Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయాన్ని కాపాడండి… దేశాన్ని రక్షించండి

వ్యవసాయాన్ని కాపాడండి… దేశాన్ని రక్షించండి

- Advertisement -

ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షకార్యదర్శులు వేములపల్లి వెంకట్రామయ్య, ఆశిష్‌ మిట్టల్‌

నవతెలంగాణ -ఖమ్మం
వ్యవసాయాన్ని కాపాడటంతోపాటు దేశాన్ని రక్షించాలని ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్‌ మిట్టల్‌, జాతీయ నాయకులు రబీందర్‌ సింగ్‌ పాటియాలా అన్నారు. ఈనెల 25, 26న రెండు రోజులు పాటు ఖమ్మంలో జరిగిన అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) కేంద్ర కార్యనిర్వహకవర్గ సమావేశం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సెప్టెంబరులో ఖమ్మంలో నిర్వహించనున్న ఏఐకేఎంఎస్‌ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చినట్టు చెప్పారు. జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో తీసుకువస్తున్న వీబీజీఆర్‌ఏఎం-జీ పథకాన్ని కేంద్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించి తీర్మానం చేసి ఆమోదించిందన్నారు. అలాగే, కొత్త విత్తన బిల్లు 2025 హానికరమైనదని, జీఎం విత్తనాలతో సహా, పరీక్షించని విదేశీ విత్తనాల ఉచిత దిగుమతులను అనుమతిస్తుందని తెలిపారు.

బ్లాక్‌ మార్కెటింగ్‌పై ఉన్న నిషేధాన్ని తొలగిస్తుందని వివరించారు. ప్రపంచ విత్తన మార్కెట్‌లో 90 శాతాన్ని కేవలం 6 ప్రధాన విత్తన కంపెనీలు నియంత్రిస్తున్నాయని, భారతదేశ విత్తన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు అత్యంత ప్రమాదకరమైనవని అన్నారు. మోడీ ప్రభుత్వం, ట్రంప్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని రైతు అనుకూలమైనదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమెరికా ప్రయోజనాల ముందు మోడీ ప్రభుత్వం దాసోహం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయాబీన్‌, మొక్కజొన్న, పత్తి, ఇథనాల్‌, డిస్టిల్డ్‌ డ్రైడ్‌ గ్రెయిన్స్‌, కోడి మాంసం, పాలు, పాల ఉత్పత్తులు, ఆపిల్స్‌తో సహా పండ్లు, ఇతర వస్తువుల ఎగుమతులను విస్తరించడానికి ట్రంప్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో దిగుమతి సుంకాలను సగటున 37 శాతం నుంచి సున్నాకు తగ్గించడం, గతంలో ఉన్న 2.5 శాతంకి బదులుగా 18 శాతం ఎగుమతి సుంకాన్ని విధించడాన్ని ఆమోదించారని ఆరోపించారు.

ఖమ్మంలో భూదాన్‌ భూమిలో ఇండ్లు నిర్మించుకొని పదేండ్లుగా నివాసం ఉంటున్న వారిపై బుల్డోజర్లను పంపి వారి ఇండ్లను నేలమట్టం చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ చర్య చట్ట వ్యతిరేకమని హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులు కూడా రుజువు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలోని పేదల పంపిణీ కోసం నిర్దేశించిన భూదాన భూములను అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలుగా కానీ, వ్యవసాయ భూములుగా కానీ వెంటనే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ ఆక్రమణల నుంచి తమ భూములను, అటవీ సంపదను కాపాడుకోవడానికి గిరిజనులు, ఇతర అటవీ నివాసులు చేస్తున్న పోరాటాలకు బలమైన ఊపునివ్వడానికి అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ 2006), పర్యావరణ, అటవీ భద్రతా చట్టం (ఫిసా)ను సక్రమంగా అమలు చేసేలా ‘వ్యవసాయాన్ని కాపాడండి, దేశాన్ని రక్షించండి’ అనే నినాదంతో పోరాటాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్టు తెలిపారు.

దీనిపై 2026 సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న 4వ అఖిల భారత మహాసభలో చర్చలు జరపనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సుశాంత్‌ ఝా(పశ్చిమ బెంగాల్‌), రాంబిక్స్‌ (బీహార్‌), నిర్భయ సింగ్‌ (పంజాబ్‌), బాలచంద్ర సడంగి (ఒరిస్సా), దుర్గాప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌) జితేందర్‌సింగ్‌ (పంజాబ్‌), హీరాలాల్‌ (ఉత్తరప్రదేశ్‌), చిట్టిపాటి వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రదేశ్‌), వి.కోటేశ్వరరావు (తెలంగాణ), ధరంపాల్‌ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌), శంభు ప్రసాద్‌ (బీహార్‌), తెలంగాణ అధ్యక్షకార్యదర్శులు ఎం.బిక్షపతి, మండల వెంకన్న, ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బజ్జూరి వెంకట్రామిరెడ్డి, వై ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -