భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. పదిహేను నెలల పాటు ఈ బాధ్యతలో వుండి ఆయన 2027 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేస్తారు. హర్యానా నుంచి ఈ పదవిలోకి వస్తున్న తొలి వ్యక్తి ఆయన. 1985లో హిస్తార్‌లో న్యాయ వాదిగా బయలుదేరిన జస్టిస్ సూర్యకాంత్ 2000 సంవత్సరంలో తన 38వ యేటా అతి చిన్న వయసులోనే అడ్వకేట్ జనరల్ కాగలిగారు. 2004లో పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూరి అయ్యారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక 2018లో హిమచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా చేశారు. ఇటీవలి కాలంలో కాస్త చెప్పుకోదగినంత అంటే ఏడాదికి పైన సిజెఐగా కొనసాగిన వారిలో జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత అధిక పదవీకాలం జస్టిస్ సూర్యకాంత్‌దే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టనున్న సమయం మాత్రం దేశానికీ, రాజ్యాంగానికీ, అంతకుమించి రాజ్యాంగ విలువలకూ పెద్ద సవాలు విసురుతున్న కాలం. ఎవరో ఎందుకు? ఇప్పుడు దిగిపోనున్న సిజెఐ బిఆర్ గవారు పదవీకాలంలో చేదు అనుభవాలే అందుకు సాక్ష్యం. జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత దేశానికి రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారు. ఆయన మీద నిండు న్యాయస్థానంలో సీనియర్ న్యాయవాది చెప్పు విసిరితే ఎలాంటి చర్య కాదు కదా, చట్టపరమైన అభిశంసన, మందలింపు కూడా లేకుండా పోయింది. మామూలుగా ధర్మాసనంలో కూచున్న న్యాయమూర్తుల వ్యాఖ్యలకు రాజ్యాంగ రక్షణ వుంటుంది. కానీ ఇక్కడ సిజెఐకే ఆ రక్షణ లేకుండా పోయింది.
చెప్పు విసిరినా సమర్థనా?
ఖజరహో ఆలయ సముదాయంలో ధ్వంసమైన విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు ఉత్తర్వులిచ్చే అధికారం తనకు లేదని జస్టిస్ గవారు ఒక ప్రజావాజ్యం విచారణ సందర్భంలో చెప్పారు.అందుకోసం ఎఎస్‌ఐ అనే పురావస్తు సంస్థను ఆశ్రయించాలని సూచించారు. అయినా పిటిషనర్లు మొండిగా వాదిస్తుంటే ఆ విష్ణుమూర్తికే చెప్పుకోండి అన్నారు. ఇందులో ఎవరినీ అవమానించిందేముంది? అన్నిటికీ దేవుడే దిక్కు అన్నది అన్ని మతాల నమ్మకమే కదా? కానీ ఇది హిందూమతాన్ని అవమానించడమేనని దుమారం లేవదీశారు. తాను అన్ని మతాలనూ గౌరవిస్తాననీ ఎవరినీ కించపరచే పని చేయడం జరగదని సిజెఐ స్పష్టంగా వివరణ ఇచ్చారు. అయినా సరే రాకేశ్ కుమార్ అనే మతతత్వ న్యాయవాదికి అదే ఘోర అపరాధంగా కనిపించింది. దానికి పాద రక్షణతో శిక్ష విధించాలను కున్నాడు. ఆఖరి నిమిషంలో ఆయన దాడి విఫలమైనా గవారు ఉపేక్షించి వదిలేశారు. ఇలాంటి వాటికి తాను ప్రభావితుణ్ని కాబోనన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కూడా తేలిగ్గా వదిలేశారు.అయితే ఇప్పటికీ సిజెఐ వ్యాఖ్యలే తప్పయినట్టు, కేవలం ఉద్వేగం వల్లనే రాకేశ్ అలా ఆవేశపడినట్టు సమర్థనలు సాగుతూనే వున్నాయి. తాజాగా మోడియా ప్రముఖుడు ఆర్నాబ్ గోస్వామి ఇంటర్వ్యూలో సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కూడా మాటల్లో సంయమనం వుండాలని హిత వచనాలు చెబుతున్నారు. ఈశ్వర అల్లా తేరేనాం అన్నందుకు గాంధీని చంపిన గాడ్సేను సమర్థించడం ఎలాంటిదో చెప్పు విసిరిన రాకేశ్‌కు వంతపాడటం లేదా నామకార్థపు ఖండనలతో సరిపెట్టడం అలాంటివే. అయితే ఇది దేశంలో ప్రస్తుత పరిస్థితికి అద్దంపట్టే ఘటన. సిజెఐకే రక్షణ లేని గౌరవం లేని తరుణంలో ఆ వ్యవస్థ గౌరవాన్ని అంతకన్నా మించి బాధ్యతా నిర్వహణను హక్కులను కాపాడుకోవడం ఎలాగన్నది అసలైన సవాలు. ఇలాంటి తరుణంలో జస్టిస్ సూర్యకాంత్ 43వ సిజెఐ అవుతున్న తరుణంలో ఇది అందరికీ ఆలోచింపచేస్తున్న విషయం. ఎన్నికల సంఘం కుట్ర అంటున్న ‘సర్’ తుదితీర్పుతో సహా అనేక కీలక కేసులు కోర్టు ముందున్నాయి. ఇందులో సర్ కేసు విచారణలో ఆయన సభ్యులుగా వున్నారు కూడా. రాజద్రోహం సెక్షన్లకు కాలం చెల్లిందని తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ వున్నారు. పెగాసిస్ నిఘా పరికరాలపై సమీక్ష,చార్‌ధామ్ క్షేత్రంలో నవీనీకరణ వల్ల పర్యావరణకు ముప్పు అన్న వాదన కొట్టివేత,ఇవన్నీ ఆయన విచారించిన వాటిలో కొన్ని.
మిశ్రమ సూచనలు
ఇంటిపని చేసేవారి హక్కుల కోసం ఏదైనా చట్టం చేయాలని ఒకసారి ఆదేశించారు.2022లో పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన సందర్భంలో భద్రతా లోపాలు సంభవించాయనేదానిపైనా చర్యలకు ఆదేశించారు. అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ మైనార్టీ ప్రతిపత్తి కేసు తీర్పులోనూ వున్నారు.పశ్చిమ బెంగాల్‌లో సింగూరు భూమిని తిరిగి గమకు ఇచ్చేయాలని ఓ కంపెనీ వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన కేసు,బిల్డర్లు బ్యాంకు అధికారుల కుమ్మక్కుతో నిధులు గల్లంతుపై దర్యాప్తు, అసోంలో బూటకపు ఎన్‌కౌంటర్ల విచారణ, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణలో ప్రయివేటు కాంట్రాక్టర్లు లాభపడుతున్న తీరు వంటి అంశాలపై ఆయన కీలకమైన తీర్పులు ఇవ్వడం లేదా ఆ ధర్మాసనాలలో వుండటం సంభవించింది. అదే సమయంలో రణవీర్ అల్హాబాదియా, తదితర స్టాండప్ కమెడియన్లకు సంబంధించిన పలు కేసుల్లో జస్టిస్ సూర్యకాంత్ కఠినతరమైన ఆదేశాలిచ్చారు. భావ ప్రకటనా స్వేచ్ఛ ఏదైనా మాట్లాడేందుకు లైసెన్సు కాదన్నారు.ఆపరేషన్ సింధూర్ సందర్భంలో సైన్యం తరపున మాట్లాడిన సోఫియా ఖురేషిపై మధ్య ప్రదేశ్ మంత్రి విజరుషా అనుచిత మత వ్యాఖ్యలు చేయడాన్ని కూడా జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా మందలించారు. జమ్మూ కాశ్మీర్ 370 అధికరణం రద్దును సమర్థిస్తూ తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ ఆయన భాగస్వామిగా వున్నారు. తాజాగా బాబరీ మసీదుకు సంబంధించిన ఒక పోస్టుపై ఆయన ఆగ్రహం ప్రదర్శించడం అందరిలో ఆసక్తి కలిగించింది. టర్కీయేలో సోఫియా మసీదులా బాబరీ మసీదును ఎప్పటికైనా పునర్నిర్మాణం చేస్తామంటూ 2020లో పెట్టిన పోస్టు ఈమధ్య సుప్రీంకోర్టుకు వచ్చింది. దానిపై కింద కోర్టు చర్యకు ఆదేశించగా పిటిషనర్ లక్నో హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. అక్కడ దాన్ని తోసిపుచ్చారు. దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం జోక్యం చేసుకోవడానికి నిరా కరించింది. విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. అయినా ఆ పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థనలు వాదనలు కొనసాగించడంతో జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు.మీరు ఉపసంహరించుకునే అవకాశం మీకే ఇస్తున్నాను. లేదంటే భారీ ఖర్చులతో కొట్టివేయడమేగాక తీవ్ర వ్యాఖ్యలు చేసే అవకాశముంటుంది. అని హెచ్చ రించారు. అత్యున్నత న్యాయస్థానమే ప్రతికూల వ్యాఖ్యలు చేస్తే కింద మరీ కష్టమనే భయంతో వారు దాన్ని ఉపసంహరించుకున్నారు.
అభ్యంతరాలు, అసలు సవాళ్లు
మొత్తం మూడువందల బెంచీలలో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ ఇచ్చిన తీర్పుల గురించి ఇలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ రచనల ఆవిష్కరణ సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు కూడా న్యాయవర్గాలను ఆకర్షించాయి. న్యాయపరంగా నిష్పాక్షికత పాటిం చడం,నిర్మమ్ణకారంగా వ్యవహరించడం, అదే సమయంలో సమాజంతో సంబంధాలు పాటిస్తూ వారి మనోగతాలు తెలుసుకోవడం న్యాయమూర్తులు అనుసరించాల్సిన మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ ఇంజనీరింగ్, సమాజ స్థాయి పెంచడం జరగాలన్నారు. మొత్తంపైన రాజ్యాంగంపై లౌకికతత్వంపై మానవ హక్కులపై దాడిని ఆపాలనే రీతిలో ఆయన మాట్లాడింది తక్కువే. సాంకేతికాంశాలు, కేసుల పెండింగు తగ్గించడం,మౌలిక వసతులు పెంచడం వంటివాటిపై ఎక్కువగా కేంద్రీకరిస్తారు. ఇక వివాదాస్పద విషయాలకు వస్తే 2018లో సూర్యకాంత్‌ను పంజాబ్ హైకోర్టునుంచి హిమచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసినప్పటి సమయంలోనూ, సుప్రీంకోర్టుకు ఆయన పేరు వచ్చిన తరుణంలోనూ బహిరంగంగానే అభ్యంతరాలు వచ్చాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎకెగోయల్ ఆయన పేరుపై వున్న అభ్యంతరాలు ఆరోపణలతో లేఖ రాశారు. సీనియర్ న్యాయమూర్తులు అప్పటి సిజెఐ దీపక్‌మిశ్రా తీరుపై విమర్శలతో మీడియా ముందు మాట్లాడిన సమయంలోనే ఇదీ జరిగింది. గోయెల్ లేఖను తప్పు పడుతూ మరికొంత మంది లాయర్లు కూడా మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో కొలీజియం ముందుకు వచ్చిన పేర్లలో రెండింటిని ఆమోదించి జస్టిస్ సూర్య కాంత్‌తో సహా మరో పేరును పక్కనపెట్టారు, అయితే తర్వాత జస్టిస్ మదన్ బి.లోకూర్ పదవీ విరమణ జరిగి కొలీజియం రూపుమారింది. ఆ స్థానంలో మోడీ పొగడ్తలలో శ్రుతిమించి విమర్శలు తెచ్చుకున్న జస్టిస్ అరుణ్ మిశ్రా కొలీజియంలోకి వచ్చాక జస్టిస్ సూర్యకాంత్ పేరును కూడా సుప్రీంకోర్టుకు సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఆ విధంగా 2019లో బిఆర్‌గవారు, సూర్యకాంత్‌లు సుప్రీంకోర్టు న్యాయ మూర్తులుగా ప్రతిపాదన వచ్చిన రోజునే వారు ప్రధాన న్యాయమూర్తులవుతారనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మన సుప్రీంకోర్టులో అత్యధిక సీనియర్లుగా వున్నవారినే ప్రధాన న్యాయమూర్తిగా చేస్తారు, అయితే హైకోర్టులకైనా సుప్రీంకోర్టుకైనా ఏ సిఫార్సును ఎప్పుడు ఆమోదిస్తారు, ఎంత కాలం ఆపేస్తారన్నది ఈ నియామకంపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుంది.నచ్చని వారిని కేంద్రం కావాలనే జాప్యం చేస్తుందని న్యాయవర్గాలు డజన్ల కొద్ది ఉదాహరణలతో చెబుతుంటారు. ఈ కారణంగా సమర్థులు, అర్హులు అయిన అనేకమంది న్యాయమూర్తులు పైస్థాయికి చేరకుండానే పదవీ విరమణ చేయాల్సి వస్తుంటుంది. ఇక వారికి నియామక ఉత్వర్వు ఇచ్చిన తేదీ సమయం ప్రమాణ స్వీకారం చేసిన వరస ఇవన్నీ సీనియారిటీకి కొలబద్దలవుతాయి. వ్యక్తిగత పూర్వరంగం ఒకటైతే న్యాయ వ్యవస్థ ముందు ఇప్పుడున్న తీవ్ర సవాళ్లు ఒత్తిళ్లు, మితవాద మొగ్గు పెరుగుతుందన్న విమర్శలు ఉదంతాల నేపథ్యంలో కొత్త సిజెఐ సూర్యకాంత్ తీరుతెన్నులు ఎలా ఉంటాయో చూడాలి. ఆయన హయాంలో అనేక కీలక మార్పులను తీసుకురావాలని మోడీ సర్కారు పథకాలు రచిస్తున్నట్టు చెబుతున్నారు. దేశంలో లౌకిక ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, సమాఖ్యతత్వం, దేశ సార్వభౌమత్వం పరిరక్షణలో సప్రీంకోర్టు కీలక పాత్ర వహించాలని ప్రజాస్వామ్య ప్రియులు కోరుకుంటారు.
తెలకపల్లి రవి



