ఆధునికంగా సమాజం ముందుకు పోతున్నప్పటికీ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళలు ప్రగతి ఆశించిన స్థాయిలో లేదు. ఐక్యరాజ్యసమితికి లింగ సమానత్వం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు, బాలికలు కీలక పాత్ర పోషించడానికి అంతర్జాతీయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 11న ఏర్పాటు చేయాలని 2015న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది. శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలలో
బాలికలు, మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఈ రోజు గుర్తుచేస్తుంది.
చారిత్రకంగా భారతదేశంలో ఆవిష్కరణలు, డిస్కవరీ, పేటెంట్ వంటి శాస్త్రీయ గుర్తింపుల విషయంలో మహిళల పట్ల వ్యవస్థాగత వివక్షత ధోరణి కనపడుతుంది. ఇది దళిత, బహుజనుల ప్రతిభలో కూడా స్పష్టమవుతుంది. పురుషాధిక్యత, కులాధిక్యతనే దీనికి ప్రధాన కారణం. శాస్త్రీయ విజయాల పరంగా చూస్తే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో మహిళలు శాస్త్రవేత్తలుగా, వృత్తి నిపుణులుగా రాణించడం అరుదుగా కనబడుతారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అణగారిన వర్గాల మహిళలకు, బాలికలకు విద్యా అవకాశాలు లభించాయి. దీంతో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నారు. అయినా అంతరాలు కనబడుతున్నాయి. ఇప్పటికీ భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్ట్రీం) గ్రాడ్యుయేట్లలో దాదాపు 43శాతం మంది మహిళలు ఉన్నప్పటికీ ఈ రంగంలోని ఉద్యోగాలలో 14 శాతం మాత్రమే ఉన్నారు. ఇదే 2035 నాటికి ఉన్నత విద్యలో 50 శాతం లింగ సమానత్వాన్ని సాధించాలనే నూతన జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యానికి సవాలే.
వంటింటి సైంటిస్ట్‌కి ఏది గుర్తింపు?
వంటిల్లుకు, సైన్స్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. వంటిల్లు కేవలం భోజనం తయారయ్యే స్థలం మాత్రమే కాదు. అది ఒక నిరంతర పరిశీలన, ప్రయోగం, ఫలితాల విశ్లేషణతో కూడిన శాస్త్రీయ ప్రక్రియ. అయినా ఆ వంట చేసే ఇల్లాలికి శాస్త్రవేత్తగా గుర్తింపు లేదు? ఈ ప్రశ్న మన శాస్త్రీయ అవగాహనకు సైతం సవాలే. శాస్త్రం అంటే ఏమిటి? ఒక సమస్యను గుర్తించడం, అందుకు పరిష్కారం కనుగొనడానికి ప్రయోగం చేయడం, ఫలితాలను పరిశీలించడం, అవసరమైతే పద్ధతిని మార్చడం.
ఇది శాస్త్రీయ పద్ధతే
ఎంత మంట? ఎంత నీరు? ఎంత ఉప్పు? ఏ పదార్థం ముందు వేయాలి? ఏది తర్వాత? ఒకసారి విఫలమైతే తదుపరి సారి మార్పు. ఇదంతా వంట గదిలో జరిగే ప్రక్రియ. ఇది శాస్త్రీయ పద్ధతే. వేడి ప్రభావం (థర్మోడైనమిక్స్), రసాయన మార్పులు (కెమిస్ట్రీ), పదార్థాల లక్షణాలు (ఫిజిక్స్), కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్), పోషక విలువలు (న్యూట్రిషన్ సైన్స్) ఇవన్నీ వంటలో సహజంగా జరిగే శాస్త్రీయ ప్రక్రియలే. కానీ ల్యాబ్ కోట్ వేసుకుని, మైక్రోస్కోప్ ముందు నిలబడితేనే శాస్త్రవేత్త అనిపిస్తాడు. అదే పని వంటగదిలో జరిగితే ‘ఇల్లు చూసుకునే పని’గా తక్కువ చేసి చేస్తాం. ఇది నిర్లక్ష్యం శాస్త్రీయం కాదు, సామాజికం. ఇది పితృస్వామ్య దృక్కోణ ఫలితం.
ఆలోచనలు మారాలి
శాస్త్రాన్ని పురుషుల రంగంగా, ఇంటి పనిని మహిళల సహజ కర్తవ్యంగా చూడడం వల్లే ఈ విభజన ఏర్పడింది. ఒక పని విలువ దాని శాస్త్రీయతపై కాక, దాన్ని ఎవరు చేస్తున్నారు అన్నదానిపై ఆధారపెట్టబడింది. చరిత్రను చూస్తే మరింత స్పష్టమవు తుంది. అనేక శాస్త్రీయ ఆవిష్కరణలకు పునాది వంటగదుల్లోనే పడింది. ఫెర్మెంటేషన్, నిల్వ పద్ధతులు, రుచుల సమతుల్యతు.. ఇవన్నీ ఆధునిక ఫుడ్ సైన్స్‌కు మూలాలు. కానీ వాటికి పేర్లు పురుష శాస్త్రవేత్తలవే. ఇల్లాలి వంటను ‘సహజ ప్రతిభ’గా చెప్పడం కూడా ఒక మోసం. దీంతో శిక్షణ, మేధ, అను భవం అన్నింటినీ కనిపించని విగా చేస్తాం. అదే పని ఒక రెస్టారెంట్‌లో జరిగితే ‘చేఫ్’, ఒక ల్యాబ్‌లో జరిగితే ‘సైంటిస్ట్’. ఇంట్లో జరిగితే మాత్రం గుర్తింపే లేదు. నేడు ఆరోగ్యమైన ఇంటి ఆహారం పట్ల స్పృహ పెరుగుతున్న కాలంలో ఆ ఇల్లాలు శాస్త్రీయ వంటకు విలువ నివ్వాలి. వంటగదిని దాటి మహిళలు అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారు. ఇప్పటికీ వంటి గదిలో మహిళలను బంధించడం, కులాలతో ప్రతిభను బంధించడం సైన్స్‌కు అర్హనీయం కాదు. ఈ క్రమంలో బాలికలు, మహిళలు ప్రోత్సహించే పథకాలు, విధానాలు, చట్టాలకన్నా సమాజంలో మనుషుల ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. అప్పుడే ఆశించిన పురోగతి సాధ్యం.
– సంపతి రమేష్,
7989579428
వంటిల్లే సైన్స్ …కానీ, ఇల్లాలికి గుర్తింపేది?
- Advertisement -
- Advertisement -



