Monday, September 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా జరపాలి

సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా జరపాలి

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి కూనంనేని లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆదివారం ఆయన లేఖ రాశారు. 1947, ఆగస్టు 15న భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు. కానీ హైదరాబాద్‌ సంస్థానానికి రాలేదని తెలిపారు. హైదరాబాద్‌ సంస్థానంలో నైజాం, రాచరిక పాలన, భూస్వాములు, రజాకార్ల ఆగడాలు పరాకాష్టకే చేరాయని విమర్శించారు. దీంతో 1948, సెప్టెంబర్‌ 11న ఆంధ్రమహాసభ తరఫున రావి నారాయణరెడ్డి, ఏఐటీయూసీ తరఫున మఖ్దూం మొహియుద్దీన్‌, కమ్యూనిస్టు పార్టీ తరఫున బద్దం ఎల్లారెడ్డి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. ప్రజలంతా ఏకమై తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. 1948, సెప్టెంబర్‌ 17న పోలీసు చర్య పేరుతో హైదరాబాద్‌లోకి భారత సైన్యం ప్రవేశించగానే నిజాం లొంగిపోయారని తెలిపారు. అదేరోజు భారతదేశంలో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైందని వివరించారు.

గతేడాది తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవంగా ప్రభుత్వం జరిపిందని తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రజాపాలన దినోత్సవంగా జరపడం వల్ల నాటి చారిత్రక పోరాటాన్ని ఏ మాత్రం ప్రతిబింబించడం లేదని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా జరపడం సముచితమని సూచించారు. సాయుధ పోరాట చరిత్రను జాతీయ, రాష్ట్రస్థాయిలో పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. అమరవీరుల స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రావి నారాయణరెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్‌, బద్దం ఎల్లారెడ్డి, దొడ్డి కొమరయ్య, షేక్‌ బందగీ, బొమ్మగాని ధర్మబిక్షం, చాకలి ఐలమ్మ లాంటి సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి పేర్లు చిరస్థాయిగా నిలిచేలా ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు పెట్టాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -