– శివాజీ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులపై కేసు
నవతెలంగాణ – కాటారం
ఫిబ్రవరి 19, 2026న కాటారం నుండి మహాదేవపూర్‌కు వెళ్లే నేషనల్ హైవేపై అనుమతి లేకుండా స్టేజ్ ఏర్పాటు చేసి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘటనపై పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది. దాదాపు 8 గంటల పాటు రహదారిపై స్టేజ్ ఏర్పాటు చేయడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిందని, ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి శివాజీ జయంతి ఉత్సవాల ఆహ్వాన పత్రికలో పేర్కొన్న ఉత్సవ కమిటీ సభ్యుల్లో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణలో ప్రజా రవాణాకు అంతరాయం కలిగించిన మిగతా సభ్యుల పాత్రను కూడా పరిశీలించి, అవసరమైతే వారిని కూడా కేసులో చేర్చే అవకాశముందని తెలిపారు.
ఈ కేసు నమోదు పై కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరించింది.



