Saturday, October 11, 2025
E-PAPER
Homeబీజినెస్ప్రయివేటు వ్యక్తికి ఎస్‌బీఐ ఎండి పదవి..!

ప్రయివేటు వ్యక్తికి ఎస్‌బీఐ ఎండి పదవి..!

- Advertisement -

ఇతర పిఎస్‌బిల్లో ఇడిల నియామకాలు
కేంద్రం మార్గదర్శకాల జారీ
భగ్గుమన్న బ్యాంకింగ్‌ సంఘాలు


న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో కీలక పదవుల్లో ప్రయివేటు వ్యక్తుల నియామకానికి మోడీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ)లోనూ ఉన్నత స్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండి) హోదాలోనూ ప్రయివేటు వ్యక్తులను తీసుకోనుంది. అదే విధంగా ఇతర పిఎస్‌బిల్లోనూ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇడి) పదవులను కూడా ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టనుంది. పిఎస్‌యుల్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పదవులను ప్రయివేటు సెక్టార్‌లోని వారికి కట్టబెట్టేందుకు వీలుగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్సీయల్‌ సర్వీసెస్‌ (డిఎఫ్‌ఎస్‌)లోని అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది క్యాబినెట్‌ (ఎసిసి) మార్గదర్శకాలను జారీ చేసింది. పలు నియామకాల కోసం కేంద్రం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. దీనిపై బ్యాంకింగ్‌ యూనియన్లు భగ్గుమన్నాయి.

ఎసిసి సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. ఎస్‌బిఐ ఎండి పదవీ కోసం ప్రయివేటు సెక్టార్‌ అభ్యర్థులకు కనీసం 21 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం, అందులో 15 సంవత్సరాలు బ్యాంకింగ్‌లో, 2 సంవత్సరాలు బ్యాంక్‌ బోర్డు స్థాయిలో పని చేసి ఉండాలి. తదుపరి ఖాళీలు అంతర్గత పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకు అభ్యర్థులచే భర్తీ చేయబడతాయి. ఇప్పటి వరకు ఎస్‌బిఐలో ఎండి పదవీని ఆ సంస్థలోని అర్హులైన అంతర్గత అధికారులతో భర్తీ చేసేవారు. ఇతర పిఎస్‌బిల్లో ఇడి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల అనుభవం, అందులో 12 సంవత్సరాలు బ్యాంకింగ్‌లో, 3 సంవత్సరాలు బోర్డు కంటే ఒక స్థాయి క్రింద అనుభవం ఉండాలి. ప్రతి బ్యాంకులో ఒక ఇడి పోస్టును ప్రయివేటు లేదా అంతర్గత అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు, ఎస్‌బిఐ సహా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి 11 జాతీయ బ్యాంకుల్లో ఇడి పోస్టులను భర్తీ చేయడానికి కేంద్రం మార్పులు చేసింది. ఈ పోస్టుకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ లేదా జనరల్‌ మేనేజర్‌ స్థాయిలో అనుభవం తప్పనిసరి చేశారు.

చట్టవిరుద్ధం : యూఎఫ్‌బీయూ
ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ పదవులను ప్రయివేటు సెక్టార్‌ వాళ్లకు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ సంస్థల విధానానికి విరుద్దమని తెలిపింది. కీలక పదవులను బయటి వ్యక్తులకు ఇవ్వడమంటే ప్రయివేటీకరణకు సమానమని విమర్శించాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌ 1955, బ్యాంకింగ్‌ కంపెనీస్‌ (అక్విజిషన్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌) యాక్ట్స్‌ 1970 అండ్‌ 1980, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ 1956లో ఎటువంటి సవరణ లేకుండా ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ ఉల్లంఘన అని యుఎఫ్‌బియు విమర్శించింది.

పార్లమెంట్‌లో చర్చ, చట్ట సవరణ లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం చట్ట విరుద్ధమని తెలిపాయి. ఈ విధానం బ్యాంకుల జాతీయీకరణ ఉద్దేశాన్ని దెబ్బతీయడమే కాక, అంతర్గత కెరీర్‌ ఆధారిత వారసత్వ మోడల్‌ను ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం చర్యలు దేశ ఆర్థిక సౌర్వభౌమత్వం, ప్రజా విశ్వాసాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుందని యూనియన్లు హెచ్చరించాయి. గతంలో ఐఎఎస్‌ అధికారులను పిఎస్‌బిల టాప్‌ మేనేజ్‌మెంట్‌లో నియమించిన ప్రయోగం విఫలమైన విషయాన్ని గుర్తు చేసింది. పిఎస్‌బిల్లో ప్రయివేటు వ్యక్తుల నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను తక్షణమే నిలిపివేయాలని యుఎఫ్‌బియు డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -