– బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు విడుదల చేయాలి
– ఈ నెల 20న చలో హైదరాబాద్ : ఎస్‌ఎఫ్‌ఐ, టీజీఎస్, కేవీపీఎస్
– రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అది చదువుకు ఆటంకంగా మారింది. పండక్కి ఇంటికి పోయిన విద్యార్థులను యాజమాన్యాలు గేటు దగ్గరే నిలబెడుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వమేమో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. చదువే మనిషికి జీవమంటూ ఉపన్యాసాలు ఇచ్చే ప్రభుత్వ పెద్దలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యకు ఖర్చు పెట్టటానికి డబ్బులు లేవంటూ సాకులు చూపటం భావ్యమా?. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్షం తగదు’ అంటూ ఎస్‌ఎఫ్‌ఐ, టీజీఎస్, కేవీపీఎస్ సంఘాల నేతలు నిలదీశారు. బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు రూ. 180 కోట్లు విడుదల చేయకుండా 30వేల మంది విద్యార్థులను రోడ్లపై నిలబెట్టిన సర్కార్ నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం (టీజీఎస్) ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రజినీకాంత్, టి నాగరాజు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు, డీవైఎప్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేశ్, ఎ వెంకటేశ్, టీజీఎస్ అధ్యక్షులు ఎం ధర్మానాయక్‌తో పాటు దళిత, గిరిజన, విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడారు.
దళిత, గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదనీ, మొద్దు నిద్రలో ఉన్న సర్కార్‌ను లేపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత, గిరిజన, విద్యార్థి, యువజన సంఘాలతో పోరాటాలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడిందని తీర్మానించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు రాష్ట్ర మంత్రులు, దళిత, గిరిజన ఎమ్మెల్యేలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో వినతి పత్రాలు అందజేయాలనీ, 18 నుంచి 20 వరకు బాధిత పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి దళిత, గిరిజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలనీ, అప్పటికీ బకాయిలు విడుదల చేయకపోతే.. 20న విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాదులో మహా ధర్నా నిర్వహిస్తామని వారు ప్రకటించారు.
కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర నాయకులు ఉదరు కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్, జార్జి రెడ్డి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు, సుమంత్, ఏఐడీఎస్‌ఓ రాష్ట్ర నాయకులు నితీష్, నాగరాజు, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బానోత్ హుస్సేన్ నాయక్, రాజు రాథోడ్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు విజయకుమార్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్, ఉస్మానియా గిరిజన విద్యార్థి జేఏసీ నాయకులు కరాటే రాజు, గిరిజన విద్యార్థి సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారా, షెడ్యూల్ ట్రైబ్ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు రవీంద్ర నాయక్, ప్రదేశ్ ఎరుకల హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రఘు, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, జాగృతి రాష్ట్ర నాయకులు కళ్యాణ్ నాయక్, కేవీపీఎస్ నాయకులు కృపా సాగర్, డీివైఎఫ్‌ఐ నగర నాయకులు జావేద్, ప్రశాంత్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES