విద్యుత్ షాకిస్తున్న అక్షరాల్ని
ఎవరో దండెం మీద ఆరేశారు
మంచుకొండ మీదా
ఎంతకాలం తడి కనిపించని ఎండ కప్పుతాం
కుంకుమ పూల నెత్తుటి ధార
పక్కు కట్టిన అపారదర్శక వాతావరణ మొకటి
కళ్ళు తిప్పుతుంటుంది
ఆక్రోటుకలప కడుపులో దాచుకున్న
ఉద్రిక్త పిడికిళ్ళ శిల్పం గాలికి శ్వాసాడదు
కళ్ళమీద కట్టిన దుఃఖాన్ని గుడ్డుతో పెకిలించారు
ఒంటరి కనురెప్ప నిర్జీవంగా ఎగరేసిన జెండాలా ఊగుతుంటుంది
గడ్డ కట్టిన దాల్ సరస్సు కమలాలు
పర్యాటకుల చూపై కొన్ని గంటలు నవ్వుతాయేమో
దుఃఖపు పొరల కింద రొండు ముక్కలైన కోరికొకటి
గొంతు మీద ఉక్కునాడ తో నెత్తురోడ్తుంటుంది
మాటలు పొక్కనీయని కత్తెరొకటి
సుకుమార సౌందర్యంగా
ప్రపంచం కళ్లల్లో హరివిల్లై నర్తిస్తుంటుంది
అయినా వెలుగు సముద్రాలు
ఏ చీకటి గుహలో ఇమడవు
శ్మశాన వాటిక పొత్తిళ్ళలో
నెత్తుటి తర్పణ గత మొకటి కళ్ళు నులుపుకుంటూ
నెత్తుటి పేజీలు తిప్పుతుంటుంది
– వడ్డెబోయిన శ్రీనివాస్, 9885756071
వెలుగు సముద్రాలు
- Advertisement -
- Advertisement -