కేరళ అత్యున్నత సినీ పురస్కారానికి ఎంపిక
ప్రకటించిన ఆ రాష్ట్ర మంత్రి సాజి చెరియన్
తిరువనంతపురం : ప్రముఖ సీనియర్ నటిి శారద అరుదైన గౌరవం అందుకున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు ఆమె చేసిన జీవితకాల సేవలకుగాను కేరళ ప్రభుత్వ అత్యున్నత సినీ పురస్కారమైన ‘జేసీ డేనియల్ అవార్డు-2024’కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేరళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సాజి చెరియన్ శుక్రవారం తిరువనంతపురంలో అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు కింద రూ. 5 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేస్తారు. జనవరి 25న తిరువనంతపురంలో జరిగే కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేతుల మీదుగా శారద ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో 1945 జూన్ 25న వెంకటేశ్వరరావు, సత్యవాణి దేవి దంపతులకు శారద జన్మించారు.
ఆమె అసలు పేరు సరస్వతీ దేవి. తెలుగులో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంతో నటిగా అడుగుపెట్టి, తన పేరును శారదగా మార్చుకున్నారు. 1965లో ‘ఇణప్రావుకళ్ణ చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి ప్రవేశించారు. ‘తులాభారం’ (1968), అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన ‘స్వయంవరం’ (1972) చిత్రాలకుగాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారాలు అందుకున్నారు. తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ (1977)తో మూడోసారి జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు. ‘మురప్పెన్ను’, ‘త్రివేణి’, ‘మూలధనం’, ‘ఇరుట్టింతె ఆత్మావు’, ‘ఎలిప్పతాయం’, ‘ఒరు మిన్నామినుంగింటె నురుంగువెట్టం’, ‘రాప్పకల్ణ వంటి ఎన్నో మరపురాని చిత్రాలలో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 125కు పైగా మలయాళ చిత్రాలలో నటించి, అక్కడి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. ఇలాంటి గొప్ప నటికి రాష్ట్ర అత్యున్నత సినీ పురస్కారం అందించడం సముచితమని జ్యూరీ పేర్కొంది.
సీనియర్ నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- Advertisement -
- Advertisement -



