నవతెలంగాణ – కామారెడ్డి
రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన మాజీ జెడ్పిటిసి, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి అంతిమయాత్రలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ పాల్గొని తన మానవత్వాన్ని చాటుకున్నారు. మోహన్ రెడ్డి నివాసానికి చేరుకున్న షబ్బీర్ అలీ ఆయన పార్థివ దేహంపై పూలగుచ్చం ఉంచి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
తదుపరి జరిగిన అంతిమయాత్రలో షబ్బీర్ అలీ స్వయంగా పాడే మోసి తన ముఖ్య అనుచరుడి పట్ల ఉన్న ఆత్మీయతను, అనుబంధాన్ని చాటుకున్నారు. అందరితో కలిసి నడుస్తూ చివరి యాత్రలో పాల్గొనడం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, “మోహన్ రెడ్డి పార్టీకి నిబద్ధతతో పనిచేసిన మంచి నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. వారి కుటుంబానికి ఎల్లప్పుడూ నేను అండగా ఉంటాను” అని తెలిపారు.



