– జపాన్ సంస్థకు 13 శాతం వాటా అమ్మకం
– డీల్ విలువ రూ.8,889 కోట్లు
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఎస్ బ్యాంక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి ఉన్న వాటాల్లో కొంత మొత్తాన్ని విక్రయించింది. తన 13.18 శాతం వాటాను జపాన్‌కు చెందిన జపనీస్ బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ (ఎస్‌ఎంబీసీ)కి రూ.8,889 కోట్లకు అమ్మేసింది. ఈ ఉపసంహరణ తర్వాత కూడా యెస్ బ్యాంక్‌లో ఎస్బీఐకి 10.8 శాతం వాటా ఉండనుంది. యెస్ బ్యాంక్‌లోని తమ 13.18 శాతం వాటాను విక్రయించామని బుధవారం దిగ్గజ సంస్థ ఎస్‌బిఐ వెల్లడింది. ఇది భారత బ్యాంకింగ్ రంగంలో ఒక ముఖ్యమైన లావాదేవీగా నిలిచింది. యెస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో 2020లో ఆ బ్యాంక్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్‌లో భాగంగా ఎస్బీఐ భారీగా వాటాలను కొనుగోలు చేసి ఆదుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత యెస్ బ్యాంక్ స్థిరత్వానికి మద్దతుగా నిలిచింది. ఎస్బీఐ రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. రూ.21.50 చొప్పున యెస్ బ్యాంక్‌లోని 413.44 కోట్ల షేర్లను ఎస్‌ఎంబీసీకి విక్రయించింది. ఎస్‌ఎంబీసీ జపాన్‌లో రెండో అతిపెద్ద బ్యాంకింగ్‌గా ఉంది. ఇది సుమారు 2 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. ఈ లావాదేవీ రెగ్యులేటరీ, స్టాట్యూటరీ అనుమతులను పొందింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అనుమతులిచ్చాయి. ఈ ప్రకటన వచ్చిన తర్వాత బుధవారం బీఎస్‌ఈలో ఎస్బీఐ షేర్ 3.02 శాతం పెరిగి రూ.856.95 వద్ద ముగిసింది. యెస్ బ్యాంక్ షేర్ 0.71 శాతం లాభంతో రూ.21.15కి చేరింది.
యెస్ బ్యాంక్‌లోని ఎస్బీఐ వాటాల విక్రయం
- Advertisement -
- Advertisement -