Friday, February 27, 2026
E-PAPER
Homeజాతీయంపానిపట్‌ రిఫైనరీలో కాంట్రాక్టు కార్మికుల వెతలు

పానిపట్‌ రిఫైనరీలో కాంట్రాక్టు కార్మికుల వెతలు

- Advertisement -

సుదీర్ఘ పనిగంటలతో శ్రమ దోపిడీ
ఆందోళనలకు దిగిన కార్మికులు
అండగా నిలబడిన సీఐటీయూ

పానిపట్‌ : న్యాయమైన వేతనాలు చెల్లించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరింత మెరుగైన పని పరిస్థితులు కావాలని డిమాండ్‌ చేస్తూ హర్యానాలోని పానిపట్‌లో గల ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) రిఫైనరీలో వందలాది కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రిఫైనరీ ప్రధాన గేటు వద్ద ప్రదర్శన నిర్వహించారు. అయితే ఆ సందర్భంగా చెలరేగిన గొడవ, గందరగోళంలో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

కొంతమంది కార్మికులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఆందోళనతో దేశంలోని అత్యంత కీలకమైన ఇంధన సంస్థల్లో కాంట్రాక్టు కార్మికుల పని పరిస్థితులు ఎంత దయనీయంగా వున్నాయో మరోసారి తెరపైకి వచ్చింది. పానిపట్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో పనిచేసే కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతోంది. రొటీన్‌గా తాము 12గంటల షిఫ్ట్‌లు చేస్తామని, కానీ 8గంటలకే వేతనాలు చెల్లిస్తారని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. ఓవర్‌టైమ్‌ చేసినా దానికి ఎలాంటి చెల్లింపులు వుండవంటున్నారు.

దీర్ఘకాలం పనిగంటలు, వేతనాల చెల్లింపుల్లో జాప్యాలు, ఆన్‌సైట్‌లో పేలవమైన భద్రతా సదుపాయాలు ఇవన్నీ కూడా తమకు దీర్ఘకాల సమస్యలుగా వున్నాయని, వీటికి పరిష్కారాలు కోరుతూ తాము వీధుల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతున్నారు.దేశంలోని ప్రధాన రిఫైనరీల్లో కాంట్రాక్టు కార్మికులు రోజువారీ కార్యకలాపాలకు వెన్నుదన్నుగా వుంటారు. కానీ వారికి పర్మినెంట్‌ సిబ్బందికి వుండే రక్షణ ఏదీ వుండదు, దేశవ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాల్లో చాలా వరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ వుంటుంది. 8గంటలకే తమ షిఫ్ట్‌లను కుదించాలని, ఓవర్‌టైమ్‌ చేయాల్సి వస్తే అందుకు అదనపు చెల్లింపులు జరపాలని, సకాలంలో వేతనాలు చెల్లించాలని, అక్రమంగా, అన్యాయం గా వేతన కోతలు ఆపాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

సీఐటీయూ మద్దతు
తమ న్యాయమైన డిమాండ్ల కోసం పానిపట్‌ రిఫైనరీ కార్మికులు సాగిస్తున్న ఆందోళనలకు, పోరాటాలకు ధృఢంగా, అండగా నిలబడతామని సిఐటియు ప్రకటిం చింది. అత్యంత దారుణమైన శ్రమ దోపిడీని ఎదుర్కొంటున్న ఈ కార్మికులు ఏ మాత్రమూ సురక్షితం కాని పరిస్థితుల్లో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మోడీ ప్రభుత్వం కార్మిక కోడ్‌లను అమలు చేస్తున్న తరుణంలో ఈ ‘పానిపట్‌’ యుద్ధం తలెత్తింది. రోజువారీ విధుల నిర్వహణలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించాలని కార్మిక వర్గం కోరుతున్నా యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించింది.

ఏళ్ళ తరబడి చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులకు చట్టపరంగా లభించే ఎలాంటి రక్షణలు లేదా ఆర్థిక ప్రయోజనాలు లభించడం లేదని పేర్కొంది. వారికి ప్రావిడెంట్‌ ఫండ్‌ వంటి సదుపాయాలు లేవని, అలాగే తాగునీరు, టాయిలెట్లు,విశ్రాంతి గదులు, భద్రతా చర్యలు వంటి కనీసపు సౌకర్యాలు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేసింది. వీటికి తోడు కాంట్రాక్టర్ల బెదిరింపులు కూడా వారిని చిక్కుల్లో పడేస్తాయని తెలిపింది. చట్టబద్ధమైన వారి హక్కులు, సౌకర్యాలు కల్పించడానికి బదులుగా యాజమాన్యం వారిపై అణచివేత చర్యలకు దిగుతోందని విమర్శించింది. సోమవారంనాటి ప్రదర్శన సందర్భంగా పోలీసులు, సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కార్మికులపై దారుణంగా అణచివేతకు దిగారని, కార్మికుల నిరసనలను నేరపూరితం చేశారని విమర్శించింది. పైఆ కార్మికులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని ఖండించింది.

కార్మికులపై ఇటువంటి బల ప్రయోగాన్ని సీఐటీయూ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిం చింది. ఈ సమస్య ఇక్కడకు మాత్రమే చెందినది కాదని, దేశవ్యాప్తంగా పలు పారిశ్రామిక సంస్థల్లో కాంట్రాక్టు కార్మికుల దుస్థితి ఈ విధంగానే వుందని పేర్కొంది. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీలకు చెందిన సంయుక్త ప్రతినిధి బృందం జిల్లా అధికారులను, పోలీసు ఉన్నతాధికారులను కలిసి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని కోరింది. తక్షణమే కార్మికులపై అన్ని కేసులను ఉపసంహరిం చాలని, దోషులైన కాంట్రాక్టర్లను, అధికారులను ఇందుకు జవాబుదారీగా చేయాలని, కార్మికుల చట్టబద్ధమైన డిమాండ్లను ఆమోదించడం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలను, ఐఓసిఎల్‌ యాజమాన్యాన్ని సీఐటీయూ కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -