్‌ నం.7 సాత్విక్‌, చిరాగ్‌లు పరాజయం పాలయ్యారు. వరల్డ్‌ నం.1 దక్షిణ కొరియా షట్లర్లు కిమ్‌, సియోలు వరుస గేముల్లోనే గెలుపొందారు. 45 నిమిషాల్లో ముగిసిన టైటిల్‌ పోరులో 21-19, 21-15తో కిమ్‌, సియోలు విజయం సాధించి టైటిల్‌ దక్కించుకున్నారు. గత వారం హాంగ్‌కాంగ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌లు తాజాగా చైనా మాస్టర్స్‌లోనూ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. మహిళల సింగిల్స్‌లో యంగ్‌, మెన్స్‌ సింగిల్స్‌లో వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ చాంపియన్లుగా నిలిచారు.

పోరాడినా..!
సాత్విక్‌, చిరాగ్‌లు ఈ ఏడాది ఆరంభంలో ఆశించిన ప్రదర్శన చేయలేదు. కొన్ని నెలల కిందట ర్యాంకింగ్స్‌లోనూ వరల్డ్‌ నం.27కు పడిపోయారు. గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో పుంజుకున్న సాత్విక్‌, చిరాగ్‌లు.. అదే జోరు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌, చైనా మాస్టర్స్‌లో మెప్పించారు. ప్రపంచ మేటీ షట్లర్లతో సమవుజ్జీలుగా నిలిచే ప్రదర్శన కనబరుస్తున్నారు. వరుస గేముల్లో ఓడినా.. సాత్విక్‌, చిరాగ్‌ ఆటలో గణనీయమైన మార్పు కనిపించింది. సాత్విక్‌ కచ్చితమైన స్మాష్‌లు కొడుతుండగా.. చిరాగ్‌ డిఫెన్స్‌లో మునుపటి ఫామ్‌ కనబరుస్తున్నాడు. ఆదివారం నాటి ఫైనల్లో ఈ మెరుగుదల కనిపించినా.. వరల్డ్‌ నం.1 జోడీ మరింత మెరుగైన ఆటతీరు కనబరిచింది. తొలి గేమ్‌లో 11-7తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన సాత్విక్‌, చిరాగ్‌ ఆ తర్వాత పట్టు కోల్పోయారు. 15-15తో స్కోరు సమం చేసిన కిమ్‌, సియోలు ఒత్తిడిలో పైచేయి సాధించారు. 19-19తో స్కోరు సమం కాగా.. వరుసగా రెండు పాయింట్లు సాధించిన కిమ్‌, సియో తొలి గేమ్‌ ఖాతాలో వేసుకున్నారు. రెండో గేమ్‌లో ప్రథమార్థం నువ్వా నేనా అన్నట్టు సాగింది. 11-10తో కిమ్‌, సియోలు పైచేయి సాధించారు. కానీ విరామం తర్వాత సాత్విక్‌, చిరాగ్‌లు ఆశించిన వేగంతో పుంజుకోలేదు. దీంతో 21-15తో కిమ్‌, సియోలు రెండో గేమ్‌తో పాటు టైటిల్‌ను ఎగరేసుకుపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -